ఎక్కువగా తిన్నవాడికీ, లేక అసలు తినకుండా కడుపు మాడ్చుకునేవాడికి, నిద్రమేలుకొనే వాడికి, తినగానే గుర్రుపెట్టి నిపోయేవాడికి ధ్యానయోగం చేయడం కుదరదు.
ఈ ధ్యాన యోగం అంటే యోగము అభ్యసించేవారు కొన్ని ఆహార నియమాలు పాటించాలి. ప్రతి మనిషి మూడు పనులతోనే తన పూర్తి జీవితం గడిపేస్తున్నాడు. అవి ఆహారము, నిద్ర, మైధునాలు.(మైథునము అంటే స్త్రీపురుషులు కలిస్తేకలిగే సుఖం). మొదటి రెండు తనకు తానుగా అనుభవించేవి. మూడవది రెండవ మనిషి సహకారంతో చేసేది. ఈ మూడు పనులు మానవులు చేస్తున్నారు. జంతువులు చేస్తున్నాయి. కాకపోతే జంతువులు ఒక నియమం ప్రకారం చేస్తున్నాయి. మానవులు ఏ నియమం పాటించకుండా ఆహార, నిద్ర, మైథునాలు అపరిమితంగా అనుభవిస్తున్నారు.
వేళాపాళలేకుండా, అర్థరాత్రి దాకా తాగుతున్నారు, తింటున్నారు. నిద్రపోవాల్సిన సమయంలో మేల్కొని, పగలంతా నిద్రపోతున్నారు. ఇక మైథునం సంగతి మన అందరికీ తెలిసిందే! ఒక నియమం లేదు. ఒక సమయం లేదు. చిన్నపెద్ద తేడాలేదు, వావివరసలు లేవు అందుకే నిర్భయ, అభయ చట్టాలు చేయాల్సి వచ్చింది. అయిన ఆగడం లేదు.
అందుకే ఆహారం ఎక్కువగా మితిమీరి తినకూడదు, మితంగా తినాలి. కడుపు నిండా భోజనం చేసి ధ్యానానికి కూర్చోకూడదు. గొంతుదాకా తింటే తిన్నది లోపల ఊరుకోదు కదా! దాని పని అది చేస్తుంది. కడుపులో గడబిడ, వికారము లేక త్రేపులు. ఇలా వీటితో సతమతమౌతుంటే ఇంక ధ్యానం ఏం కుదురుతుంది. కాబట్టి అధికంగా తినకూడదు.
ధ్యానానికే కాదు ఆరోగ్యరీత్యా కూడా మితంగా తినాలి. మితాహారము తింటే శరీరం తేలికగా ఉంటుంది.
అదేవిధంగా 'న చ ఏకాన్తమ్ అన్నతః" అంటే అసలు ఆహారం తీసుకోకపోవడం కూడా మంచిది కాదు. అంటే కటిక ఉపవాసం ఉన్నాకూడా శరీరంలో శక్తి ఉండదు. ధ్యానం కుదరదు. శరీరంలోని అవయవాలు అన్నీ సక్రమంగా పని చేయడానికి మితాహారం అవసరం. ఆహారం లేకపోతే అవయవాలు క్షీణించిపోతాయి. ఆహారము, మితంగా ఉంటేనే మంచిది.
ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. తిండికి, నిద్రకు అవినాభావ సంబంధం ఉంది. అతిగా తింటే నిద్రవచ్చే ప్రమాదం ఉంది. కళ్లు మూసుకోగానే నిద్రలోకి జారుకుంటే ఇంక ధ్యానం ఏం చేస్తాడు. అస్సలు నిద్రపోకుండా ఉంటేకూడా కళ్లు మూసుకోగానే నిద్ర ఆవహిస్తుంది.
కాబట్టి ధ్యానం చేయడానికి గానీ, ఏయోగాన్నైనా అవలంబించడానికి గానీ, మితాహారం, మితమైన నిద్ర అవసరం. ఏదీ అతిగా ఉండకూడదు.
🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏
#bhagavatgita #krishna #maditation #yoga #meditation #motivationalvideos #motivation #insprational #lovemaditation #follow #newpost #dailyquotes #dailygitapost #dailygitareadings #dailygitaquotes
No comments:
Post a Comment