*“సర్వ వస్తుం భయాన్వితం
భువి నృణాం
వైరాగ్యమేవాభయం”*
ఈ భూమిమీద మానవులు కలిగి ఉండే అన్ని వస్తువులకూ ఒక్కో భయముంటుంది. వైరాగ్యమొక్కటే భయం లేనిది.ఎలాగంటే డబ్బు,బంగారం,విలువైన వస్తువులకు చోరభయం,వాహనాలకు ప్రమాదభయం,భూములకు ఆక్రమణభయం,గృహాలకు తుఫానులు ,వరదలముంపు ,భూకంపాలు ఇత్యాదివలన నష్టభయం,క్షేత్రాలకు వరదలవల్ల, వర్షాభావంవల్ల పంటల నష్టభయం,అధికారాలకు పదవీచ్యుతభయం కాని వైరాగ్యానికి మాత్రం ఇలాంటి భయాలేవీలేవు. కాకపోతే ఆ వైరాగ్యం తాత్కాలికమైనది కాకూడదు.తాత్కాలిక వైరాగ్యాలంటే పురాణ వైరాగ్యం,ప్రసూతి వైరాగ్యం,స్మశాన వైరాగ్యం.
పురాణ వైరాగ్యం అంటే మనం ఒక చోట పురాణ శ్రవణానికి వెళ్తాం.ఆ పురాణ ప్రవచనాలూ,ప్రబోదాలూ వింటున్నంతసేపూ “అయ్యో! మనం ఇన్నాళ్ళూ ఎలా ఉంటున్నాం ఇటుపైని అలా ఉండకూడదు.మన జీవనపథం మార్చుకోవాలి.ఆధ్యాత్మిక చింతనతో మసలుకోవాలి.అప్పుడే మన జీవితానికి ఓ అర్థం,పరమార్థం.”అనుకుంటాం.వైరాగ్యాన్ని పొందుతాం. ఆ సభ కాస్త ముగియగానే ఆ వైరాగ్యం కూడా దానితోపాటే అక్కడితో మటుమాయమైపోతుంది. ఇంటికొచ్చిమనం మళ్ళీ మామూలుగానే ప్రవర్తిస్తాం.ఇదీ పురాణప్రభావం వల్లకలిగే వైరాగ్యం.
ఇక ప్రసూతి వైరాగ్యం – గర్భం దాల్చిన స్త్రీ ప్రసవిస్తున్నప్పుడు కలిగే నొప్పులనూ, తాను పడుతున్న వేదననూ తట్టుకోలేక ఇలాంటి పరిస్థితి మళ్ళీ తెచ్చుకోకూడదు అనే వైరాగ్యం ఆమెకు కలుగుతుంది. తీరా కాన్పు అయి తాను కన్న బిడ్డను చూసేసరికి ఆ వైరాగ్యం అంతటితో అంతరించిపోతుంది. ఇదీ ప్రసూతి బాధా జనిత వైరాగ్యం.
స్మశాన వైరాగ్యం – మన కుటుంబీకులో,బంధువులో,స్నేహితులో,లేక మనకు తెలిసినవాళ్ళెవరో గతిస్తారు. వారి భౌతిక కాయం వెంట మనమూ స్మశానానికి వెళ్తాం.అక్కడి వాతావరణానికి మనలో వైరాగ్యం ఉద్భవిస్తుంది. “ఎప్పటికైనా మనకీ ఈ దుస్థితి తప్పదు. ఈమాత్రం దానికి మనం మన కోరికలు తీర్చుకోవడంకోసం ధనార్జన చేయడంలోనే మన జీవితకాలాన్నంతా వెచ్చిస్తున్నాం. మన విలువైన సమయాన్నంతా వృధా చేస్తూ గడిపేస్తున్నాం.ఆవేశాలకు లోనవుతున్నాం.మనం చనిపోయినతర్వాత మనం మన వెంట తీసుకెళ్ళేది ఏదీ ఉండదని తెలుసు. అయినా దానాలు చేయకుండా లోభత్వాన్ని చూపిస్తున్నాం.వేటిమీదా వ్యామోహాన్ని విడనాడలేకపోతున్నాం.మనకు కలిగిఉన్నదానితో వినయంగా ఉండడంపోయి అహంకారపూరితులవుతున్నాం.మనకంటే ఎక్కువ కలిగిఉన్నవారిపై అసూయ చెందుతున్నాం.” ఇలా ఆలోచిస్తుంటాం అంతసేపూ.ఇంటికి రాగానే మళ్ళీ సంసార జంజాటంలో పడిపోతుంటాం.ఇదీ స్మశానంలో ఉన్నంతసేపూ మనం పొందే వైరాగ్యం.
ఓ దంపతులకు ఇలాగే వైరాగ్యం కలిగి సన్యాసం స్వీకరించడానికి ఇద్దరూ ఓ ఆశ్రమానికి వెళ్తున్నారు.భర్త ముందు నడుస్తున్నాడు.భార్య వెనకాలే వస్తుంది.కొంతదూరం వెళ్ళేక త్రోవలో భర్తకు ఓ సంచి కనబడింది.దాన్ని తీసి చూసేడు.అందులో బంగారు ఆభరణాలు ఉన్నాయి.” దీన్ని చూస్తే నా భార్య మనసు వైరాగ్యంనుండి మళ్ళుతుంది.సన్యసించదు.” అనుకుని దాన్ని భార్యకు కనబడకుండా దాచేయబోయేడు. కాని ఇంతలో భార్య చూడనే చూసేసింది.” అదేమిటి? అందులో ఏమున్నాయి? “ అని అడిగింది.భర్త అసలు సంగతి చెప్పేసేడు. అప్పుడు భార్య “ నా సంగతి సరే. ముందు మీకు ఇంకా మట్టికీ బంగారానికీ తేడా తెలుస్తున్నప్పుడు మీకు ఇంకా సన్యసించే అర్హత రాలేదు.లేకపోతే ఆ సంచీనిచూడగానే అక్కడే వదిలేసేవారు.” అంది.చూసేరా!అంచేత ఇలాంటి తాత్కాలిక వైరాగ్యాలు కాకుండా అసలైన వైరాగ్యాన్ని పొందితే అదీ ఓ భాగ్యమే.
No comments:
Post a Comment