Thursday, November 23, 2023

ఇదే కర్మ జీవితం.....

 🌸అమృతంగమయ - కర్మయోగం🌸

*కర్మలను ఆచరించు - కర్మ ఫలితాలను ఆశించకు. ఇదే సచ్చిదానంద జీవన సూత్రం*

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ।।

భగవద్గీత రెండవ అధ్యాయం 47 వ శ్లోకం

శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు.

ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ కర్మ సిద్ధాంతం గురించి లోతైన అవగాహన అందిస్తున్నారు. ఈ శ్లోకం కర్మ సిద్ధాంతం గురించి నాలుగు సూచనలను చెప్తున్నది.

1) నీ కర్తవ్యం చేయుము కానీ ఫలితాల గురించి ఆలోచన పెట్టుకోకు. 

2) వచ్చిన కర్మ ఫలములు నీవు అనుభవించటం కోసం కాదు. 

3) పని చేసేటప్పుడు కూడా కర్తృత్వాభిమాన భావన (నేనే చేస్తున్నాను అన్న అహంకారం) విడిచిపెట్టుము. 

4) కర్మలను మానివేయుటలో ఆసక్తి ఉండరాదు.

ఎవరైనా ఆశించేది, కోరుకునేది ఒక్కటే. ఎలాంటి కష్టాలు, బాధలు లేని జీవితం. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే జీవితం.

అయితే, కావాలనుకున్న ఉద్యోగం వస్తేనో, అనుకున్నంత డబ్బు సంపాదిస్తేనో, మనం అనుకున్నవన్నీ జరిగితేనో మన కష్టాలన్నీ తీరిపోతాయి అనుకోవడం అజ్ఞానం.

మన మానసిక సంకల్పాలు తద్వారా చేసేటటువంటి కర్మలు,  వీటిని అనుసరించే మన జీవితం నిర్ణయించబడి ఉంటుంది.

ఇదే కర్మ జీవితం.

అసలు కర్మ  ఏమిటి? అది అసలు ఎలా పనిచేస్తున్నదో పరిశీలించవలసి ఉంటుంది.

మన సంకల్పాలను అనుసరించే మనం చేసేటువంటి కర్మలు ఏర్పడుతూ ఉంటాయి. అలా చేసేటటువంటి కర్మలు అలవాట్లుగా మారుతాయి. అలవాట్లను అనుసరించి ప్రవర్తన ఏర్పడుతుంది. ఆ ప్రవర్తనే  జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది.

కనుక వ్యక్తి ఎలంటివాడు, అతని జీవితం ఎలా ఉంటున్నది, ఉండబోతోంది అన్నది, అతని సంకల్పాలు అనేటువంటి మానసిక వృత్తులను అనుసరించి తెలుసుకొనవచ్చు.

మన జీవితంలో వర్తమానంలో కలిగే పరిస్థితులు వాటి యొక్క కారణం తద్వారా వర్తమానంలో కలిగే మానసిక సంకల్పాలనేటువంటి ఆలోచనలు ఇలా ప్రతిదానికీ కారణం, మనం గతంలో చేసిన ఆలోచనలు, ఎంపికలు, పనులు, ఇంకా వాటి యొక్క ఫలితాలు. మన జీవితాలలో ఇదివరకే జరిగినది, ప్రస్తుతం జరుగుతున్నది, ఇకమీదట జరగబోయేది మన కర్మల మీదే ఆధారపడి ఉంటాయి.

ఒకరు సక్రమంగా ఆలోచిస్తూ, వారి పనులను నిష్కామంగా చేస్తే, వారి జీవితం సక్రమంగా, సుఖంగా ఉంటుందని కర్మ సిద్ధాంతం చెబుతుంది.

చెడు ఆలోచనల వల్ల, స్వార్థ కుతంత్రాలతో చేసే పనుల వల్ల, జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని కూడా కర్మ సిద్ధాంతం హెచ్చరిస్తుంది.

ఇంకో విధంగా చెప్పాలంటే,  మనం ఏదైతే ఇస్తామో, అదే తిరిగి మనకు వస్తుంది.

కర్మ యొక్క ప్రభావం జీవితంపై రెండు విధాలుగా ఉంటుంది. మొదటిది ఫలితంగా, రెండోది సంస్కారంగా. కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించే క్రమంలో ఆ అనుభవం వ్యక్తి యొక్క సంస్కారంగా మారుతుంది. తద్వారా మనిషి యొక్క ఆలోచనా పద్ధతి, ప్రవర్తనల్లో మార్పులొస్తాయి.  ఈ విధంగా, ఒక వ్యక్తి యొక్క కర్మలు అతని వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని నిరంతరం మారుస్తూ ఉంటాయి.

జీవుడు తాను చేసిన కర్మలకు తానే ప్రతిఫలం అనుభవిస్తాడని, భగవద్గీతలో చెప్పబడింది. తలరాతను బట్టి జీవితం నడవదని, అదే నిజమైతే మనిషిజన్మకు అర్థమే లేకుండా పోతుందని కూడా, భగవద్గీత మనకి చెప్తుంది.

కాబట్టి, మన సంతోషాలకు మనమే కారణం, మన కష్టాలకు కూడా కారణం మనమే తప్ప అన్యులు ఎవరూ కాదు.

కర్మని సరిగా అవగాహన చేసుకుని నిష్కామంగా కర్మని ఆచరిస్తే, అది మనల్ని ధర్మంవైపు నిలబడేలా చేస్తుంది. ఆధ్యాత్మిక పరిపుష్టిని కలగజేసి జీవన గమ్యం వైపు సరైన మార్గంలో నడిపిస్తుంది. అది మనకు ఏది మంచి, ఏది చెడు అన్నది తెలిసేలా చేస్తుంది.

నిష్కామంగా కర్మ చేయడం వలన నిర్మలమైన బుద్ధి మనకు లభిస్తుంది. అటువంటి నిర్మలమైన బుద్ధితో భగవదారాధన చేయాలి తప్ప మనము పరమాత్మను అది కావాలి, ఇది కావాలి అని అడిగినందువలన అది కామ్యకర్మే అవుతుంది.  మనసులో భక్తి, ప్రేమ, విశ్వాసాలు వృద్ధి చేసుకోవాలి, పరమాత్ముడు ఏది అనుగ్రహించిన స్వీకరించడానికి సిద్ధపడి ఉండాలి. నీలో ఉన్న  ప్రేమ, భక్తి, విశ్వాసాలే పరమాత్ముని నీ చెంతకు రప్పిస్తాయి.

మన మనసులో పరమాత్ముని పట్ల దృఢమైన భక్తి, ప్రేమ విశ్వాసాలు ఉంటే మనము ఎదీ అడగనవసరం లేకుండానే ఆయనే స్వయంగా అన్నీ సమకూరుస్తాడు.

నీవు చేయవలసినదల్లా నిష్కామ బుద్ధితో భక్తి శ్రద్ధ విశ్వాసాలతో చేయడమే. చేయవలసిన కర్మ నుంచి తప్పించుకోకు. కర్మ ని తప్పనిసరిగా ఆచరించు అయితే నిష్కామ బుద్ధితో ఆచరించు. కర్మ ఫలితాన్ని  పరమాత్ముడి పాదాల చెంత ఉంచు. ఏ సత్యమైన నిత్యమైన ఆనందాన్ని పొందడం కోసం జీవిస్తున్నావో అటువంటి సచ్చిదానందాన్ని అనుగ్రహించబడతావు.

శుభం

No comments:

Post a Comment