🪔🪔అంతర్యామి🪔🪔
🐦🐦శాంతి పావురం🐦🐦
🐿️రసానుభూతులకు నిలయం మనోమందిరం. అనుభూతులు లేని జీవితం ఎడారి లాంటిది. మనిషి శాంతియుతంగా ప్రశాంత జీవనం గడపాలి. సమాజాన్ని శాంతి సౌఖ్యాలతో ఉంచేందుకు తనవంతు ధర్మాన్ని పాటించాలి.
🐿️సమదృష్టి, సమభావం ఈ రెండూ మనసులో శాంతిగుణం పాదుగొనేందుకు మూలాలు. ఇవి లేకుంటే మనసు ఎప్పుడూ కదనరంగాన్ని తలపిస్తుంది. అదుపుతప్పే కోరికలకు, తద్వారా వచ్చే కోపతాపాలకు గురవుతుంటుంది. అన్ని అరిష్టాలకు, దుష్ఫలితాలకు మూలం కామక్రోధాదులు. వాటిని అదుపుచేయగలిగేది ఒక్క శాంతగుణం మాత్రమే.
🐿️జేత వనంలో ధ్యానముద్రలోని బుద్ధభగవానుడి ప్రశాంత ముఖబింబం చూసినంత మాత్రాన శిష్యులు, వ్యధార్తులు, బాధాతప్త హృదయులు సాంత్వన పొందేవారు. ఆయనలోని ప్రేమ, కారుణ్య భావనలకు సమస్త జీవరాశి, ప్రకృతి పరవశించేవి. ఆ భగవానుడు అడుగుపెట్టినచోట శాంతి కిరణాలు వెల్లివిరిసేవి.
🐿️మంచుకొండల స్వభావం చల్లదనం. పూలకు పరిమళం సహజసిద్ధం. అలాగే ఉన్నత జీవన ప్రస్థానానికి, శాంతగుణం మనిషిని వీడని స్వభావంగా ఉండాలి. మనలోని శాంతస్వభావం- కరకుదనం, కఠినత్వంతో చరించే ఎదుటివారిలో సైతం మార్పు తెస్తుంది.
🐿️వేదోపనిషత్తులోనివి ‘శాంతిమంత్రాలు’. వేదమంత్రాలన్నీ చివరకు ఓం శాంతిః శాంతిః శాంతిః అని ముగుస్తాయి. బాహ్యాంతరాలు ఒక్కటై ఉండే స్థితి కోసం ప్రార్థించేదే శాంతిమంత్రం. బాహ్యాంతరాల సమన్వయమే జీవితం. శాంతి సుస్థిరతల ప్రాదుర్భావం అక్కడే. పరస్పర ద్వేషభావం, ఈర్ష్య అసూయలు లేకుండా ఉంటేనే శాంతి పరిఢవిల్లుతుంది. అది తెలిపేందుకే గురుశిష్యుల మధ్య శాంతిమంత్రం లోకానికే సందేశంగా ఉంది.
🐿️ఇద్దరం శక్తి సంపన్నులమై అభ్యసన, అధ్యయనాలను ఫలవంతం చేసుకుందాం. పరస్పరం ద్వేషించుకోకుండా ఉందాం అంటూ అది శాంతియుత వాతావరణ సృష్టికి నాంది పలుకుతుంది.
🐿️మంచినే వినాలి. విన్నదాన్ని మననం చేసుకొని మనసులో నిక్షిప్తం చేసుకోవాలి. ఎల్లవేళలా తన ధ్యాసయందు ఉంచుకుంటే అది, అంతరంగ శాంతికి దోహదపడుతుందని యోగవాసిష్ఠం తెలుపుతోంది.
🐿️తనను ఆశ్రయించి ఉన్నవారికి పంచి ఇచ్చి, తాను మితంగా స్వీకరించేవాడు, ఎక్కువ పనిచేసి తక్కువగా నిద్రించేవాడు, అడిగినప్పుడు శత్రువుకైనా ఇచ్చేవాడు శాంతగుణ సంపన్నుడు, ఆత్మజ్ఞాన సంపన్నుడని విదురుడు ధృతరాష్ట్రుడితో అంటాడు. శాంత స్వభావం ఆయుర్దాయాన్ని పెంచుతుంది. శ్వాసక్రియ ఒడుదొడుకులు లేకుండా క్రమానుగతిలో ఉంటుంది. శ్రేష్ఠ కర్మలకే దోహదం చేస్తుంది. భయంలేని జీవితాన్నిస్తుంది.
🐿️శాంతగుణం హింసను ప్రేరేపించదు. సర్వ జనాభ్యుదయాన్ని కోరుతుంది. సర్వత్రా సమత్వ భావనను కలిగి ఉంటుంది. సంధి ప్రయత్నాలు చేసేవేళ, గర్వంలేనివాడు, సమర్థుడు, అన్నింటికీ మించి శాంతమూర్తిగా ఉండే వ్యక్తినే దూతగా నియమించాలని మహాభారతం చెబుతుంది.
🐿️ఏవైనా అప్రియాలు విన్నంతనే విచక్షణ కోల్పోయి ప్రతిస్పందించడం వివేకం కాదు. సహనాన్ని, ధర్మాన్ని పాటిస్తుంది శాంతగుణం. అయితే శాంత గుణానికీ హద్దు ఉంటుంది. శిశుపాలుడు తనను నిందిస్తున్నా, కృష్ణుడు నూరు తప్పులను కాచాడు. సహించాడు. ఆపై ధర్మాగ్రహం జ్వలించింది. దుష్టత్వాన్ని సంహరించింది.
🐿️శాంత గుణం మనసును, శరీరాన్ని పవిత్రంగా, నిశ్చలగుణ తత్వంతో ఉండేలా చేస్తుంది.
🐿️ చుట్టూ ఉన్న పరిసరాలను ప్రశాంత తపోవాటికల్లా మారుస్తుంది!
- ✍️దానం శివప్రసాదరావు
No comments:
Post a Comment