Monday, November 27, 2023

_వృద్ధాప్యానికి ఆహ్వానం_* *-శ్రీ గొల్లపూడి మారుతీరావు*

 *_వృద్ధాప్యానికి ఆహ్వానం_*

    *-శ్రీ గొల్లపూడి మారుతీరావు*
*క🌹ళా🌹దీ🌹పి🌹క🌹*

*_వృద్ధాప్యం ఒక మజిలీ_*
🔵🔵🔵🔵🔵🔵🔵🔵

_ప్రతీ వ్యక్తీ కోరుకున్నా, కోరుకోక పోయినా తప్పని సరిగా చేరుకునే మజిలీ._ 

_వయస్సులోని కోరికలన్నింటికీ సెలవిచ్చి, అలసి పోయిన అనుభవాలనీ, ఆరిపోయిన అనుభూతులనూ నెమరు వేసుకునే చలివేంద్రం._ 

*_వృద్ధాప్యం ఒక అవకాశం._*
🔵🔵🔵🔵🔵🔵🔵🔵

_వెనక్కి తిరిగి చూసుకుని, చేసిన తప్పిదాలకు నవ్వుకుని,దాటిన అడ్డంకులను పరామర్శించి, ఇక దాటనక్కరలేని స్థితికి వచ్చినందుకు ప్రశాంతంగా నిట్టూర్చే ఆటవిడుపు._

_ముసలితనం కొడుకు   కంటె ఒక అడుగు వెనక నడిపిస్తుంది._ 

_మనవరాలి భుజాన్ని ఆసరా చేసుకుంటుంది._ 

_జీవితమంతా కొరుకుడు పడని నిజాలతో ఆనందంగా రాజీపడేటట్టు చేస్తుంది._ 

_పిల్లలు ''నీకేం తెలీదు నాన్నా!'' అంటే కోపం రాదు._ 

_ఒక జీవిత కాలాన్ని 'తెలీని తనానికి తాకట్టు' పెట్టిన కొడుకుని చూసి నవ్వు కుంటుంది._ 

_తనకి తెలీదని పక్కకి తప్పించే తరాన్ని చూసి గర్వపడుతుంది._ 

_అవలీలగా అర్థం చేసుకుంటుంది. ''వాడికి తోచినట్టే చెయ్యనివ్వండి'' అనే భార్య హితవుకి గంభీరంగా తలవొంచుతుంది._ 

_ఏ విమర్శా అవమానం అనిపించదు. ఏ నిందకీ కోపం రాదు. వృద్ధాప్యాన్ని అందరూ గౌరవిస్తారు._ 

_నీ జీవితకాలంలోని సాధనల్ని పక్కనపెట్టి, కేవలం వయస్సు కారణంగానే పెద్దరికాన్ని అంగీకరిస్తారు._ 

*_అదొక అంతస్థు_*
 🔵🔵🔵🔵🔵🔵

_అతని హితవుని నలుగురూ వింటారు, 
నీ ఆలోచనని గౌరవిస్తారు._ 

_దాన్ని పాటించరని అర్థమవుతున్నా కోపం రాదు._ 

_వయస్సు అర్థం చేసుకునే సంయమనాన్ని నేర్పుతుంది._

_''మా రోజుల్లో...'' అని చెప్పుకోవడంలో చిన్న 'సాకు'ని వృద్ధాప్యం మప్పుతుంది._ 

_''ఈ కాలం కుర్రాళ్లు...'' అన్న వెక్కిరింతకి అర్హతని సంపాదించి పెడుతుంది._ 

_తన గురించి తన పెద్దలూ అలనాడు.. అలాగే అనుకొని ఉంటారని అప్పుడు జ్ఞాపకం వస్తుంది._

_వేసిన ప్రతీ అడుగూ తెలిసి వేసే నమ్మకాన్నిస్తుంది._ 

_చేసే ప్రతీ పనీ యిబ్బంది లేని, శ్రమ అనిపించని మార్గం వైపే ప్రయాణం చేయిస్తుంది._ 

_తన 'రేపు' క్రమక్రమంగా కురుచనయి పోతోందని అర్థమవుతూంటుంది._ 

_దక్కిన చిన్న తప్పుల్ని వృద్ధాప్యం భద్రంగా అలంకరించుకుంటుంది._ 

_''మనకి చేతకాదు'' అని చెప్పడం పెద్ద అర్హతగా కనిపిస్తుంది._ 

_అసాధ్యానికి 'అనవసరం' అంటూ గడుసుదనం చిన్న ముసుగువేస్తుంది._ 

_దానికి ఊతం వృద్ధాప్యం._

*_జీవితంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు అర్థమవుతూంటాయి._*
🔵🔵🔵🔵🔵🔵🔵🔵

_ఇప్పుడా సమాధానాలకూ వేళ మించిపోయిందని అర్థమవుతుంది._ 

_ఈ సమాజంలో అవినీతి అనే కుళ్లు ఎప్పుడు తొలగుతుంది?_ 

_ప్రతీక్షణం దోపిడీకి గురవుతున్న ఈ పర్యావరణం ఒక్కసారి ఎదురు తిరిగితే ఏమవుతుంది?_ 

_ఏమయినా తనకేం బాధలేదు._ 
_ఆ సమయంలో తను ఉండడు._ 

*_ఈ జీవిత నుంచి శలవు తీసుకోవడమే తనకి ఉపశమనం._*
🔵🔵🔵🔵🔵🔵🔵🔵

_దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎలా వుంటాడు?_ 

_మృత్యువు తరువాత ఏమవుతుంది?_ 

_సమాధానాలు అర్థమయ్యే క్షణాలు దగ్గరవుతున్నాయి._ 

*_చుట్టూవున్న జీవితాన్ని క్రమంగా ఖాళీ చేసుకుంటుంది వృద్ధాప్యం._*
🔵🔵🔵🔵🔵🔵🔵🔵

_చిన్నకేక తుళ్లిపడేటట్టు చేస్తుంది._ 
_చిన్న నిశ్శబ్దం ప్రశాంతంగా ఉంటుంది._

_ఎప్పటిలాగే తెల్లారి, వృద్ధులతో కలిసి నడిచి, రెండుముద్దల అన్నం తిని, అరగంట సేదతీరి, వేడి టీ తాగి, సాయంకాలం పార్కు బెంచీ దగ్గర 'ఈ దేశం తగలడి పోతోందని తిట్టుకుని, శాంతపడి, కీళ్ల నొప్పులకు మాత్రలు మింగి, రాని నిద్రనీ, నిన్నటి జ్ఞాపకాలనీ నెమరు వేసుకోవడం - వృద్ధాప్యం వ్యసనం._

_ఇప్పుడు విచారం దగ్గరకు రాదు._ 

_వెళ్లిపోయిన హితులూ, సన్నిహితులూ దిగులుగా జ్ఞాపకం వస్తారు._ 

_ముగింపు భయపెట్టదు. ఎందుకంటే భయపడినా రాకతప్పదు కనుక._ 

_అన్నిటినుంచీ, అందరినుంచీ తనని కుదించుకుని - మెల్లగా అంతర్ముఖుడు కావడం వృద్ధాప్యం._

_ఇప్పుడు అన్ని దురదృష్టాలకూ కారణాలు అర్దమౌతాయి._ 

_చేసిన తప్పిదాలు, మాటతప్పిన కప్పదాట్లూ, మనసు నొప్పించిన చిన్న చిన్న జ్ఞాపకాల ముళ్లూ - అవన్నీ ఓ జీవితకాలం ఆలస్యంగా కళ్లముందు కదుల్తాయి._ 

_ఈ అనుభవాల్ని హెచ్చరికలు చెయ్యబోతే పిల్లలు వినరు._ 

_వినినట్టు నటిస్తారు. నటిస్తున్నారని తనకీ తెలుసు._ 
_విన్న తృప్తిని తానూ నటిస్తాడు._ 

_వారికీ వృద్ధాప్యం ఒకనాడు పాఠాలు చెప్తుందని తెలుసు._ 

_కానీ వృద్ధాప్యం ఒక వరమని ఇప్పుడు చెప్పి ఒప్పించలేడు._ 

_వారు ఒప్పుకునే వేళకి తను ఉండడు._ 

_జీవితం ఎంత విచిత్రం! నవ్వుకుంటాడు._ 

_ఆ నవ్వు ఖరీదు ఒక జీవితం._

_'చమకం' ఏ రుషి, ఏ మహానుభావుడు ఎప్పుడు సృష్టించారో....,_

_ఎంత ముందుచూపు, ఎంత వినయసంపద, జీవుని నిస్సహాయత, నిర్వేదం - అందులో ఎంత నిక్షిప్తమయి వుందో,_

_ఆనాటి కోరిక సంపూర్ణమయిన స్వరూపంతో కళ్లముందు దర్శనమిచ్చేనాటికి - తాను జీవితమంతా కోరుకున్న 'వృద్ధాప్యం' తనని ఆవరించుకుని ఉంటుంది._

_ఈ దేశపు వేదసంపద, సాంస్కృతిక వైభవం, జాతి దర్శనం అపూర్వం, అనన్యసామాన్యం._ 

_చమకంలో 'వృద్ధం చమే' అనే ఒక్క కోరికా ఈ జాతినీ, మతాన్నీ, ఆలోచనా స్రోతస్సునీ అత్యద్భుతంగా ఆవిష్కరించే అభిజ్ఞ.. వరం._ 

_భగవంతుడిని కోరడంలోనే భగవంతుడు ప్రసాదించిన తన ఆలోచనా పరిణతిని అలంకరించే భగవద్దత్తమైన ఆశీర్వాదం._

*అదీ వృద్ధాప్యం...*

No comments:

Post a Comment