జీవిత సత్యం
🔹🔸🔹🔸🔹🔸🔹
ప్రవేశించాక నిష్క్రమించక తప్పదు, ఇదే శాశ్వత సత్యం, చదువు పూర్తి కాగానే పాఠశాల నుంచి విద్యార్థులు నిష్క్రమిస్తారు, నియమిత కాలం తరవాత విరమణతో ఉద్యోగ వైభవం ముగుస్తుంది, జీవుడు దేహప్రవేశం చేశాక, ఆయువు తీరగానే నిష్క్రమిస్తాడు...
శరీరం అద్దె ఇల్లు లాంటిదంటారు జ్ఞానులు, సత్కర్మలే మనం చెల్లించే అద్ధె, భగవంతుడే గృహ యజమాని, దేహం కూడా ఆత్మకు గృహమే...
ఈ సత్యాన్ని చాలా మంది గ్రహించరు... ‘నేను’ అంటే దేహమేనన్న బలమైన అభిప్రాయంతో జీవిస్తుంటారు, ఒక మనిషి తన జీవితకాలంలో ‘పొందాలనే’ ప్రయత్నిస్తాడు, ఇవ్వాలనుకునే వారు బహుకొద్దిమంది.
ఈ లోకంలో మనదంటూ ఏముంది.. అన్నీ దైవానుగ్రహంతో పొందినవే, మరి వాటిమీద మనకేమి హక్కులుంటాయి... మనం కేవలం వినియోగదారులమే. సాధారణంగా, ఎవరూ ఇలా అనుకోరు...
భూమిని విభజించారు, హద్దులు ఏర్పరచారు, వ్యాపారానికి వాడుకున్నారు, కోటలు కట్టారు, ఆధిపత్యం కోసం యుద్ధాలు చేశారు... రక్తపుటేళ్లు పారాయి, స్వార్థం ఒక తీరని దాహం, ఆకాశాన్ని పిడికిట్లో బిగించాలనుకుంటుంది...
చుక్క మిగలకుండా సముద్రాలను తోడాలనుకుంటుంది, ఇవి రెండూ అసాధ్యమే, కానీ, ఊహకు అడ్డు ఏముంది....
ప్రపంచమంతా ఊహా సామ్రాజ్యమే, మనసులో తనకంటూ ఒక ప్రపంచాన్ని ప్రతి మనిషీ సృష్టించుకుంటాడు...
యోగ వాసిష్ఠంలో ఇదే విషయాన్ని అనేక ఉదాహరణలతో వసిష్ఠుడు చెబుతాడు...
కళ్లు తెరిచి చూస్తున్నదంతా భ్రమే, అది ఒకప్పుడు లేదు, భవిష్యత్తులో ఉండబోదు,
ఇందులోని వాస్తవం కొంతవరకు మనిషి అనుభవంలోకి వస్తుంటుంది...
మనల్ని కంటికి రెప్పలా అపురూపంగా చూసుకున్న పెద్దలు కనుమరుగైపోతారు, కొన్నాళ్లకు మనమూ అంతే...
లోక నిష్క్రమణ ఎప్పుడైనా ఎవరైనా చెయ్యవచ్ఛు వయసుతో నిమిత్తంలేదు, చిన్నవారు మరణిస్తే ఎక్కువగా బాధపడతాం.
కానీ, మృత్యువుకు ఆ తేడాలు ఉండవు, పసివారిని కూడా పట్టుకెళ్లిపోతుంది...
దేవకీ దేవి సంతానాన్ని పసి పిల్లలుగానే కంసుడనే మృత్యువు కబళించాడు,
ప్రతి మరణానికీ ఒక కారణం ఉంటుంది.
అలాగే ప్రతి జీవితానికీ ఒక ప్రయోజనం ఉంటుంది, మొదటిది నమ్ముతారు, రెండోది పట్టించుకోరు...
ప్రయోజనం అంటే మనం లాభపడటం కాదు, మనవల్ల ఇతరులకు మేలు జరగడం, ఇతరులు అంటే మనిషే కానవసరంలేదు.
పశు, పక్షి, వృక్ష జాతులేవి అయినా కావచ్చు...
ఉపకారం చెయ్యకపోయినా ఫర్వాలేదు, కావాలని అపకారం చెయ్యకూడదు, అది దైవాపరాధం అవుతుంది, సర్వం బ్రహ్మమయమే అయినప్పుడు ఏదీ హీనం కాదు.
గురునానక్ ప్రపంచంలోని అందరికంటే తాను ‘హీనాతిహీనుణ్ని’ అని చెప్పుకొన్నాడు, ఆ స్థాయి నుంచే ఆధ్యాత్మిక ప్రయాణం ఆరంభమవుతుంది...
అనంతమైన దైవసృష్టిలో మనం పరమాణువు కన్నా తక్కువే...
ఈ భావన నిగర్వానికి, అత్యంత వినయ విధేయతలకు సంబంధించింది, కృషిపరంగా మనం అమోఘ శక్తిని సాధించగలం.
ఈ రెండింటి మధ్య తేడాను సరిగ్గా అర్థం చేసుకోవాలి...
మనిషి చైతన్య శీలి. శిలలాగా నిశ్చలంగా ఒక చోట పడి ఉండలేడు...
జ్యోతి నుంచి జ్యోతి వెలిగినట్లు మనిషి మరో మనిషిలోని సుప్తచైతన్యాన్ని జాగృతం చెయ్యాలి.
ప్రవేశ నిష్క్రమణల మధ్యగల స్వల్పకాల జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలి..
🔹🔸🔹🔸🔹🔸🔹
No comments:
Post a Comment