రమణుల మాటల్లో ఆధ్యాత్మిక సందేశాలు స్ఫురిస్తాయి. ఆయన చూపు చాలామందికి కొరుకుడు పడదు. అది ఎక్కడో సుదూరంగా ఉన్నవారిని చూస్తున్నట్టు ఉంటుంది. తమరెవర్ని చూస్తున్నారంటూ ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు... ‘నన్ను నేను చూసుకుంటున్నాను. చూడటానికి, చూసుకోవడానికి నా కంటే నాణ్యమైన వస్తువు ఏముంటుంది?’ అంటూ సమాధానం ఇచ్చారాయన. ఓ భక్తురాలు తనతో విదేశాలకు రమ్మని కోరినప్పుడు, ‘నేను స్థల కాలాలకు అతీతుణ్ణి. మీరింకా అరుణాచలంలోనే ఉన్నారు కానీ నేను దేశ దేశాలు చూసి వస్తున్నాను’ అన్నారు. ఒక భక్తుడు పండ్లు తెచ్చి తినమన్నపుడు ‘ఆశ్రమంలో ఇన్ని వందల నోళ్లు ఉండగా వీటన్నిటినీ నా ఒక్క నోటితో తినాలా?’ అన్నారు. అందరి ఆకలి తీరితే తన ఆకలి తీరినట్లేనన్న మర్మ సందేశాన్నిచ్చారు. ఓ భక్తుడు రమణుల ఫొటో తీసి ఇచ్చారు. ఆయన దాన్ని ముందుకీ వెనక్కీ తిప్పి తిప్పి చూసి ‘ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆత్మ గురించి తెలియని శరీరం. వెనుక తెల్లని ఖాళీ స్థలంలో శరీరాన్ని ఎరుగని ఆత్మ ఉంది. ఒకదాని వెనుక మరొకటి ఉన్నాయి. ముందు కళ్లు మూసుకుని చూస్తే తర్వాత కళ్లు తెరిచి అసలు వస్తువైన ఆత్మను చూడొచ్చు. సాధన అంటే ఇదే’ అంటూ విడమర్చి చెప్పారు. కళ్లు మూసుకుని చూడాల్సింది తమ అంతరంగంలోకి. అంటే ఆత్మ అన్వేషణ చేయాలని సందేశమిచ్చారు. ఒకరు పుట్టినరోజు ప్రస్తావన తేగా ‘ఆత్మను తెలుసుకున్న రోజే అసలైన పుట్టినరోజు’ అన్నారాయన. ముక్తి-మోక్షాలకు రమణులు ఇచ్చిన నిర్వచనమూ విలక్షణమైందే. ‘ఈ రెంటికీ అర్థం ఎక్కడో ఉన్న వేరే లోకాలకు వెళ్లిపోవడం కాదు, రెండింటిలోనూ అహాన్ని, భ్రాంతిని తొలగించుకోవడమే నిజమైన మోక్షమూ, ముక్తి. అలాంటివారు జీవించి ఉండగానే జీవన్ముక్తులు అవుతారు’ అన్నారు.
No comments:
Post a Comment