X.xi. 1-8. 191022-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
ఆరోజులు తిరిగొస్తాయా?
➖➖➖✍️
టైం మెషిన్ లో 50 ఏళ్ల క్రితం
అర్ధశతాబ్ద పూర్వం జీవన శైలి…!
ఉదయం పళ్ళు తోముకోవడానికి వేపపుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందుం పుల్లలు అని కూడా అనే వారు.
కొంతమంది కచ్చిక (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళ పొడితో పళ్ళు తోముకునే వారు. తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచు కోవడానికి ‘టంగ్ క్లీనర్స్’ లా ఉపయోగించేవారు.
మొగ వాళ్ళు చాలా మంది నూతి దగ్గరే నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనే వారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయి నిచ్చేది. చలి కాలంలో మాత్రం వేడి నీళ్ళు ఉండేవి.
ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రల పొయ్యి, లేదా పొట్టు పొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్ర మైన విషయం. Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మే వారు.
కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీ పొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరు లెక్కన అమ్మే వారు.
బొగ్గుల కుంపటి మీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది UMRAO వత్తుల స్టౌ (కిరసనాయిలుది) / పంపు స్టౌ వాడేవారు.
అదే విధంగా గా బరువులను….. వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం( పావు వీశ)గా తూచే వారు.
ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించే వారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెల తోనే. అందరి ఇళ్లలోనూ రాచ్చిప్పలు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు, ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచే వారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బురోట్లోనే.
అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ, బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి.
అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు.
బియ్యంలో అక్కుళ్లు, ఆట్రగడ్డలు, వంకసన్నాలు, SLO, నెంబర్లు, కిచిడి అనే రకాలు ఉండేవి. అక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం. వంక సన్నాలు, SLO మధ్య రకం. నెంబర్లు, కిచిడి బియ్యం అంటే సన్నబియ్యం. మసూరీ బియ్యం ఇంకా ఖరీదు.
సీతారామాభ్యానమః అని యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇళ్ళకు వచ్చి తిథి వార నక్షత్రాలు చెప్పి (ఇప్పుడు WhatsAppలో రోజూ ఉదయం పంచాంగం పోస్ట్ చేస్తున్నట్టుగా) వెంటనే వెళ్లి పోయేవారు. వెళ్లిపోయే లోపులో గృహస్థులు అందరూ గుప్పెడు బియ్యం వేసే వారు. ఒక వేళ మిస్స్ అయితే ఏదో తప్పు చేసినట్లుగా, అపరాధ భావనతో ఉండి, మర్నాడు ముందే రెడీగా ఉండి, రెండు గుప్పెళ్లు వేసేవారు బియ్యం.
రాత్రిపూట 7, 8 గంటలకు మాదాకబళం తల్లీ అంటూ వచ్చేవాళ్లకి ఆరాత్రి తినగా మిగిలిన అన్నం, కూరలు ఇచ్చేవాళ్ళు. చిన్న పిల్లలు పేచీ పెడుతుంటే మాదాకబళo అబ్బాయికిచేస్తానని భయపెట్టేవారు తల్లులు.
టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి / ఎర్ర నూక ఉప్మా లాంటివి ఉండేది. అప్పుడప్పుడూ ఇడ్లీలు, పూరీలు.
ప్రతిరోజూ ఉదయం పూట చద్దిఅన్నంలో చింతకాయ లేదా గోంగూర , ఉసిరికాయ పచ్చడి, మజ్జిగ.
పిల్లలు అందరూ 3,4 పూటలు అన్నం తినే వారు. భోజనం ఎప్పుడూ వంటింట్లో నేల మీద పీట వేసుకునే. తినడం అయ్యేక తిన్న చోట నీళ్ళు జల్లి శుద్ధి చేసేవారు. ప్రతి రోజూ రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు.
ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పడుకొనే వాళ్ళం బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలిగదిలో పడుకునే వారు.
డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం అనే పదాలే తెలియవు. చాలా మటుకు 3 గదుల ఇళ్లే. కొంచం స్థితి మంతులు ఐతే 4 గదులులోనూ, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండే వారు.
3 వరుస గదుల ఇల్లు అద్దె నెలకి - 27 రూపాయలు. కరెంటు -1 బల్బు కి నెలకు 1 రూపాయి. అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకి 30/-అద్దె ఉండేది.
వైద్యం కి RMP డాక్టర్స్ ఉండే వారు. వాళ్లు చెయ్యి పట్టుకు చూసి, బిళ్ళలు, అరకు ఇచ్చే వారు. జ్వరం తగ్గే వరకూ లంఖణమే. తర్వాత bread, జావ, ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనే వారు. డాక్టర్ భుజం తట్టి ‘తగ్గిపోతుందిలే!’ అనేమాటకే సగం జ్వరం తగ్గిపోయేది.
ఇంకా, పిల్లల చదువుల మీద ఎక్కువ వత్తిడి ఉండేది కాదు. బాగా చదువుకోమని చెప్పే వారు. అంతే. ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలని టెన్షన్ కి గురి చేసే వారు కాదు.
పుస్తకాలు ఎప్పుడు 2nd hand వే. పైతరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం రేట్ కి టెక్స్ట్ బుక్స్ కొనే వారు. నోట్స్ అన్నీ తెల్ల కాగితాల పుస్తకాలే. సింగిల్ రూల్లు, బ్రాడ్ రూళ్లు, పెన్సిల్ తో కొట్టుకోవడమే. Last year నోట్ బుక్స్ లో మిగిలిన తెల్ల కాగితాలు అన్నీ చింపి, ఒక కొత్త బుక్ లా కుట్టించుకుని నెక్స్ట్ ఇయర్ లో రఫ్ బుక్ గా వాడుకునే వారు.
రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినే వారం అర్థం అయినా కాకపోయినా. రాత్రి పెందరాలే నిద్ర. వేసవి కాలం అయితే ఆరుబయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కలమీద. ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసినికర్రే.
ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కి కూడా లైసెన్స్ ఉండేది. 2 రూపాయలు పెట్టి ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కుని సైకిల్ కి బిగించేవారు.
అదీ ఆరోజుల్లో జీవన శైలి!
ఎవరికీ ఏ చీకూ చింతా ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించే వారు. సంతోషంగా కాలం గడిపేసే వారు. ఆనందంగా భాద్యతలు నిర్వహించేవారు.
ఆ రోజులు మరలా వస్తే ఎంత బాగుండును.. రావాలని ఆశిద్దాం.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment