Monday, November 13, 2023

కథలెందుకు* ? *పిల్లలు కథలెందుకు వినాలి?* *పిల్లలు కథలెందుకు చదవాలి?

 *కథలెందుకు* ?
 *పిల్లలు కథలెందుకు వినాలి?* 
 *పిల్లలు కథలెందుకు చదవాలి?* 
       **********
ఈ ప్రశ్నలు మన చిన్నప్పడు మనకెప్పడైనా ఒచ్చినాయా?... రాలేదు.

ఇపుడు పిల్లలెవరికైనా వస్తుందా?... రాదు.

ఆ రాలేదుకీ. ........
ఈ రాదుకి........
సంబంధం లేదు.

మనమంతా కథలలో పెరిగాం.

అరుగు మీద కూర్చోబెట్టి అన్నం పెడుతూ అమ్మ,అమ్మమ్మ చెప్పిన రాముడి కథలు, కృష్ణుడి కథలు... 

పెరట్లో నవారు మంచం మీద తాతయ్య పక్కలో ఒదిగిపోయి, ఆ గంభీరమైన గొంతులో విన్న స్వాతంత్ర్య పోరాట కథలు...
మన రక్తంలో ఇంకా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఎన్నివిన్నా కడుపు నిండక ఇంకా ఇంకా అని వెంపర్లాడడమే గానీ, " *కథలెందుకు* ?” అని ఎన్నడైనా ప్రశ్న ఒచ్చిందా? రాలేదు.

ఈరోజు ఉద్యోగాల పుణ్యమా అని మనకు, 
టివిల పుణ్యమా అని అమ్మకుగాని,
అమ్మమ్మలకు గానీ, తాతయ్యలకు గానీ
 కథలు చెప్పే తీరికలేదు.

స్కూళ్ళ పుణ్యమా అని, ట్యూషన్లు పుణ్యమా అని వాళ్ళకి వినే తీరిక లేదు! 

కాబట్టి 'కథలెందుకు?’ అనే ప్రశ్న మన పిల్లలకు రాదు.

అన్యాయం... పాపం... అని మనకనిపించకపోతే మనం మనుషులమేనాండీ?...

ఐనా... ఈ ప్రశ్న రానే వచ్చింది కాబట్టి సమాధానం వెతుక్కొందాం.


పిల్లలు కథలెందుకు వినాలి?

ఆకట్టుకునేలా, 
హావభావాలతో, 
నాటకీయంగా కథచెప్పగలిగితే పిల్లలు ఒళ్ళుమరచి, కళ్ళు చెవులు అప్పగించి వింటారు. అప్పడు వారి ఏకాగ్రత తారాస్థాయిలో ఉంటుంది.
ఆసక్తిగా వినే క్రమంలో అర్థం కాని పదాలు దొర్లితే వాటిని అప్రయత్నంగానే సందర్భానుసారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు - కథ వాటి మూలంగా ఆగడం నచ్చదు కనుక, అర్థం కాని పదంగానీ, విషయం గానీ కథ అర్థం కావడానికి అడ్డం పడుతోంది అనిపిస్తే వెంటనే ప్రశ్నిస్తారు. ప్రశ్నలు వేయడం - సందేహాలు తీర్చుకోవడం అలవడుతుంది.

టి.వి., కంప్యూటర్ వంటి దృశ్యమాధ్యమాల్లో ఊహించేందుకు తావుండదు. కథ వింటున్నపిల్లలు అందులోని దృశ్యాలనీ, వ్యక్తుల్నీ జంతువుల్నీ వారి ఊహల్లో చూస్తారు. అదో అద్భుతమైన అనుభవం
ఊహల్లో – నిజ జీవితంలో ఎన్నడూ అనుభవంలోకి రాని వింతైన అనుభవాలకు లోనౌతారు. (సాహసం, పరాక్రమం, గాలిలో ఎగరడం, ఈగంత చిన్నగా అయిపోవడం, కొండంత పెద్దగా పెరిగిపోవడం లాంటివి)
సాధారణంగా పిల్లలు కథలోని ప్రధాన పాత్రలతో తమని గుర్తించుకుంటారు. (ఆడపిల్లలైతే రాజకుమార్తెగానో, అబ్బాయైతే రాజకుమారుడిగానో). ఆ పాత్రల యొక్క లక్షణాలు తమవిగా ఊహించుకోవడంలో అప్రయత్నంగా మంచి విలువలను, వీరోచిత లక్షణాలను కలిగి ఉండడం, చెడును ఎదిరించడం, న్యాయాన్ని రక్షించడం లాంటి గుణాలు తమలో ఉండాలని కోరుకుంటారు. (అందుకే చిన్నపిల్లల కథల్లో ప్రధాన పాత్రలు ఉదాత్తంగా, ఉన్నతంగా ఉండాలి).
విభిన్న నేపథ్యాలున్న కథలు చెప్లే పిల్లలు వాటి ద్వారా ఎన్నో సంగతులు నేర్చుకుంటారు. పాఠం వినేటప్పటికంటే, కథ వినేటప్పడు ఏకాగ్రత పదిరెట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి, చరిత్ర సంగతులు, పురాణగాధలు, వివిధ దేశాల జీవనశైలులు లాంటి విషయాలెన్నో కథల ద్వారా విన్నప్పడు వాటిని సులభంగా గుర్తు పెట్టుకుంటారు.
హాస్యపూరిత కథలైనా, సాహస గాధలైనా, పురాణాలైనా, పంచతంత్రం వంటి జంతువుల కథలైనా, ప్రస్తుత కాలం నేపథ్యంగా ఉన్న కథలైనా... ఏవైనా గానీ మంచి-చెడులను పిల్లలు అలవోకగా వడపోసి విలువలను వారే నిర్ధారించుకోగలుగుతారు. నీతిని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కథల్లోని పాత్రలు, వాటి లక్షణాలు పిల్లలపై వారి వ్యక్తిత్వ నిర్మాణంపై గాఢమైన ప్రభావం చూపిస్తాయి.
కథలు చెప్పడం - పిల్లలు వినడంలో పెద్దలకు పిల్లలకు మధ్య అనుబంధం ఏర్పడుతుంది. మీరు అమ్మా నాన్నలైతే మీ పట్ల పిల్లలు మరింత ఆపేక్ష పెంచుకుంటారు. మీరు టీచరైతే పిల్లలకు దగ్గరవడానికి. వారిలో బెరుకు. సంకోచం పోగొట్టడానికి ఇది మంచి మార్గం.

పిల్లలు కథలెందుకు చదవాలి?
కథలే కాదు. 
అసలు పిల్లలు ఏదైనా ఎందుకు చదవాలి? 
చదవడం బాగా వస్తే మంచి మార్కులొస్తాయి. 
మంచి మార్ములొస్తే మంచి ఉద్యోగమొస్తుంది. ఇలాంటివి పెద్దవాళ్ళుగా మనం ఆశించే ప్రయోజనాలు. 

కానీ పిల్లలెందుకు చదువుతారు?
చదివేది వారికి ఇష్టంగా ఉంటే చదువుతారు.
చదవడం సంతోషంగా ఉంటే చదువుతారు.
మరి కథలకు మించినవేమన్నా అలాంటివి ఉన్నాయా?
చదవడం జ్ఞాన సముపార్థనకి అత్యంత అవసరం. చదవడం అనేది పరీక్షల కోసమో, మార్కుల కోసమో కాదు. క్రొత్త విషయాలను నిరంతరం తెలుసుకుంటూ ఉండడంలోని ఉత్సాహం కోసం, విచిత్రమైన ఊహల ప్రపంచంలో విహరించడానికి, ధ్రిల్ కోసం, చక్కని భాషను ఆస్వాదించడంలోని ఆనందం కోసం చదవడం వ్యసనం కావాలి.
విస్తృతమైన పఠనాభిలాష, అలవాటు ఉన్న పిల్లలకు పాఠ్య పుస్తకాలలోని విషయాలను చదవడం, మంచి నీళ్ళ ప్రాయమే అవుతుంది. (మనకు కావాల్సిన మార్కులూ వస్తాయి!)
ఒక పాఠ్య పుస్తకం ద్వారా కొన్ని విషయాలు మాత్రమే తెలుస్తాయి. ఇతర పుస్తకాలు చదివే పిల్లలకు ఎన్నో విషయాలు తెలుస్తాయి.
రకరకాల పుస్తకాలు చదివే పిల్లలకు భాషపై పట్టు అలవోకగా వచ్చేస్తుంది. తెలిసిన విషయాన్ని చక్కగా వివరించి చెప్పగలిగే, వ్రాయ గలిగే నైపుణ్యం సులభంగా అలవడుతుంది. కాబట్టి ప్రశ్నలు - జవాబులు బట్టి వేయడం అనే వ్యర్ధ ప్రయాస వారికి అవసరం ఉండదు.
చదివే అలవాటున్న పిల్లలు చదవడం, వ్రాయడం, విషయ పరిజ్ఞానం, సృజనాత్మక వ్యక్తీకరణ లాంటి విషయాల్లో ఖచ్చితంగా మెరుగ్గా ఉంటారు.
చదివే ప్రతి పుస్తకం పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది - చదవడం ఎన్నో నైపుణ్యాలను, జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి.

పిల్లలు పుస్తకాలు ఎందుకు కొనుక్కోవాలి? కొనివ్వాలి?

35 రూపాయలు పెట్టి పిసరంత కిండర్ జాయ్ మురిపెంగా కొనిపెడతాం. 
100 రూపాయలు టికెట్టు పెట్టి సినిమాకు తీసుకెత్తాం. 
వేల రూపాయలు పోసి నెలకోసారి కూడా వేసుకోని దుస్తులు కొనడానికి ముందుంటాం. 

 *ఆదే యాభయ్యో వందో పెట్టి ఓ పుస్తకం కొనాలంటే మనసు రాదెందుకో కొందరికి.* 

వారాంతాల్లో సినిమాకో, మాల్ కో, హెూటల్ కో తప్పనిసరిగా తీసుకెళ్ళడం మధ్య తరగతి కుటుంబాలలో సంప్రదాయమై పోయిందీ మధ్యకాలంలో..... వాటికయ్యే వేల రూపాయల ఖర్చుతో పోలిస్తే నెలకి రెండు మూడు వందలు పెట్టి, పుస్తకాలు కొనడం భారం కాదు.

అనారోగ్యం పాలు చేసే వృధా ఖర్చులు సంతోషంగా పెడుతున్నాం. 

 *ఒక్కసారైనా పిల్లలను పుస్తకాల షాపు లోకి తీసుకెళ్లి ఏదో ఒక పుస్తకం ఇప్పించామా?* 

 *అనంతమైన జ్ఞానాన్నిచ్చి బ్రతుకును అర్థవంతం పుస్తకాల విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నామో??????....*⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️ ఆలోచించుకోవాలి.

 *చదివే అన్ని పుస్తకాలూ కొనక్కర్లేదు.కానీ కొన్ని పుస్తకాలైనా పిల్లలు తమ సొంతమనీ భావించాలి.* 

*నచ్చిన పుస్తకాలు కొనుక్కోవడం, వాటిని మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకొనే అవకాశం ఉండడం -* 

*తమ స్నేహితులలో ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి పిల్లలకు పుస్తకాల మీద మక్కువని పెంచుతాయి.*

*పుస్తకాలు కొనుక్కున్నపుడే అవి విలువైనవని పిల్లలకు అర్థమవుతుంది.*
 లేదంటే బట్టలు, బొమ్మలు, చెప్పలు, నగలు లాంటివే కొనదగిన వస్తువులని అనుకుంటారు. *పుస్తకాలను పిల్లలకు బహుమతులుగా ఇవ్వడం,* *తమ స్నేహితులకు బహుమతులుగా ఇప్పించడం* వంటివి అలవాటు చేస్తే వాటిమీద ప్రీతి పెరుగుతుంది.
 *వారాంతాల్లో లైబ్రరీకి వెళ్ళడం అలవాటు చెయ్యాలి.* 
అదో అద్భుత ప్రపంచ మనీ, మనలాగా చాలామంది ఇష్టంగా అక్కడికి వస్తారనీ, చదువుకోవడం అనేది అన్ని వయస్సులా వారూ చేసే పని అనీ అర్థంచేసుకోవడంతోపాటు నిశ్శబ్దంలో ఒక్కరే చదువుకోవడంలోని విలువని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూరు. అది అలవాటుగానూ మారుతుంది.
ఒక విషయం చెప్పేదానికంటే, పిల్లలు పెరిగే వాతావరణంలో అది ఒక భాగమైనప్పుడు దానిని వారు త్వరగా గ్రహిస్తారు. కథలు చదవమని పిల్లలను ప్రోత్సహించడంతో పాటు, రోజూ కొంత సమయమైనా ఇంటిలో కుటుంబ సభ్యులు (బడిలోనైతే టీచర్ లతో కలిసి లైబ్రరీ పీరియడ్ లోనూ) చదువుకొనే వాతావరణం, చదివిన కథల గురించి మాట్లాడుకోవడం లాంటి అలవాట్లు కనుక ఉంటే చదివే గుణం సహజంగా అబ్బుతుంది.
పిల్లలకు మనమివ్వగలిగిన అతి విలువైన కానుక వారితో సమయం గడపడమంటారు. కథలు మనకా గొప్ప అవకాశాన్నిస్తున్నాయి. మనకెంతో ఇష్టమైన పిల్లలపై మన ప్రేమను వ్యక్తం చెయ్యడానికి, వారితో కలిసి విహరించి ఆనందం పంచుకోవడానికీ కథల ప్రపంచం పిలుస్తోంది... అందరినీ!!!

 *రండి...పిల్లలను తీర్చిదిద్దుదాం.*

సేకరణ.
.....వినయశ్రీ.

No comments:

Post a Comment