Sunday, April 7, 2024

సత్సంగం - అమ్మ చెప్పిన అద్భుత కధ

 సత్సంగం - అమ్మ చెప్పిన అద్భుత కధ 🙏 

ఆధ్యాత్మిక ప్రసంగాలకు హాజరైన ఇద్దరు భక్తులు ఇలా మాట్లాడుకుంటున్నారు. 

1వ వ్యక్తి :-
నువ్వు ఇక్కడికి వచ్చి ఈ ప్రసంగాలను వింటూ సరైన ఆనందం అనుభవిస్తున్నావా? 

2 వ వ్యక్తి :
ఏం నీవు అనుభవించడం లేదా? 

1వ వ్యక్తి :-
ప్రశ్నకు ప్రశ్న సమాధానమా? 

2 వ వ్యక్తి :
కాదనకో. నేను నీలాగే తెలుసుకుందామన్న కుతూహలంతో ప్రశ్నించాను. నిజానికి నీవు ప్రశ్న వేశాకనే నాకు కూడా ఇలా ప్రశ్నించి ఇతరుల అనుభవాలను తెలుసుకోవాలని అర్థమయింది. నన్ను అపార్థం చేసుకోకు. నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసినా నాకు తెలిసింది చెప్పడానికి ఎలాంటి అభ్యంతరము లేదు. 

1 వ వ్యక్తి :
నీవు చాలా ప్రశాంతంగా ఉన్నావు. నీకు జీవన ప్రయాణంలో వాతావరణం, నీ కుటుంబ సభ్యులు అన్నీ సవ్యంగా ఉన్నాయనుకుంటాను. నీకు అనుకూలంగా ఉన్నాయనుకుంటాను. 

2 వ వ్యక్తి :
జీవన వాతావరణం కాని, కుటుంబ సభ్యులు గాని ఎలా ఉన్నా నాకు సుఖమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఏం జరగాలనుకున్నానో అది జరగలేదు. కొన్నాళ్ళు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడాను. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. 

అదేమిటంటే, "జీవితంలో జరుగుతున్నవన్నీ నేను అనుకున్నవేనని, ఏమి జరగాలో అవే జరుగుతున్నాయని" అనుకోవటం ప్రారంభించాను. 

కొంత ప్రశాంతత ఏర్పడటం ప్రారంభమైంది. ఆ ప్రామాణికము సరైనదేనన్న నమ్మకం కలుగుతూ వచ్చింది. నిరంతరం దాన్ని గమనిస్తూ వస్తుంటే ఒక చిన్న ఆలోచన వచ్చింది. 

జరగబోయేది తెలిసినవాడు భగవంతుడు ఒక్కడే. అన్నీ తెలిసిన భగవంతుడే, అవతార మూర్తిగా మానవ శరీరం ధరించి వచ్చినప్పుడు, తనకు ఎదురవుతూ ఉన్న సంఘటనలను, సమస్యలను శిరసావహించాడు కానీ వాటిని తన శక్తితో బహిష్కరించుకోలేదు. 

అలాంటప్పుడు పూర్వజన్మ పరంపరల వారసత్వంగా జన్మ ప్రారబ్ధములను అనుభవిస్తున్న నేను తెలుసుకోవాల్సింది ఏమిటంటే 

"జీవితంలో జరుగుతున్నవన్నీ నాకు అవసరమైనవేనన్న యథార్థం అర్థం చేసుకోవాలి. అలాంటి జ్ఞానమును నేను నేర్చుకోవాలి. దానికి అండగా భగవంతుడు ఉండాలి, ఉన్నాడు, ఉంటాడు. ఈ భావన నాలో నిరంతరము వృద్ది చెందుతూ ఉండాలని ఆశయంతో నేను ఈ ప్రవచనాలు వింటూ ఉంటాను. 

అప్పుడు ఈ ప్రవచనాలు నా అభిప్రాయాలను, ఆలోచనలను ఇంకా దృఢపరుస్తుంటాయి, 

2 వ వ్యక్తి :
నీ అభిప్రాయాలు, ఆచరణ చాలా బాగున్నాయి. ఎలా ఉండాలో తెలియని నాకు తెలియపరచినట్లయింది. అందుకే పెద్దలు మంచి స్నేహాన్ని సంపాదించుకోవాలని చెబుతారు. ఈరోజు నీ స్నేహం నాకు అప్రయత్నంగా లభించింది. 

మనము ఈ ప్రవచనం మాత్రమే విని తర్వాత ఎవరి దారి వారిది గాకుండా మన స్నేహాన్ని ఇలా పెంచుకుందాము. ఒకరికొకరు ఆసరాగా ఉందాము. 

ఇది అండి సత్సంగం అంటే. ఇలాంటివి ఏర్పాటు చేసుకోండి. మీ జీవితాలను సార్ధకం చేసుకోండి. క్షేత్రాన్ని గురించి గాకుండా క్షేత్రజ్ఞుడిని గురించి ఆలోచించాలి. శరీర యాత్రకు సంబంధించిన ధర్మాన్ని పాటించాలి. దైవీశక్తులను సంఘటనలలో మలుచుకుంటూ ఉంటే నిశ్చలతము, ప్రశాంతత మనలోనే ప్రవహిస్తుంటాయి

No comments:

Post a Comment