Tuesday, October 11, 2022

నరక ద్వారాలు

 *నరక ద్వారాలు*

 మరణానంతరం పుణ్యాత్ములు చేరుకునే లోకం స్వర్గమని, పాపాత్ములు చేరుకునే లోకం నరకమని పురాణాలు, ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నరకానికి వెళ్ళినవారు యమ యాతనలకు గురవుతుంటారని ప్రాచీన గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. పుణ్యం దైవసంపద. అందుకే ఫుణ్యం చేసినవారికి దేవతల నివాసమైన స్వర్గం సంప్రాప్తిస్తుందంటారు. పాపం రాక్షస లక్షణం. అందుకే పాపం చేసినవారికి నరకం లభిస్తుందంటారు. పుణ్యాలే చేయాలని, పాపాలను చేయకూడదని ప్రాచీన పురాణాల సిద్ధాంతం. మనిషిని నరకానికి చేర్చే ద్వారాలు మూడు ఉన్నాయని, అవే కామక్రోధలో బాలని భగవద్గీత చెబుతోంది. ఈ మహనీయ గ్రంథంలోని పదహారో అధ్యాయం అంతా దైవాసుర సంపదలను గురించి వివరించి చెబుతోంది. పాపాత్ములను తన దగ్గరికి చేర్చేది నరకమని నిఘంటువులు చెబుతున్నాయి. అనేక సుఖాలకు ఆలవాలమైంది. స్వర్గమని నిఘంటువులు సూచిస్తున్నాయి. మనిషి సుఖాలనే కోరుకుంటాడు కానీ దుఃఖాలను కోరుకోడు. స్వర్గనరకాలు ఉన్నాయో లేదో ఎవరికీ తెలియదు కాని మానవులు మంచిపనులే చేయాలని, చెడుపనులు చేయకూడదని ప్రబోధించడానికే స్వర్గనరకాల ప్రసక్తి వచ్చిందనుకున్నా మంచిదే.

దైవసంపదలేవో, అసుర సంపదలేవో భగవద్గీత విడమరచి చెప్పింది. భయం లేకుండా ఉండటం, మానసిక పవిత్రత, తత్త్వజ్ఞానాసక్తి, దానశీలం, ఇంద్రియ నిగ్రహం, సమర్పణ భావం, అధ్యయనా బిరుచి, నిశ్చల స్థితి, రుజువర్తన, అహింస, సత్యవాక్యం, క్రోధరాహిత్యం, త్యాగం, శాంతగుణం, పరులను నిందించకపోవడం, దయా గుణం, అత్యాశ లేకపోవడం, మృదు స్వభావం, తప్పులకు దూరంగా ఉండటం, వ్యర్ధ చేష్టలు మానివేయడం. వంటివి దైవగుణాలు. వీటికి విరుద్ధంగా ఉండేవన్నీ అసుర గుణాలు. కపటం, దర్పం, దురభిమానం, క్రోధం, కాఠిన్యం, అజ్ఞానం వంటివన్నీ రాక్షస స్వభావాలే. యుక్తాయుక్త విచక్షణ లేకపోవడం, నీచ స్వభావం, అసత్య భాషణం... ఇవన్నీ అసుర స్వభావాలు. రాక్షస స్వభావం కలిగిన మానవులు సంపదలు లభించగానే తాము అందరికంటే గొప్పవాళ్లమని జీవితంలో అన్నీ సాధించామని ఆపోహలకు గురవుతుంటారు. అన్నీ తమ ఆధీనంలోనే ఉన్నాయని, తాము తలచుకుంటే ఎప్పుడైనా, ఏదైనా చేయగలమని విగ్రవీగుతుంటారు. ఎవరినీ లెక్కచేయరు. తమకు తామే గొప్పవాళ్లమని భావించి, గర్వంతో ఉన్నాదంతో ధనమదంతో, కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తుంటారు. ఏ నీతినీ పాటించక, ఆడంబరాలతో అట్టహాసాలతో చెలరేగుతుంటారు.
"మనుషులను మంచిమార్గంలో నడపడానికే ధర్మశాస్త్రాలు దారి చూపుతున్నాయి. నియమాలను అనుసరించే జీవితాలు పూలబాటల్లో సాగిపోతాయి. నియమాలను ఉల్లంఘించి, అక్రమ మార్గాల్లో ప్రయాణించేవారికి దారిలో అన్నీ అవాంతరాలే ఎదురవుతాయి. అందరూ ఈసడిస్తారు. ఎవరూ ఆదరించరు. సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కామ, క్రోధ, లోభాలు మనిషికి పరమ శత్రువులే. కామం ధర్మబద్ధమైనంతవరకే సుఖదాయకం ధర్మ విరుద్ధమైతే దుఃఖదాయకమే. క్రోధం అనర్ధకారకమే గాక, అనారోగ్యప్రదం కూడా. లోభం తనకే 'గాక కుటుంబానికి కష్టనష్టాలను కలిగించి, బాధలకు గురిచేస్తుంది.

జ్ఞానం అనేది ఒక రత్నం. దాన్ని ధరించిన మనిషి అన్ని విధాలుగా రాణిస్తాడు. ఈ జ్ఞానరత్నాన్ని అపహరించడానికి దొంగల్లా కామక్రోధలోబాలు వెంటబడతాయని పెద్దల మాట. కనుక మనిషి తన శత్రువులెవరో, మిత్రులెవరో తెలుసుకొని ప్రవర్తించాలి. తెలివి కలగాలంటే విజ్ఞత ఉండాలి. విజ్ఞతకోసం మనిషి నిత్యం సాధన చేయాలి. అప్పుడే మనిషి నిజమైన మనిషి అవుతాడు! |

సేకరణ. మీ రామిరెడ్డి మానస సరోవరం 👏

No comments:

Post a Comment