Tuesday, February 28, 2023

శివుడు మహా దేవుడు

 *శివుడు మహా దేవుడు* 

పరమశివుడు అర్ధనారీశ్వరుడు. ఆదిభిక్షువు. భక్త వత్సలుడు. బోళాశంకరుడు. నిర్వికారుడు, నిరాకారుడు, నిరాడంబరుడు. ఇన్ని వేదాంత లక్షణాలున్న ఈశ్వరుడు ఏ శివక్షేత్రంలో చూసినా లింగాకారంలోనే కనపడతాడు కాని శరీరాకృతిలో దర్శనమివ్వడు. అదెలాగంటే ఒక వృత్తం తన ఆకారంలో చాలా గొప్పది. అది అనంతమైన మోతాదులో పెరుగుతూ వెళ్లినా దాని కేంద్రం ఒక్కటే. పరిపూర్ణ తత్త్వమనేది ఒక గోళానికి చెందింది. పరిపూర్ణమైన దానిలోని భాగాలన్నీ పరిపూర్ణాలే అని తెలుసుకోగలగడమే ఆధ్యాత్మిక సాధన! అందుకే పౌరాణికవేత్తలు సృష్టి యావత్తూ శివలింగమేనంటారు. అన్ని స్పందనలూ, చేతనలూ ఈశ్వరుడిలోనే, ఈశ్వరుడి వల్లనే అంటారు! అందుకే అటు అనంతం ఇటు అనంతం, òపైన అనంతం, కింద అనంతం చుట్టూ తిరిగి చూస్తే సర్వం లింగాకారమే... అదే శివతత్త్వం.

మహేశ్వరుని వంటి నిరాడంబరుడు మనకెక్కడా దర్శనమివ్వడు. గజచర్మం కట్టుకుంటాడు. చేతిలో కపాలం పట్టుకుని బిచ్చమెత్తుకుంటాడు. కాష్టాలవాడలో కాపురముంటాడు. విషపు నాగులను మెడనిండా మాలలుగా ధరిస్తాడు. రుద్రాక్షపూసల్ని వంటినిండా అలంకరించుకుంటాడు. ఆయన సిగలో చంద్రుడున్నాడని గొప్పలు పోదామంటే అదీ కుదరదు. ఆ శిరస్సున ఉండే చంద్రుడు వెన్నెల సోనలు కురిపించే నిండు చందురుడేమీ కాదు. సన్నని చంద్రరేఖ. పోనీ, సరైన వాహనమైనా ఉందా అంటే లేదు. ముసలి ఎద్దునెక్కి ఊరేగుతాడు. ఆయనని సేవించే పరిజనం ఏమైనా పెద్దవాళ్లా అంటే ప్రమద గణాలు, భూతగణాలే. అయితేనేం, వారితోనే ఆయన జగత్‌ ప్రసిద్ధుడయ్యాడు.

మహా విరాగి

ఎంత పేదవారయినా సరే, పెళ్లికి పట్టుబట్టలు కట్టుకుంటారు, వంటికి చందనాలు అద్దుకుంటారు. సుగంధ పరిమళాలతో కూడిన పూదండలను అలంకరించుకుంటారు. వేగంగా సంచరించే పక్షినో, జంతువునో వాహనంగా చేసుకుంటారు. పెళ్లికి అందరూ రాగలిగేందుకు అనువైన ముహూర్తాన్ని చూసి పగలు లేదా సాయంత్రం పెళ్లి పెట్టుకుంటారు. కానీ, పరమ విరాగి అయిన శివుడేమో పెళ్లికి కూడా గజచర్మమే కట్టుకు తిరుగుతాడు. ముసలి ఎద్దునెక్కి వూరేగుతాడు. ఏ వాసనా లేని తుమ్మిపూలు చాలంటాడు. బూడిద పూసుకు తిరుగుతాడు. ఒక విందూ లేదూ, వినోదమూ లేదు. తన భక్తులు తనకు నవకాయ పిండివంటలు వండి నివేదించనక్కరలేదు. కటిక ఉపవాసముంటే చాలంటాడు. తనకోసం ఒక పూట మేలుకుని ఉంటే మంచిదంటాడు.  

ప్రతి చర్యలోనూ అంతులేనంతటి అంతరార్థం

శివుణ్ణి దిగంబరుడంటారు. దిగంబరుడంటే దిక్కులే వస్త్రాలుగా కలిగినవాడని అర్థం. అందుకే ఆయన సర్వాంతర్యామి అయ్యాడు. లోకంలో ప్రతివారు కీడును పోగొట్టుకోవడానికి, సంపదలు పొందడానికి మంగళకర ద్రవ్యాలైన సుగంధ చందనాదులను ధరిస్తారు. ఇవి మళ్లీ కోరికలు పుట్టిస్తాయి. కోరికలు లేనివాడయిన శివునికి వీటితో పనిలేదు. అందుకే అన్నింటికీ దూరంగా ఉంటాడు. భాగ్యవంతుడు కాకున్నా కోరిన వారికి సకల సంపదలను ప్రసాదిస్తాడు. సంచరించేది శ్మశానంలోనే అయినా, లోకాన్నిటినీ శాసించగలడు. తనకే సంపదలూ లేకపోతేనేం, ఆయన అనుగ్రహమే గొప్ప సంపద. అంటే మనకు ఏమీ లేకపోయినా, అవతలి వారికి ఇవ్వాలన్న మనసు ఉంటే చాలనీ, పైపై ఆడంబరాలు లేకున్నా, గొప్ప కార్యాలు సాధించడానికి అదేమీ అడ్డం కాదన్నది ఆయన రూపంలోని, చర్యలలోని అంతరార్థంగా భావించాలి.   

అర్ధనారీశ్వరత్వం

శివుడెలా ఉంటాడో, ఆయన భార్య పార్వతి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఆయన గజచర్మమే చుట్టుకున్నా, ఆవిడ మాత్రం పట్టుబట్టలు కట్టుకుంటుంది. ఒంటినిండా నగలు ధరిస్తుంది. çశరీరానికి చందనం అద్దుకుంటుంది. సింహాన్ని వాహనంగా చేసుకుని నవరత్న ఖచిత సింహాసనంపై ఆసీనురాలవుతుంది. తనకు లేవు కదా అని ఆయన తన దేవేరి అయిన పార్వతిని పట్టుబట్టలు కట్టుకోవద్దనలేదు. ఆభరణాలు ధరించవద్దని కానీ, అలంకారాలు చేసుకోవద్దని కానీ శాసించలేదు. ఆమెను ఆమెగా ప్రేమించాడు. తన శరీరంలో సగభాగాన్ని ఆమెకు ఇచ్చేశాడు.

శివతత్త్వాన్ని అలవాటు చేసుకోవడమంటే నిరాడంబర జీవితాన్ని ఎంచుకోవడమేనని వేదాంతులు, పండితులు చెబుతారు. ఎందుకంటే అది అనుభవంలోకి వస్తే తప్ప అర్థం కాదు. శివుడంటే ఒక వ్యక్తా? అతనికి ఒక ఆకారం ఉన్నదా? ఎక్కడో ఫలానా ప్రదేశంలో కూర్చుని ఉన్నవాడా? కాదు. సమస్త విశ్వమూ శివుడే. దేనిలో నుంచి అంతా వచ్చిందో, దేనిలో అంతా జీవిస్తున్నదో, తిరిగి దేనిలోనికి అంతా లయమైపోతున్నదో అదే శివతత్వం. దీని నుంచి బయటకు వెళ్లడానికి వీలుకాదు. ఎందుకంటే సృష్టి అంతా శివుడే. ఆయన విశ్వరూపుడు. అదే సమయంలో ఆయన రూపం లేనివాడు, నిరాకారుడు. ఒకవైపు రుద్రమూర్తి. మరోవైపు బోళాశంకరుడు. సుందరేశుడు ఆయన. సౌందర్యానికి అధిపతీ ఆయనే.

అదే సమయంలో భయంకరమైన అఘోర రూపం కూడా ఆయనదే. ఆనంద తాండవంలో చైతన్య శీలతనూ, ధ్యానంలోని స్థిరత్వాన్నీ, చీకటినీ, వెలుగు నూ, అమాయకత్వాన్నీ, తార్కికబుద్ధినీ, దయాగుణాన్నీ.. అన్నింటినీ కలగలిపి ఒక్కటిగా పంచేదే శివతత్త్వం. ఇది ఒక లీల. విశ్వచైతన్యపు ప్రదర్శన. ఎలాగైతే నాట్యమూ, నాట్యకారుడూ విడివిడి గా ఉండలేరో.. అలాగే సృష్టి, సృష్టికర్త వేర్వేరు విషయాలు కావు. ఈ సత్యమే నటరాజ స్వరూపంలో కనిపిస్తుంది. ఈ రూపంలో పంచభూతాలు గోచరిస్తాయి. నటరాజు స్వయంగా చైతన్య స్వరూపం. 

No comments:

Post a Comment