*కాదంబరి*
రచన : లగి శెట్టి సుదర్శన్
సంస్కృత వచన కావ్యాల్లో బాగా పేరు పొందినది కాదంబరి కావ్యం. దీనిని 'బాణభట్టు మహాకవి' రాశాడు. అది ఎలా వెలికి వచ్చిందో తెలిపే ఒక కథ వుంది.
కాదంబరి కావ్యం రాయడం ముగిసాక బాణభట్టుకి దానిని తన సమకాలికుడు తన కంటే అధికుడూ, కాళికాదేవి వరప్రసాదుడూ అయిన కాళిదాసుకి చూపించాలని మనసుపడి, తన శిష్యుల్లో ఒకడిని పిలిచి “దీనిని కాళిదాసుగారికి చదివి విన్పించి రా”
అని పంపాడు.
కాళిదాసు అప్పుడే సుష్టుగా భోజనం చేసి తాంబూలం నములుతూ తూగుటుయ్యాల మీద విష్ణుమూర్తిలా పడుకుని వున్నాడు.
శిష్యుడు కాళిదాసు ఇంట ప్రవేశించి అపర విష్ణుమూర్తిలా పడుకుని ఉన్న కాళిదాసుకు వందనం చేసాడు. అలికిడికి కాళిదాసుకు
నిద్రాభంగం అయింది. ఆ శిష్యుడు తన రాకకి కారణం చెప్పి మనవి ఆలకించమని కోరాడు.
చిన్నగా నవ్వుతూ “మంచిది.... వినిపించు" అన్నాడు కాళిదాసు.
శిష్యుడు చదువుతున్నంతసేపూ కాళిదాసు కళ్ళు మూసుకునే వుండిపోయాడు. కావ్యాన్ని చదవడం అయిపోయింది. ఏమైనా చెబుతాడేమోనని రెండు క్షణాలు ఎదురు చూశాడా శిష్యుడు చేతిలోని కావ్యాన్ని తిరగేస్తూ. కాని కాళిదాసు ఏమీ మాట్లాడ లేదు. అసలు మూసుకున్న కళ్ళు కూడా తెరవలేదు. ఉయ్యాల కదుల్తూనే వుంది.
"సెలవు ఇప్పిస్తారా మరి?" శిష్యుడు లేస్తూ అన్నాడు వినయంగా. కాళిదాసు అలాగే అన్నట్లుగా తల వూపి, శిష్యుడు కదుల్తూ వుండగా మాత్రం “కాదంబరీ, కాదంబరి” అన్నాడు.
ఆ శిష్యుడు ఆదే వాక్యాన్ని గురువుగారికి అప్పజెప్పాడు. ఆది విన్న బాణభట్టు నీరుకారి పోయాడు. అసలు కాదంబరి అంటే కల్లు అని అర్థం. అది సేవిస్తే మనిషి ఎలా అధోగతికి పోతాడో, తన కావ్యం చదివితే కూడా అంతేనేమో!' అనుకున్నాడు బాణభట్టు.
తన ఆందోళనను చంపుకోలేక "శ్రద్ధగా విన్నాడా అసలు?” అంటూ గుచ్చిగుచ్చి అడిగాడు శిష్యుడిని.
"చిత్తం! తెలీదండి, తాంబూలం నములుతూ, ఉయ్యాల వూగుతూ నేను చదువుతున్నంత సేపూ కళ్ళు మూసుకునే వున్నారండి. విన్నదీ, లేనిదీ ఆ భగవంతుడికే తెలియాలి” అన్నాడు శిష్యుడు.
బాణభట్టు చాలా బాధపడ్డాడు. 'అంతటి మహాకవికి రుచించని తన కావ్యం వుంటేనేం, లేకపోతేనేం' అని బాధపడుతూ ఆ ఆవేదన లో కాదంబరి కావ్యాన్ని అగ్నిహోత్రంలో పడేశాడు.
ఇది జరిగిన కొన్ని రోజులకు...
ఒకరోజు కాళిదాసు బాణభట్టు ఇంటికి వచ్చి..
“ఆయ్యా! బాణభట్టుగారూ ఏదీ ఆ కాదంబరి మరోమారు వినిపించండి" అన్నాడు.
బాణభట్టు తెల్లబోయాడు. “ఇదేమిటీ, ఈయన ఇలా అంటాడు? హేళన గానీ చేయడం లేదుగదా!" అనుకుని గత్యంతరం లేక తను చేసిన పని చెప్పేశాడు.
అది విన్న కాళిదాసు మొదట విస్తుబోయి తర్వాత నొచ్చుకుంటూ "అయ్యో! బాణభట్టు గారూ, ఎంత త్వరపడ్డారు? నా మాటను ఎంత అపార్థం చేసుకున్నారు” అన్నాడు.
“కాదంబరి అంటే కల్లు అని కదా అర్థం. అది సేవిస్తే ఎంత మత్తుగా, హాయిగా వుంటుందో మీ కావ్యం కూడా అలా సుఖాన్ని ఇస్తుందని నా వుద్దేశ్యం. అంతేకాని వేరే కాదు” అంటూ వివరించాడు.
బాణభట్టు తన తొందరపాటుకి ఎంతో బాధ పడ్డాడు. 'అష్టకష్టాలూ పడి రాసిన కావ్యాన్ని చేతులారా చేటు చేసుకున్నానే' అని దిగులు పడ్డాడు.
ఆయన బాధని గుర్తించిన కాళిదాసు "మీరేం బాధపడకండి బాణభట్టుగారూ, నేను ఏక సంథాగ్రాహిని అన్న సంగతి మీకు తెలిసిందే! మీ కావ్యం నా బుర్రలో సుడులుతిరుగుతోంది. ఆ రోజు విన్నదంతా అక్షరం పొల్లు పోకుండా చెబుతాను రాసుకోండి. ఇది ఓ రకంగా నాకూ పరీక్షే!” అన్నాడు చిరునవ్వుతో.
ఆ తర్వాత అన్న ప్రకారం కాళిదాసు తను విన్నదంతా క్షుణ్ణంగా చెబుతూ వుండగా బాణభట్టు మళ్ళీ తన కావ్యాన్ని తిరిగి రాసుకుని, గుండెల నిండుగా ఊపిరి పీల్చుకున్నాడు.
అలా ఆ కావ్యం మనకి దక్కింది.
No comments:
Post a Comment