నీళ్ళుమాత్రమే త్రాగే భైరవ అగోరిబాబా
కేదార్ నాథ్ వెళ్ళేదారిలో గౌరికుండము కలదు. ఇద్దరి సాధువులతో కలిసి వెళుతున్నాను. హిమాలయాల గురించి, యోగుల గురించి చర్చిస్తూ వెళుతున్నాము. అందులో ఒక సాధువు భైరవ అగోరిబాబాని దర్శించారా మీరు అని అన్నాడు. రెండో సాధువు లేదు ఆయనెవ్వరిని దగ్గరకు రానీయడు రాళ్ళతో కొడతాడనెను. అప్పుడు మొదటి సాధువు లేదు పోయిన వారికి బాబా ఒక పరీక్ష పెట్టెదరు ఎవరు పోయిన కొండకున్న మంచుగడ్డని ముందుపడవేతురు అది రత్నంగా మారును, అది ఆశతో తీసుకోబోతే అప్పుడు బాబా రాళ్ళతో కొట్టును ఆ రాళ్లు కూడా మనకు తగలకుండా ప్రక్కల వైపు విసురును. దానికి భయపడి అక్కడికి ఎవ్వరైనా వెలితే పారిపోయి వస్తారు అని ఆ సాధువు చెప్పెను. అంటే వారు కేవలం దేనిపై ఆశలేని జిజ్ఞాసువులనే రానిస్తారని తెలుస్తుంది. మనం వారితో చేసేది కేవలం ఆధ్యాత్మికచర్చ మరియు వారి దర్శనముకై కదా వెళ్లేది అప్పుడు వారు మనకి అనుమతించెదరు అని నేననగా మొదటి సాధువు అవుననిరి. రెండో సాధువు భయపడి రాలేదు వెళ్ళిపోయెను. మొదటి సాధువు కొద్ది దూరము వచ్చి దారి చూపించి మా గురువు గారు కేదార్ నాథ్లో నాకై ఎదురుచూస్తున్నారు నేను వెళ్ళాలి, నేరుగా సుదూరంలో కనిపించే ఆ పర్వతంపై ఒక గుహకలదు వెతకండి అని తెలిపిపోయెను.
సుమారు లోయలలో 40కిలు ప్రయాణించి ఎంతో ప్రాయాసతో 3వ రోజు అక్కడికి చేరుకున్నాను. అక్కడికి వెళ్ళేసరికి రాత్రి 2 గంటల సమయం అయ్యింది. పౌర్ణమికి ముందు కనుక కొంచెం వెలుతురుగా ఉంది. పెద్దవి మొద్దులు దునిగా వెలిగించి అందులో కూర్చొని ధ్యాననిమగ్నుడైనాడు భైరవ అగోరిబాబా. తెల్లవార్లు వారెప్పుడు ధ్యానం నుండి బయటికొస్తారా అని ఎదురుచూస్తు ఉంటిని. ఉదయం 7గంలు అవుతుంది. సూర్యుడొచ్చాడు, నెమ్మదిగా కల్లుతెరచి అలాగే కొద్ది సేపుండి సూర్యునికి నమస్కరించి నా వైపుకు చూశారు. వెంటనే సాష్టాంగ ప్రణామము చేశాను. అగ్నిలోంచి నిప్పును ఒకటి బయటికి వేశారు. అది బంగారముగా అయ్యింది. ఓహో ఈ మహాత్ముడు నాకు పరీక్ష పెడుతున్నాడని దాన్ని చూడకుండనే ఊరుకుంటిని. ఒక గంటసేపు మౌనంగా ఉండి ఎందుకొచ్చావు అనిరి. తమరి దర్శనానికి బాబా అంటిని దర్శనం చేసుకున్నావుగా వెళ్ళు అనిరి. తమరు అవకాశమిస్తే కాసేపు మాట్లాడి వెళతాను అన్నాను. బాబా తమరి గురించి కాస్త తెలుపండి అన్నాను.
వయస్సు 80సంరాలు, మాగురువుకు 150 సంలు వారు ఇక్కడి నుండి 50కిమీ దూరంలో ఉన్నారు కాళి అగోరిబాబా అని తెలిపిరి. 1 సం||రంకు ఒకసారి గురుపూర్ణిమకు గురుదర్శనానికి వెళతాను అనిరి. బాబా దయవుంచి తమరి గురువుగారి దర్శనం నాకు కూడా చేయించండి అంటిని నిరాకరించిరి. ఎంతో ప్రాధేయపడగా అప్పుడు ఒప్పుకొనిరి. కాని అక్కడ మౌనంగా ఉండాలి, గురువు ఆజ్ఞ వేస్తేనే మాట్లాడాలి లేదంటే లేదు అనిరి. అలాగే బాబా అంటిని భైరవ అగోరిబాబాతో నేను కూడా బయలుదేరాను. 2 రోజులు ప్రయాణించాము. బాబా చాలా వడివడిగా తేలికగా నడుస్తారు. 2 రోజులలో 2 సార్లు నీరుమాత్రమే తాగారు. బాబా అగోరులంటే నరమాంసం తింటారని అంటారు. తమరు వట్టి నీరే త్రాగారు రెండు రోజుల నుండి అన్నాను. నేను కఠోర సాధన చేయడంతో నాకు ఏ ఆహారం తినకున్నా ఉండగలను ఆకలనేది ఉండదు. కేవలం రోజుకోసారి కొన్ని నీళ్ళు తీసుకుంటాను అనిరి. బాబా మీరు అగ్నిలో కూర్చొని సాధన చేశారు అదెలా సాధ్యమవును. యోగవిద్యలో ప్రావీణ్యం పొందిన యోగిని అగ్నికాల్చలేదు. ప్రాణయామ సిద్దిస్తే అది సాధ్యమే. మా గురువుగారు పంచభూత స్తంభన విద్య నేర్పించారు నాకు అనిరి. నిర్వికల్పసమాధి లభిస్తేనే అది సాధ్యమవును లేనిచో సాధ్యపడదని బాబా చెప్పిరి.
కాళి అగోరి బాబా దర్శనానికి వెళ్ళాము. ఆ రోజు గురుపూర్ణిమ ఉll 6గంలు బాబా గుహలో లేరు వేచి ఉన్నాము. 1గం. తర్వాత ఉ7:00 గంలకు నీళ్ల అడుగుభాగం నుండి పైకివచ్చి నీటిపై అలాగే పద్మాసనంలో ఉండి ధ్యానముద్రలో ఉండిరి. కాసేపటికి నీటి నుండి ఏ ఆధారం లేకుండా గాలిలోనే ధ్యానంలో ఉండిరి. 1గం తర్వాత లేచి వచ్చి ఒక గోతిలో కూర్చొని వారి శిశ్యుడికి సైగచేసిరి భైరవ అగోరి గోతిలోనే గురువుగారిని పూడ్చిరి. అక్కడే గురువు వద్ద శిష్యుడు ధ్యానంలో కూర్చొనిరి. అర్ధరాత్రి 12 గంలకు మట్టిలోంచి అమాంతంగా పైకి కాళీ అగోరిబాబా వచ్చెను. శిష్యుడు గురువు గారికి గురుపూజ ప్రారంభించి పూజ ముగించెను. తర్వాత శిష్యుడిని గురువు క్షేమ సమాచారాలడిగి ఇద్దరు మౌనంగా ఉండిరి. ఇతనెవరు అని అడుగగా మీ దర్శనానికి ప్రాధేయపడి వచ్చెననెను. గురు శిష్యులు గుహలోకి వెళ్ళి 3 గంలు ఏకాంతంగా ఉండి వచ్చిరి. ఏదో రహస్య సంభాషణలు చేసుకొనిరి.
అది చాలా పొడువైన గుహ కాళి అగోరిజీ నల్లటి శరీరము, పొడవైన గోళ్ళు నేలపై కుప్పగా పడి ఉన్న తాళ్ళలాంటి జడలు, తేజస్సుతో కూడిన కళ్లు గొప్ప తపస్వి. వారు పూర్తిగా నిరాహారి ఏ ఆహారము తినరు. బాబాకు ప్రణమిల్లి బాబా నాపై దయవుంచి నావి కొన్ని సందేహాలున్నాయి తీర్చండి అని తెలుపగా, అడుగు బేటా అనిరి. బాబా మీరు మొదలు నీటి అడుగులో ధ్యానంలో ఉంటిరి. తర్వాత నీటిపై ధ్యానంలో ఉండిరి. తర్వాత గాలిలోనే ధ్యానంలో ఉండిరి. తర్వాత గోతిలో పాతిపెడితే ధ్యానంలో ఉండిరి.
అర్థరాత్రి గోతిలోంచి మీరే పైకి వస్తిరి అందులో మీరు నిరాహారి అని వింటిని. ఇదెలా సాధ్యమయ్యింది 150 సం||రాలు మీ వయస్సు ఇన్ని చిత్ర విచిత్రాలు ఉన్నాయి మీ వద్ద కేవలం అగోరీలంటే నరమాంసము తింటారనే పూర్వం నేను వింటిని మరి మీరు నిరాహారులు ఎలా అయ్యారు. దయచేసి వీటికి సమాధానమివ్వండి అని కోరగా కాళి అగోరిబాబ వాటికి జవాబుగా..
నాయన మా అగోరి సాంప్రదాయంలో గురువులు శిష్యుడిని చాలా కఠిన పరీక్షలకు గురి చేసి మాత్రమే విద్య నేర్పుతారు. మాకు యోగ విద్యలో మా గురువులు ప్రావీణ్యులను చేసిరి. మా సాంప్రదాయం ప్రకారం పూర్వం చనిపోయిన కలేబరాలు తిన్నాము. నాకు సాధన ద్వారా ప్రాణాయామంలో పట్టు సాధించుటతోటి నిర్వికల్ప సమాధి సిద్దించింది. తర్వాత జలస్థంబనం, అగ్నిస్థంబన, వాయుస్థంబన, ఆకాశస్థంబన, భూస్థంబన విద్యల్లో ఆరితేరాను. నా కఠోర సాధనలతో నిరాహార స్థితి తనంతటదే కలిగింది. నేనేమి చేసేది ఆకలి లేనిదే ఎందుకు తినేది, యోగ సాధనలో ఎంతో మహత్తు కలదు. గడ్డిపోచలు తాడుగా పేనితే ఏనుగునైన బంధించినట్టు ప్రతినిత్యం నిరంతర సాధన చేయడంతో సాధ్యం కానిది లేదు. ఏనుగు సైకిల్ తొక్కుట, సర్కస్ లో ఎన్నో విన్యాసాలు మీరు చూస్తారు గదా అదంతా నిరంతర అభ్యాసబలమే, ప్రాణయామతో శ్వాసని ఆధీనంలో ఉంచిన యోగికి ప్రతిఒక్కటి సాధ్యమే అని కాళి అగోరిబాబ తెలిపిరి.
నేను సంవత్సరానికి ఒక్కసారే గుహ నుండి బయటికొస్తాను. ఇక మీరెల్లొచ్చు అని లోనికి వెళ్ళి మూతకు బండని అమర్చుకొనిరి. భైరవ అగోరిగారు నాయన ఇక సంతోషమేనా నీకు వెళదాము పదా అని 2 రోజులు ప్రయాణించి వారి గుహకు చేరుకున్నాము. ప్రయాణంలో నాకు ఆకలిగా ఉంది బాబా అన్నప్పుడల్లా రోజుకు ఒకసారి బాబా ఐస్ గడ్డలని రోజు 2 ఆపిల్స్గా మార్చి ఇచ్చేవారు. బాబా ఇదెలా సాధ్యమయింది. ఆ రోజు నిప్పును బంగారంగా మార్చారు. ఈ రోజు ఐస్ ముద్దలని ఆపిల్గా మార్చారు. చాలా రుచిగా కూడా ఉన్నాయని చెప్పి తింటిని. నిర్వికల్ప సమాధి అందుకున్న యోగి సంకల్పిస్తే ఏదైనా చేయగలడు పంచభూతాలు అతని ఆధీనంలో ఉండుననిరి. కాని యోగి అనిచ్ఛలోని ఇచ్చతో ఈ పనులు జేసును. అతనిలో దేనిపై కోరిక ఉండదు. ఏది చేసిన నిస్వార్థంగా, సాక్షిగా, ఆసక్తి విడచి, అభిమానం, అహంకారం లేకుండా చేయును. హిమాలయంలో రహస్యంగా సాధనచేసే ప్రతియోగి కూడా ఈ యోగవిద్యలో ప్రావీణ్యుడే లేనిచో ఈ మంచు పర్వతాలలో ఐస్ కొండలలో జీవించలేరు. చిత్రవిచిత్రమైన ప్రకృతిలో విపరీతమైన వర్షాలు, ఐస్ భయంకరమైన చలిలో ఉండలేరు. ఈ మహనీయుల తపోపుణ్యంచేతనే భూమాత ఎంతో పాపమును భరిస్తుంది. వీరు నిస్వార్థంగానే లోకశాంతి కోరుకుందురని, భైరవ అగోరిబాబా ఎన్నో విషయాలు చెప్పిరి. రెండో రోజు ఉదయం బాబాతో సెలవు తీసుకొని ధన్యవాదములర్పించి బయలుదేరి ఖేదార్ నాథ్ ని వారంలో చేరితిని.
హిమాలయయోగులతో_క్రియాయోగిఅనుభవాలునుంచి
No comments:
Post a Comment