Friday, April 12, 2024

ముందు ఎవరు మాట్లాడాలి...?

 *ముందు ఎవరు మాట్లాడాలి...?*
              
*నానాటికీ ఛిద్రమవుతున్న మానవ సంబంధాలు!!!*

*దూరమయిపోతున్న రక్తసంబంధీకులు! ప్రతి వ్యక్తికీ ఎదురవుతున్న సమస్య!*

*ఒక అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు వచ్చాయి. మాటపట్టింపు మూలాన అనుబంధం ఎడమయ్యింది. రెండు కుటుంబాలు పరస్పర వైషమ్యంతో దూరమయ్యాయి.* 

        *కాలక్రమాన దూరమూ పెరిగింది. తరాలు మారాయి.*

*అన్నగారి కొడుకు వృత్తి వ్యాపారాలలో ఎదుగుదల సాధించాడు. అన్నగారు కన్ను మూశారు. కొంతకాలానికి అన్న కొడుకు తన తండ్రికి అభీష్టమైన రామాయణాన్ని పారాయణ చేశాడు. తన నాన్నపై భక్తి, ఆ నాన్నకి ఇష్టమైన రామునిపై భక్తిగా రెండు రూపాలయింది.*

*నాన్న పై ప్రేమయే రామాయణ పారాయణాన్ని చేయించింది. పారాయణ పూర్తి చేశాక -  పెద్ద ఎత్తున పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశాడు. బంధుమిత్ర బలగాన్ని ఆహ్వానించదలచుకున్నాడు. ఆహ్వాన పత్రాలను కూడా శోభాయమానంగా ముద్రించాడు. మొదటి పత్రం దేవుని పేర రాశాడు. ఇక -  తరువాతి పత్రం - మానవ సంబంధాలలోని వారిలో - ఎవరికి తొలిగా ఇవ్వాలనేది ప్రశ్న, నాన్న పరమపదించాడు. ఆ తరువాత? తండ్రి తరువాత తండ్రి బాబాయి. ఏనాడో విడిపోయిన బంధం. ఎక్కడున్నారో? ఎలా ఉన్నారో..!*

*కానీ వెతికి సాధించి అయినా మొదటి పత్రం బాబాయికే ఇవ్వాలి - అని నిశ్చయించుకున్నాడు!*

*ఇన్నాళ్ళు తమ కుటుంబాన్ని పట్టించుకోని బాబాయిని, పిల్లలమని కనికరం కూడా లేక, పలకరించని బాబాయిని... తానే ముందుగా పలకరించి పిలవాలా? మహాకష్టం కలిగినప్పుడు కూడా స్పందించి చేరదీయని ఆ కుటుంబానికి తానే పని కట్టుకొని, మొదట పిలవాలా?*
         *ఈ ప్రశ్నలు కలిగాయి. కలగడం సహజం కూడా!  'నేను' అనే భావాన్ని అంత తేలిగ్గా వంచడం సాధ్యం కాదు.* 

*కానీ ఆ సమయంలో తాను పారాయణ చేసిన రామాయణం గుర్తుకు వచ్చింది.*

         *"పూర్వభాషీ ప్రియంవదః" అని రామ చంద్రుని వర్ణించాడు వాల్మీకి.* 
          *"తానే మొదట మాట్లాడతాడు - ప్రియంగా మాట్లాడతాడు" ఇదీ రాముని మాట సొగసు.*
         *అంతేనా - "వేయి అపకారాలైనా మరచిపోయి క్షమించగలడు. ఒక్క చిన్ని ఉపకారాన్ని సైతం కలకాలం గుర్తుపెట్టుకునే కృతజ్ఞతా మూర్తి".*
         *"ర్కిణామపివత్సలః" శత్రువుని కూడా క్షమించగలిగే ప్రేమమూర్తి.*
           *ఈ విశేషణాలు స్ఫురించాయి.*

*అంతే.. కృతనిశ్చయంతో పట్టుపట్టి ఎంతో శ్రమపడి బాబాయి సమాచారం సేకరించి, అతడున్న ఊరికి వెళ్ళి కలుసుకున్నాడు. బహుకాలం తర్వాత అన్న కొడుకు తనంతట తానే వచ్చి పాదనమస్కారం చేసి పలకరించగానే తమ్ముడి మనసు కరిగింది.*

*"బాబాయ్! శ్రీరామ పట్టాభిషేకం చేసుకుంటున్నాను. నాన్న పోయాక, నా చేతులు మీద చేస్తున్న పెద్ద శుభకార్యం ఇది. నాన్న తర్వాత అంతటి వాడవు నువ్వే దగ్గరుండి దీనిని నిర్వహించాల్సిన బాధ్యతనీదే" అని ఆదరంగా పిలిచాడు అన్న కొడుకు. కరిగిన మనసు కన్నీరై స్రవించింది బాబాయికి.*

*గాఢంగా అన్న కొడుకుని ఆలింగనం చేసుకున్నాడు. ఇంటిల్లిపాది రాముని పట్టాభిషేకపు పండగకి తరలివెళ్ళారు. అంతా కలసి నిండుగా హాయిగా రామారాధన చేసుకున్నారు.*

          *ఇది ఒక యథార్థ సంఘటన. స్వయంగా ఆ కుటుంబమే చెప్పగా విన్న విషయం.* 

         *మన ధార్మిక గ్రంథం వల్ల జీవితపు విలువలు, మానవ సంబంధాల మెరుగుదల ఎంత చక్కగా పటిష్టమౌతాయో తేల్చి చూపిన వాస్తవం.*

*మనుషుల మధ్య మాట పట్టింపులు, లేదా ఏ చిన్న సంఘటనకో  స్నేహ బాంధవ్యాలను తెంపుకొనే తెగింపు అప్పుడప్పుడు సంభవిస్తుంటాయి. కానీ వాటిని కొనసాగించుకొని దూరమవడం వాంఛనీయం కాదు.*
 *ముఖ్యంగా తిరిగి వెనకటి ప్రేమలలో నుండి పొంగుతున్న పంతమో పట్టింపో దానిని వెలికి తీయనివ్వదు. దూరం దూరం మిగిలి పెరుగుతుంది.*
 *ఆ పట్టింపు రాతి పొరను ఛేదించే శక్తి పూర్వభాషిత్వం. సాధారణంగా ఒక మనిషి మరో మనిషిని పలకరించడానికి కూడా బిగువు, అహం అడ్డు వస్తాయి. ప్రధానంగా ఒకే రంగంలో ఉన్న వారి నడుమ ఉన్న ఈర్ష్యా స్పర్ధల వలన కూడా ఇటువంటి బిగింపులుంటాయి.*

*ఆ సందర్భంలో మనమే ముందు పలకరించడం, మాట్లాడడం వల్ల ప్రతికూల భావాలు కూడా పటాపంచలై స్నేహ బంధం దృఢపడుతుంది.* 

*సౌమనస్య భావం సమకూర్చుకోవడమే లక్ష్యంగా జీవితం సాగితే దానికి మనసారా మాట్లాడుకోవడమే మంచి మార్గం. తానే తొలి అడుగువేసి పలకరించడం ఉత్తమ పురుషుల సంస్కారంగా మన ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి.*

*అందుకే రామాయణాది సద్గ్రంథాలు మన వ్యక్తిత్వాన్ని మెరుగుపెట్టి, నేటి మానవసంబంధ సమస్యలను పరిష్కరించే కరదీపికలుగా నడిపిస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.*……

No comments:

Post a Comment