హరిఓం , - - *అంతః కరణ శుద్ధి*
*ఎట్లా వస్తుంది... ?*
➖➖➖
```భగవంతుని కోసం నిరంతరం పరితపించటాన్నే తపస్సు అంటారు.
మనోవాక్కాయకర్మల యందు అధ్యాత్మిక చింతనతో తపించటాన్నే తపస్సు అంటారు.
ప్రతి మానవుడు పారమార్థిక ఆత్మనిగ్రహ ప్రయత్నాన్ని ఒక తపస్సుగా గ్రహిస్తాడు.
అలా తపస్సు చేయటం చేత మల విక్షేప ఆవరణాలు అనే త్రివిధ దోషాలు తొలగిపోతాయి.
శ్రవణం చేత మల దోషం తొలగుతుంది. మననం చేత విక్షేప దోషం తొలగుతుంది. నిరంతర ధ్యానమనే నిది ధ్యాస చేత ఆవరణ దోషం తొలగుతుంది. ఈ విధంగా మనస్సుని, శరీరాన్ని శుద్ధి చేసుకొన్న వారికి పాపాలు క్షీణిస్తాయి.
వాసనాక్షయం జరుగుతుంది. పూర్వ జన్మ వాసనలు క్రమేపీ తొలగుతాయి. ఆ విధంగా మనస్సు పాపవాసనాక్షయం చేకూర్చుకోగానే ప్రశాంతత నొందిన మనస్సు చేకూరుతుంది.
శారీరకమైన ఆవేదనల్నీ, ఇంద్రియలోలత్వాన్ని బుద్ధిపూర్వకంగా నిగ్రహించు కోవటంవల్ల మానవునికి ప్రశాంతత ఏర్పడుతుంది. కాన శారీరకంగాను, మానసికంగాను, తపస్సనేధనాన్ని పొందాలి. తపస్సు చేయాలంటే ప్రతి మానవుడు తాను జీవించే విధానంలో, తన పరిసరాల్లో ఆ వాతావరణాన్ని పెంపొందించుకోవాలి. ఉన్న ఇల్లే తనకు, తపస్సుకు కూడా అనుకూలంగా కుదిరేటట్లు మార్చుకోవాలి. తాను మారాలి. ఎందుకు ? మోక్షాకాంక్ష ఉండబట్టి.
మానవుడై పుట్టిన ప్రతివాడిని భగవంతుడు తనను చేరమని, చేరటానికి దారితెలుసుకోమని (నిర్దేశించాడు, ఉద్దేశించాడు) ఏర్పరిచాడు.
మానవుడు దాన్ని మర్చిపోయి జీవిస్తున్నాడు. అలా కాకుండా మానవుడు త్రికరణ శుద్ధిగా తపస్సంపన్నుడు కావాలి.
దేనికి? ఆనందం కోసం - మానవుడు కర్మేంద్రియాలను అరికట్టినా మనస్సు మాత్రం విషయాలన్నిటినీ తలపోస్తూ బహిర్ముఖంగా సంచరిస్తూ గడుపుతుంది.
ఆనందం ఎక్కడ ఉంది? ఆనందం ఆత్మలోనే ఉంది. ఆత్మానందమే నిజమైన సచ్చిదానందం.
నిషిద్ధమైన కర్మల్ని ఆచరించకుండా ఉంటే మనో మాలిన్యమనే పాపం పేరుకోకుండా ఉంటుంది. పాపం చెయ్యకుండా ఉండటమే కాదు, మానసికమైన వ్యభిచారం కూడా లేకుండా చూసుకోవాలి.
మనిషి మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. కాని మనస్సు పరిపరివిధాల వ్యభిచరిస్తూ ఉంటుంది. మానవుడు కర్మేంద్రియాలను అరికట్టినా మనస్సు మాత్రం విషయాలన్నిటినీ తలపోస్తూ బహిర్ముఖంగా సంచరిస్తూ గడుపుతుంది.
ఈ ఆధునిక కాలంలో మానవులందరిలోను జరుగుతోంది…
ఈ నిత్య ఈ మానసిక వ్యభిచారం!
దాన్ని అన్ని విధాల అరికట్టాలి.
దాన్ని అరికట్టటానికి ఆత్మతో మనస్సు అనురక్తమై జీవించే విధానాన్ని అలవడేటట్లు చెయ్యాలి. దానివల్ల అంతఃకరణశుద్ధి ఏర్పడుతుంది. దీనికి వివేకం, వైరాగ్యం తోడయితే లక్ష్యం సిద్ధిస్తుంది.
అయితే పాపాలు నశించి, ప్రశాంతత చేకూరి, సాధకుడు మోక్షంకోసం జీవించాలంటే అనురాగం కూడా నశించినవాడై ఉండాలన్నారు. విషయాల్ని దూరం చేసినంత మాత్రం చేత రాగం నశించదు. విషయంతోపాటు దానియందలి అనురాగం కూడా దూరం కావాలి అంటే మనస్సుకి ఆత్మ అనే భగవంతునితో అనుసంధానం చేకూరిస్తేనే రాగం కూడా నశిస్తుంది.
సాధకుడు అభిమానం, అహంకారం వంటి వాటికి తనలో స్థానం ఏర్పరుచుకొంటే ప్రత్యేకమైన కోరికలకు అది నిలయం అవుతుంది. కావున సాధకుడు అభిమానం, అహంకారం అనే వాటికి స్థానం లేకుండా చేసుకొంటూ వెళ్ళాలి.
అప్పుడు కోరికలకు స్థానం లేకుండా పోతుంది. మనస్సుకి నిస్సంకల్ప స్థితి చేకూరుతుంది. అదే మోక్షాన్ని కాంక్షించటానికి తగిన స్థితి.
సాధనలో మెలకువలో నిద్రను, నిద్రలో మెలకువను అనుభవించాలి.
ఎవరి అనుభూతిని వాళ్ళే పొందాలి. ఎవరి నిగ్రహానికి తగిన విధంగా వాళ్ళవాళ్ళకు తగిన అనుభవం సాధనలో చేకూరుతూనే ఉంటుంది.
ఏ కొద్దిపాటి శ్రద్ధాసక్తులు కలిగిన వాళ్ళుయినా దీన్ని అనుభూతి పొందుతారు. ఆ నమ్మకంతో, ఆ పట్టుదలతో, నిరంతర తపనతో, ఆత్మ జ్ఞానంకోసం సాధన చెయ్యాలి........................
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* - - 🙏🙏 ...... - వలిశెట్టి లక్ష్మీశేఖర్ ....... - 98660 35557 ......... - 27.03.2024 ....
No comments:
Post a Comment