Wednesday, August 14, 2024

 రామాయణమ్ 24
...
 బ్రహ్మదేవుని కుమారుడు కుశుడు,
ఆయన కుమారుడు కుశనాభుడు, 
ఆయన కుమారుడు గాధి
గాధి కుమారుడు విశ్వామిత్రుడు! .
.
విశ్వామిత్రుడు ఒక రాజు ,ఒకసారి ఈయన తన సైన్యాన్ని వెంటపెట్టుకుని విహారానికి బయలుదేరాడు! అలా వెడుతూ ,వెడుతూ అరణ్యమధ్యములో ఉన్న వశిష్ట మహర్షి ఆశ్రమం చేరుకుంటాడు.
.
ఒకరినొకరు కుశలప్రశ్నలు వేసుకొన్న తరువాత వశిష్ట మహర్షి కౌశికునితో నీకు ,నీ సైన్యానికి ఆతిధ్యం ఇస్తాను స్వీకరించు! అని అంటాడు! అప్పుడు విశ్వామిత్రుడు మీరిచ్చిన కందమూలఫలములు నాకు తృప్తికలిగించినవి ఇక వేరే ఆతిధ్యమెందులకు మహర్షీ వలదు నాకు అని వినయంగా బదులు పలుకుతాడు.
.
(ఒక అక్షౌహిణీ సైన్యానికి విందు ఇవ్వటం మాటలుకాదు ! ఆశ్రమాలలో ఉండే మునుల వద్ద అంత వ్యవస్థ ఉండదు కాబట్టి మహర్షిని ఇబ్బంది పెట్టడం ఎందుకని వద్దంటాడు).
.
వశిష్ట మహర్షి పట్టిన పట్టు వదలక విందు స్వీకరించాల్సిందే అని అంటాడు .అప్పుడిక తప్పనిసరి పరిస్థితుల్లో సరేనంటాడు విశ్వామిత్రుడు!.
.
క్షణాలలో అంత సైన్యానికీ కూడా  
పంచభక్ష్య పరమాన్నాలతో ,షడ్రసోపెతమైన విందు ఏర్పాటు చేస్తాడు మహర్షి వశిష్ఠుడు. అంతకు ముందెన్నడూ అంత అద్భుతమైన వంటకాలను రాజుగాని ఆయన పరివారం గాని రుచిచూసి ఉండలేదు! ఆశ్చర్యం కలుగుతుంది విశ్వామిత్రునకు ! ఇది ఎలా సాధ్యం ? ముక్కుమూసుకుని మూలన కూర్చున్న మునులకు ఇంత వ్యవస్థ ఎలా సమకూరింది? .
.
ఉండబట్టలేక ఆ విషయాన్ని వశిష్ట మహర్షి వద్ద ప్రస్తావిస్తాడు ! అందుకు జవాబుగా ఆయన తన ఆశ్రమంలోని ఒక "ఆవు" ను చూపిస్తాడు . ఈ ఆవా? ఎంతో అమాయకంగా ఉన్న ఈ ప్రాణా? నమ్మబుద్దికాలేదు విశ్వామిత్రుడికి! .
.
అప్పుడు వశిష్ఠుడు చెపుతాడు ! దీని పేరు "శబల" ఇది దివ్యధేనువు! దీనికున్న శక్తులు అపారం! .
.
శబలను చూసి ముచ్చటపడతాడు విశ్వామిత్రుడు! మహర్షీ ఈ ఒక్క ఆవును నాకిచ్చేయి నీకు లక్ష గోవులను ఇస్తాను అని అంటాడు విశ్వామిత్రుడు ,అందుకు ఒప్పుకోడు వశిష్ఠుడు.
లక్షగోవులతో పాటు నీవు కోరినంత ధనమిస్తానని చెపుతాడు కౌశికుడు ,అందుకూ ఒప్పుకోక ,రాజా నా ఆశ్రమ వ్యవస్థ మొత్తానికీ ఇది ఒక్కటే ఆధారం దీనిని నేను ఎలా వదులుకోను ! దయచేసి ఆ ఆలోచన విరమించుకో అని బదులు పలుకుతాడు వశిష్ట మహర్షి!.
.
వాయు భక్షణ చేస్తూ దొరికిన కందమూల ఫలాలు భక్షించే మీ వద్ద ఇంత అమూల్యమైన వస్తువులెందుకు? 
రాజ్యం లో శ్రేష్టమైన వన్నీ రాజు వద్దనే కదా ఉండాలి ! అయినా నిన్నడిగేది ఏమిటి? నా రాజ్యంలో ఉన్నవన్నీ నావే ! అని బలవంతంగా ఈడ్చుకుపోసాగాడు ఆ ఆవుని విశ్వామిత్రుడు!.
.
అప్పుడు శబల అతని బంధనాలనుండి తప్పించుకొని మహర్షి వద్దకు వచ్చి హే భగవన్! నీవు నన్ను ఆతనికి ఇచ్చివేశావా ! అని అడుగుతుంది ! ...లేదు! నిన్ను నేను ఎవరికీ ఇవ్వలేదు అని చెప్పి అమ్మా శబలా నీ రక్షణ నీవే చూసుకో అని అనుమతిస్తాడు!.
.
ఆ అనుమతి రావడమే తరువాయి ! అప్పటివరకూ అమాయకంగా అగుపించిన శబల  సబల అయ్యింది. కంట నిప్పుల వర్షం కురిసింది ! ఆవిడ శరీరంలోని ప్రతి భాగం నుండి అసంఖ్యాక మైన వీరులు పుట్టుకొచ్చారు!.
.
ఆవిడ హుంకారం నుండి" పహ్లవులు",కాంభోజులు,
పొదుగునుండి శస్త్ర పాణులైన బర్బరులు,శకృత్ ప్రదేశమునుండి శకులు( పృష్ఠ భాగము..వెనుక ప్రదేశం).యవనులు పుట్టలో నుండి బయటకు వచ్చే చీమలబారుల్లాగా జన్మించి క్షణాలో విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేశారు! .
.
అది చూసిన ఆయన కొడుకులు నూర్గురు సాయుధులైన వారు వశిష్ఠుడు మీదికి దండెత్తగా ,మహర్షి చేసిన హుంకారానికి ఒక్జడు తప్ప అందరూ హతులవుతారు.
.
అప్పుడు విశ్వామిత్రుడు ఎలా ఉన్నాడంటే అలలు ఆగిపోయిన సముద్రంలాగ,కోరలు పీకిన పాములాగ,గ్రహణం పట్టిన సూర్యుడిలాగా ఉన్నాడట! .
.
నిర్వేదంతో రాజ్యాన్ని బ్రతికి ఉన్న కొడుకుకు అప్పగించి అడవులకు వెళ్ళి శివుడిగూర్చి తీవ్రమైన తపస్సుచేసి లోకంలో ఉన్న సకల అస్త్రములు తన స్వాధీనం లోకి వచ్చేటట్లుగా వరం పొందుతాడు .
.
ఆ అస్త్రబలం చూసుకొని మరల వశిష్టాశ్రమం మీద దండెత్తుతాడు విశ్వామిత్రుడు!.
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

.

No comments:

Post a Comment