Thursday, August 8, 2024

 *🌹శివానందలహరి - శ్రీ శంకర భగవత్పాద     విరచితము -63 🌹*

*మార్గావర్తితపాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే*
*గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే ।*
*కించిద్భక్షితమాంసశేషకబలం నవ్యోపహారాయతే*
*భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే ॥63॥*

శంకరులు భక్తి ఎంత గొప్పదో‌ ఉపదేశిస్తున్నారు. ఈ‌ శ్లోకం భక్తకన్నప్ప యొక్క శివభక్తి విశిష్ఠతకు తార్కాణం.

దారులుతిరిగి అరిగిపోయిన చెప్పు పశుపతి శరీరం (శివలింగం) తుడుచు చీపురు అయినది. పుక్కిలినీటితో‌ తడపుట, త్రిపురాసురసంహారికి దివ్యాభిషేకం అయినది. కొంచెం తిని ఎంగిలిచేసిన మాంసపుముక్క, నైవేద్యము అయినది. ఆటవికుడు భక్తశ్రేష్ఠుడయినాడు. ఓహో! భక్తి చేయలేనిది ఏమున్నది ?

*వివరణ*
ఇది భక్త కన్నప్ప సూటి భక్తిని తెలిపే శ్లోకం. సామాన్యoగా పూజలు , పునస్కారాలు , అర్చనలూ , ఆరాధనలూ , ఉన్న చోట--మడి ఆచారాల వంటి నియమ నిబంధనలు చాలా వుంటాయి. ఏం చేసినా, ఎలా చేసినా తప్పు పట్టే వారు వుంటారు. కొందరు ఆ తప్పులకు విపరీతమైన ప్రాయశ్చిత్తాలను కూడా సూచించి పాటింపచేస్తారు. నిజమైన భక్తికి ఇటువంటి మడి ఆచారాలతోనూ, నియమనిబంధనలతోనూ ఏమీ సంబంధం లేదు. భక్తి కలిగినపుడు మనస్సు హృదయము ద్రవించి ఏం చేయిస్తే వాటిని సూటిగా చేసి సంతృప్తిని ఆనందాన్ని అనుభవించడమే దైవానుగ్రహం పొందటానికి, తరించడానికి మార్గం. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా మనం పెట్టుకున్న నియమ నిబంధనలను మనం సాధారణంగా వదులుకోలేక 
భగవంతునికి దూరమౌతాము. కన్నప్ప కథ తెలిస్తే కానీ సందేహం 
తీరదని ఈ ఒక శ్లోకం ఆదిశంకరులు ఈ శివానంద లహరి లో కేటాయించారు.
పుణ్య క్షేత్రమైన కాళహస్తికి దగ్గరలో ఒక బోయల గూడెం వుండేది. ఆ గూడెం పేరు 'ఉడుమూరు'. శివభక్తి పరులైన దంపతికి ఒక కొడుకు పుట్టాడు. అతనికి వాళ్ళు పెట్టుకున్న పేరు 'తిన్నడు' అనే పేరు కూడా సార్ధకమే అయింది. తల్లిదండ్రుల నుండి శివభక్తి తిన్ననికి వారసత్వంగా వచ్చింది.
ఒకనాడు అడవికి వేటకు వెళ్ళినపుడు ఒక అడవి పంది అరుస్తూ ఒక పొదలో దూరి కనబడకుండా అంతర్ధానమైంది. తిన్నడు దానికోసం వెళ్ళి వెదుకుతూ వుంటే ఆ పొదల మధ్య శివలింగం ఒకటి కనబడింది.    ఆ శివలింగంలో సాక్షాత్తు శివుణ్ణే చూసాడు తిన్నడు. ఇద్దరుంటే ఎలా మనం మాట్లాడుకుంటామో అలాగే ముఖాముఖీగా ఆ శివలింగం తో ఏవేవో మాట్లాడుతూ కబుర్లు చెప్పేవాడు.పూజ చేసేవాడు.శివునికి ఆకలి వేస్తోందని ఆకులను పొట్లం లాగా చుట్టి రుచి చూసిన మాంసపు ముక్కలను దాంట్లో వుంచి - ఒక చేత్తో పట్టుకుని , రెండో చేతిలో అడవి పూలు , బిల్వ దళాలు పట్టుకుని , నోటి నిండా నీళ్ళు పుక్కిటపట్టి తిన్నగా శివలింగం దగ్గరకు వచ్చి చేతుల్లోని ద్రవ్యాలు క్రింద పెట్టి , తన కాలి చెప్పుతో లింగంపై పడిన ఎండుటాకులు, 
పండుటాకులను చీపురుతో ఊడ్చినట్లు తుడిచేవాడు. తన పుక్కిట్లో వున్న నీటిని లింగంపై ఉమ్మి కడిగేవాడు. దళాలను పూలను పైన వేసి పూజించేవాడు. దొప్పలోని 
రుచి చూసిన మాంసాన్ని నైవేద్యం పెట్టేవాడు.
మనం కనక ఈ పూజ చూస్తే రెండు చేతివ్రేళ్ళుతో చెక్కిళ్ళు
నొక్కుకునేవాళ్ళం. శివుడు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. ఒక రోజు శివుడు తిన్నడిని పరీక్షిద్దామని తన ఒక కుడి కంటినుండి నీరు కార్చాడు. తిన్నడు ఆ కన్ను ఆ విధంగా ఉండడం చూడలేక వెంటనే అడవిలోని కొన్ని చెట్ల ఆకుల రసాలు తెచ్చి వైద్యం చేసాడు. అయినా నీరు రావటం తగ్గలేదు. పైగా ఈసారి రక్తం కూడా రావడం ప్రారంభించింది.ఆ రక్తాన్ని ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు చేసాడు.అయినా రక్తం కారటం ఆగలేదు. అప్పుడు శివుని ఆ కంటిని ఊడపేరికి తన కన్నునొకదానిని అక్కడ పెట్టాడు.
ఇంతలో రెండవ కంటినుండి నీరు కారడం రక్తం కారడం ప్రారంభమైనది.ఈసారి కూడా ఇదివరకులానే శివుని రెండవ కంటిని ఊడబెరికాడు. తన రెండవ కంటిని బాణంతో తీయబోతూ ఈ కన్ను కూడా తనకు లేకపోతే గుడ్డివాడై శివుడు ఎక్కడ ఉన్నాడో ఆశివునికి కళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలియక తికమక పడాల్సివస్తుందని రక్తంకారే శివుని రెండవ కంటివద్ద తన కాలి బొటనవేలిని గుర్తుగా ఉంచి తన రెండవకంటిని తీసి శివునకు పెట్టడానికి ఉద్యుక్తుడైనాడు. అప్పుడు శివుడు వెనువెంటనే ప్రత్యక్షమై నాకు కన్ను నీ కన్నును అప్పగించి రక్షించిన తిన్నడివి .. ఈ రోజునుండి నీవు కన్నప్పగా ఖ్యాతి వహిస్తావు. నీవు తినకుండా నాకు నైవేద్యం పెడితే నేను తింటానా అని చెప్పి నైవేద్యం ఆరగించకుండానే అంతర్ధానమైనాడు. ఆ శివుడే కాళహస్తీశ్వరుడు.అప్పటినుండి ముందు కన్నప్పకు నైవేద్యం పెట్టి తరువాతనే కాళహస్తీశ్వరునకు నైవేద్యం పెట్టే ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది.
   ముక్కంటినే ముగ్ధుడను చేసిన ఆ మూఢభక్తి ఎంతటిదో ఆలోచించండి.ఒకరి భక్తిని పూజను మరొకరు విమర్శించుకోకండి.ఎవరికి తోచిన రీతిన వారిని అర్చించుకోనివ్వండి.భక్తి ప్రధానం కాని తంతు, తతంగం , మంత్రం, తంత్రం కాదు ముఖ్యం అని ఈ శ్లోకం తెలియచేస్తుంది.

*🕉️ ఓం నమఃశివాయ 🕉️*

No comments:

Post a Comment