*గాయపడ్డ నమ్మకం* (తప్పక చదవాల్సిన ఒక దేశభక్తుని కథ) డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
''తాతా రేపు గణతంత్ర దినోత్సవం. కలెక్టర్ ఆఫీస్ నుంచి కబురొచ్చింది. మిమ్మల్ని తీసుకొని కర్నూలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌కు హాజరు కమ్మని ఆహ్వానపత్రం గూడా పంపించారు'' అంటూ తాత చేతికి అందించింది భారతి.
విశ్వనాథం దానిని అందుకోను గూడా అందుకోలేదు. నిరాసక్తంగా చిరునవ్వు నవ్వుతూ చేతిలోని దినపత్రిక తిప్పసాగాడు.
''ఎందుకు తాతా... ఎప్పుడూ పోనంటావు. నీకు సన్మానం జరుగుతుంటే చూడాలని ఆశగా వుంది. ఈ ఒక్కసారికీ రాగూడదూ'' అంది భారతి.
''ఈ ముసలి వయసులో ఆ సన్మానం కోసం అంతదూరం పోవడం ఎందుకులేమ్మా... మనం పోయినా పోకపోయినా అక్కడేమీ ఆగదులే. ఎప్పట్లాగే పక్కనే వున్న పాఠశాలకు వెళతా'' అన్నాడు.
''అదేంది తాతా! అంత మాటంటావు. మీరంతా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసిన పోరాట ఫలితమే గదా ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు. మీలాంటి వాళ్ళు స్వయంగా అనుభవాలు చెప్తే యువతకు ఎంత స్ఫూర్తివంతంగా వుంటుంది. ఆ పోరాటం, త్యాగాలు, దేశభక్తి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. మార్గదర్శనం చేయాల్సిన మీరే ఇలా ముఖం చాటేయడం పద్ధతి కాదు'' అంది భారతి నిష్ఠూరంగా.
విశ్వనాథానికి మనవరాలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ప్రతి సంవత్సరం ఆగష్టు 15, జనవరి 26 ఇదే గొడవ.
అంతలో మళ్ళా భారతి ''చూడు తాతా... ఈ ఒక్కసారికి రా నా కోసం మళ్ళా ఎప్పుడూ అడగను. రానంటే మాత్రం నా మీద ఒట్టే. నీతో ఇకపై ఎప్పుడూ మాట్లాడను'' అంటూ ఆఖరి అస్త్రం ప్రయోగించింది.
విశ్వనాథానికి డిగ్రీ చదువుతున్న తన మనవరాలంటే చాలా ప్రేమ. దాంతో కాదనలేకపోయాడు. అదీగాక ఇప్పటికే వయసు ఎనభై దాటింది. ఇక రేపో... ఎల్లుండో... చివరిసారిగా కర్నూలు నగరం నడిబొడ్డున వున్న ఆ కొండారెడ్డి బురుజును ఒకసారి చూడాలనిపించింది. దాంతో అలాగేనంటూ తలూపాడు.
భారతి ఆనందం పట్టలేకపోయింది. తాత చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుంది.. తర్వాత రోజు ఉదయం త్వరగా తయారై తాతను తీసుకొని బస్సులో బైలుదేరింది.
విశ్వనాథానికి మనసంతా చాలా ఉద్వేగంగా వుంది. స్వాతంత్య్రానికి పూర్వం తాను చేసిన సాహసం గుర్తుకొస్తే ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది. అసలు అంత ధైర్యంగా తానేనా అలా చేసింది అనిపిస్తుంది. ఆ వయసులో వున్న ఆవేశం, స్వాతంత్య్ర కాంక్ష, ఆంగ్ల ప్రభుత్వంపై వున్న వ్యతిరేకత, స్వాతంత్య్రం వల్ల ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయనే బలమైన విశ్వాసం ఆరోజు అట్లా చేయించిందనుకుంటా. నెమ్మదిగా విశ్వనాథం ఆ రోజుల్లోకి జారిపోయాడు.
అది 1942. క్విట్ ఇండియా ఉద్యమ సమయం. మహాత్మాగాంధీ ఇచ్చిన ''సాధించు లేదా మరణించు'' అనే నినాదం గడప గడపకూ చేరి మహోగ్ర తరంగంలా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సందర్భం. కర్నూలు జిల్లాలో ప్రజలందరినీ సమీకరించి, ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి, కొండారెడ్డి బురుజు ముందున్న విశాలమైన ఖాళీ స్థలంలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అప్పటి నాయకులు.
సరిగ్గా దానికి రెండు రోజుల ముందు... సాయంత్రం మసక మసక చీకటి పడుతుండగా కర్నూలును ఆనుకుని ప్రవహిస్తున్న హంద్రీనది ఇసుక తిన్నెలపై కూర్చున్న నలుగురు వ్యక్తులు చాలా సుదీర్ఘమైన ఆలోచనలో వున్నారు. కుడివైపు కర్నూలు మునిసిపాలిటీ, ఎడమవైపు బుధవారపేట గ్రామం కనిపిస్తూ వుంది. మధ్యలో రెండింటినీ కలుపుతూ నిర్మించిన పెద్ద వంతెన అనేకసార్లు వచ్చిన హంద్రీ వరదల్లో బాగా దెబ్బతిని శిథిలమై పోయి వుంది. నలుగురిలో అందరికన్నా పెద్దవాడైన వ్యక్తి నిశ్శబ్దాన్ని పారద్రోలుతూ గొంతు విప్పాడు.
''లాభం లేదు. మనం మౌనంగా ఇలాగే వుంటే లాభం లేదు. ఏదో ఒక సంఘటన జరగాలి. అది ప్రజలందరిలో ఉత్తేజాన్ని నింపి ఉద్యమం వైపు ఉరకలు వేయించేలా వుండాలి. నాయకులే కాదు సామాన్యులు గూడా బ్రిటిష్ తూటాలకు ఎదురొడ్డి నిలబడేలా ధైర్యాన్ని కలిగించాలి. మన సాహసం పల్లెపల్లెకూ పాకి, గుండె గుండెకూ చేరి నూతనోత్తేజాన్ని నింపాలి'' అన్నాడు.
వెంటనే ఒక యువకుడు ''జొహరాపురం, రోజా, కల్లూరులలో దాదాపు వందమంది దాకా యువకులు మనం ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా వున్నారు. మూడు దళాలుగా విడిపోయి రేపటిలోగా వీలైనన్ని చోట్ల టెలిఫోన్ స్తంభాల తీగలను తెంచేద్దాం. అట్లాగే రైళ్ళు నడవకుండా పట్టాలు తొలగిద్దాం. ప్రభుత్వ కార్యాలయాలపైన, రక్షకభట నిలయాలపైన రాత్రుళ్ళు దాడులు చేసి ఆయుధాలు ఎత్తుకుపోదాం. దాంతో అంతా అల్లకల్లోలమైపోతుంది'' అన్నాడు ఆవేశంగా.
ఆ మాటలకు నడివయసు వ్యక్తి ''మిత్రమా! ఆవేశపడకు. మనం మహాత్మాగాంధీ అడుగుజాడల్లో సత్యం, అహింసలను వదలగూడదు. 1929లో మహాత్మాగాంధీ రెండవసారి జిల్లాలో అడుగుపెట్టి, ఖద్దరునిధికి విరాళాలు సేకరిస్తూ తన ప్రసంగాలతో ప్రజలను ఉత్తేజభరితం చేశాడు. కానీ ఇక్కడి భూస్వాములంతా జస్టిస్ పార్టీకి జేజేలు పలుకుతూ, ఆంగ్లేయ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుండడంతో, సామాన్య ప్రజలు మనసులో స్వాతంత్య్ర కాంక్ష వున్నప్పటికీ భయంతో బైటకడుగు పెట్టటానికి సాహసించడంలేదు. గాడిచెర్ల, వనం శంకరశర్మ, మేడం వెంకయ్య శెట్టి, బియాబానీ, సర్దార్ నాగప్ప లాంటి గాంధేయవాదులంతా గ్రామాలన్నీ తిరుగుతూ స్వేచ్ఛా భావాలు వ్యాప్తి చేశారు. కానీ ప్రజల్లో ఏదో సంకోచం. తడబాటు. అందుకే ప్రజలందరినీ కదిలించేలా, ఆంగ్ల ప్రభుత్వపు చేతగాని తనాన్ని చాటి చెప్పేలా ఒక సాహసోపేతమైన చర్యను చేపట్టాలి. ఏమంటారు?'' అన్నాడు. దానికి మిగతావాళ్ళు అలాగేనంటూ తలూపుతూ ''మీరు పెద్దవారు. ఇప్పటికే రెండుసార్లు కారాగారశిక్ష అనుభవించి వచ్చినవారు. చెప్పండి. ఏం చేద్దాం'' అన్నారు ముక్తకంఠంతో.
అతను ఒక్క నిమిషం చుట్టూ చూశాడు. బాగా చీకటి పడింది. దూరంగా కర్నూలు వీధుల్లో అక్కడక్కడా విద్యుద్దీపాలు తళుకు తళుకుమంటున్నాయి. ఎదురుగా కూర్చున్న వాళ్ళ ముఖాల్లోకి సూటిగా చూస్తూ ''మరో రెండు రోజుల్లో కర్నూల్లో పెద్దర్యాలీ జరగబోతోంది గదా... దానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి గూడా అనేకమంది వస్తున్నారు. అదే సమయంలో మనం నగరంలోని ప్రధానమైన కూడలిలో మన ఆత్మగౌరవానికి చిహ్నమైన మూడు రంగుల జెండాను సగర్వంగా ఎగురవేయాలి...''
ఆ మాటలకు అడ్డుపడుతూ ఒక యువకుడు ''అదేమంత పెద్ద కష్టం కాదు గదా! దానికింతగా ఆలోచించాల్సిన అవసరమేమి'' అన్నాడు.
''నిజమే... నువ్వు చెప్పింది. కానీ ఇక్కడ జెండా ఎగురవేయడం ఒక్కటే కాదు ముఖ్యం. అది ఎక్కడ ఎగురవేస్తున్నాం అన్నది ప్రధానం. బ్రిటిష్ ప్రభుత్వ ప్రధాన కార్యాలయంపై ఆ దేశ పతాకాన్ని దించి, అక్కడ మన మూడు రంగుల జెండా ఎగురవేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం. ఈ సమాచారాన్ని ముందుగానే మనం కరపత్రాల ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేయాలి'' అన్నాడు.
ఆ మాటలకు అక్కడ ఒక్కసారిగా గాలి స్తంభించిపోయింది.
''కానీ ముందే తెలిస్తే... మనం ఎగురవేయగలమా'' సందేహంగా అడిగాడో యువకుడు.
''అందుకే ఇది సాహసమంటున్నా. పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తారు. డేగల్లా కాపు కాస్తారు. జెండా ఎగురవేసే క్రమంలోగానీ, ఎగురవేసింతర్వాతగానీ పోలీసుల చేతికి చిక్కితే చిత్రహింసలు, కారాగారశిక్షలే గాక ఒక్కోసారి ప్రాణాలకు గూడా అపాయం కలుగవచ్చు. కానీ మనం విజయం సాధిస్తే అది గుండె గుండెనూ తట్టి... పాటగా, కథగా, నాటకంగా, ప్రజల గుండె చప్పుడుగా మారి వారిలో ఉత్సాహాన్ని ఉరకలు వేయించి సమరగర్జన చేయిస్తుంది. దేనికైనా సిద్ధపడేలా చేయిస్తుంది. చెప్పండి. మీలో ఎవరైనా దీన్ని చేయగలరా?'' అన్నాడు.
అందరూ దీర్ఘాలోచనలో పడ్డారు. ఐదునిమిషాల తర్వాత విశ్వనాథం లేచి ''నేను సిద్ధం. జెండా ఎగురవేయడం లేదా మరణించడం... ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దేశమాత ఋణం తీర్చుకోవడం కన్నా కావలసిందేముంది'' అన్నాడు. అందరూ ఆ పదహారేళ్ళ యువకుని వంక చూశారు. మాటల్లో దృఢత్వం, ముఖంలో గాంభీర్యం తొణికిసలాడుతూ కనపడ్డాయి.
మధ్య వయస్కుడు తలూపుతూ ''మనం పొరబాటున పోలీసులకు పట్టుబడ్డా రహస్యం మాత్రం బైటపడగూడదు. కాబట్టి ఎక్కడ ఎగురవేయాలి అనేది విశ్వనాథానికి మాత్రమే చెప్తాను. అలాగే మిగతావాళ్ళందరికీ విడివిడిగా ఎవరెవరు ఏమేం పనులు చెయ్యాలో తెలియజేస్తాను. ఇది మీ మీద నమ్మకం లేక కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడం కోసం. ఏమంటారు?'' అన్నాడు చేయి ముందుకు చాస్తూ.
అందరూ అతని చేతిలో చేయి వేసి ''మీ అనుభవం, ఆచరణ... అద్భుతం. అలాగే చేద్దాం'' అన్నారు ఏక కంఠంతో. అతను ఒకొక్కరికి వారు ఏం చేయాలో తెలియజేశాక అందరూ అక్కడి నుంచి నిష్క్రమించారు.
తర్వాత రోజు ఉదయంకంతా నగరంలోని ప్రధాన కూడళ్ళలో, చుట్టుపక్కల గ్రామాల్లోని రచ్చబండల దగ్గర కరపత్రాలు ప్రత్యక్షమయ్యాయి.
--------------------------------------------
తెల్లకుక్కలకు సవాల్
------------------------------------------
''క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా రేపు జరుగబోయే ర్యాలీలో మన ఆత్మాభిమానానికి చిహ్నమైన మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా ప్రభుత్వ భవనంపై ఆంగ్ల పతాకాన్ని దించి ఎగురవేయడం జరుగుతుంది. దమ్ముంటే దాన్ని అడ్డుకోమని బ్రిటిష్ తొత్తులకు బహిరంగంగా సవాల్ చేస్తున్నాం''
ఇట్లు
కందనవోలు దేశాభిమాన సంఘం.
విషయం తెలిసిన పోలీసులు ఎక్కడికక్కడ వాటిని తొలగించారు గానీ అప్పటికే వార్త దావానలంలా వ్యాపించి పోయింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇదే ఆలోచన. ఎవరు రాశారు? ఎక్కడ ఎగురవేస్తారు? ఎంత మందున్నారు? అన్నీ ప్రశ్నలే...
పరిస్థితిని గ్రహించిన సైనిక దళాల అధికారి మొదట ర్యాలీకి అనుమతిని నిరాకరించాలనుకున్నాడు. కానీ అది పిరికిపందల చర్యగా తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకుపోతుందని భయపడ్డాడు. దాంతో వేగులని రంగంలోకి దించాడు. అనుమానమున్న చోటల్లా సైనికులు వేటకుక్కల్లా వెంటాడుతూ నఖశిఖ పర్యంతం సోదాలు చేయసాగారు. ముందు జాగ్రత్తగా కొందరిని అదుపులోకి తీసుకున్నారు. గడియారం ఆసుపత్రి, నవాబ్ బంగ్లా, కలెక్టర్ బంగ్లా, ఎర్రబురుజు, బండిమెట్ట, కొండారెడ్డి బురుజులాంటి ముఖ్యమైన ప్రదేశాలనంతా పోలీసు వలయాలతో నింపివేశారు.
అనుకున్నట్లుగానే ఆ రోజు ఉదయం రాంబొట్ల దేవాలయం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. ఏం జరుగుతుందో చూద్దామని చుట్టుపక్కల పల్లెల నుంచి గూడా జనాలు తండోపతండాలుగా వచ్చి చేరడంతో నగరమంతా జనసంద్రంగా మారిపోయింది. మూడు రంగుల జెండాను తీసుకురావడాన్ని ముందుగానే నిషేధించడంతో ప్రజలంతా వందేమాతర గీతాలతో సాగిపోతూ వున్నారు. ఒకొక్క అడుగే దాటుకుంటూ వందేమాతర గీతాన్ని ఆలపిస్తూ.... జాతీయ నాయకులను జయజయ ధ్వానాలతో పొగుడుతూ, స్వాతంత్య్రం కోసం ఎలుగెత్తి నినదిస్తూ అశేష ప్రజానీకం నగరం బైట వున్న కొండారెడ్డి బురుజు ముందున్న విశాలమైన సభాస్థలికి చేరుకున్నారు. ఏ క్షణంలో ఏ వీధిలో ఏం జరుగుతుందోనని ఉదయం నుంచీ ఊపిరి బిగబట్టి వుత్కంఠతో పహరా కాస్తున్న పోలీసులు వూపిరి పీల్చుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వమా... మజాకా... అని మీసాలు తిప్పుకున్నారు. దారంతా ఎదురు చూసిన ప్రజలు నిరాశతో, నీరసంతో, అవమానంతో క్రుంగిపోయారు. అందరి ముఖాలు విషాదంతో నిండిపోయాయి.
''పెద్ద పాలెగాల్లలెక్క కరిపిచ్చినారు కరపత్రాలు'' అన్నాడొకడు.
''ఇంత మంది పోలీసుల మధ్య ఎగరేయడమంటే మాటలా... ఎన్ని గుండెలుండాలి'' అన్నాడు మరొకడు.
''చేతగానోళ్ళు చేతగానోళ్ళ మాదిరుండాలి. అనవసరంగా మన పరువు తీసినారు'' అన్నాడు ఇంకొకడు.
అంతలో ఏదో కోలాహలం. సభా స్థలమంతా ఒక్కసారిగా అలజడి. కొందరు పైన ఆకాశంలోకి చూస్తూ గట్టిగా, ఆనందంగా ''వందేమాతరం'' అని అరుస్తూ వున్నారు. ప్రజలు, పోలీసులు, అధికారుల దృష్టంతా ఆకాశం వైపుకి మళ్ళింది. ఆకాశంలో రెండు పెద్ద పెద్ద గాలిపటాలు మూడు రంగుల్లో ఎగురుతూ, పల్టీలు కొడుతూ వున్నాయి. అంతలో దూరంగానున్న మిద్దెల మీది నుంచి కొందరు రాకెట్లకు చిన్న చిన్న జెండాలు కట్టి అంటించారు. అంతే అవి గాలిలో రయ్యిమని దూసుకుపోతూ పెద్ద పెద్ద శబ్దాలతో పేలిపోగానే.... వాటికి కట్టిన మూటలు విడిపోయి అందులోంచి చిన్న చిన్న జెండాలు ఆకాశమంతా వెదజల్లబడ్డాయి. ఎవరు చేస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థంకాక పోలీసులు ఒక్కసారిగా లాఠీలతో నాలుగువేపులా పరుగులు పెట్టారు. అంతా అల్లకల్లోలంగా వుంది. ప్రజల అరుపులు, కేకలు మిన్ను ముడుతున్నాయి. అందరూ ముందుకు దూసుకు రాసాగారు. వారిని ఆపడం చాలా కష్టంగా వుంది. బురుజుపైన కాపలా కాస్తున్న పోలీసులంతా ప్రజలను అదుపు చేయడానికి కిందికి వచ్చారు.
కొండారెడ్డి బురుజు వెనుక అంతా నిశ్శబ్దంగా వుంది. బురుజును ఆనుకొని వున్న ఒక పెద్ద చెట్టు మీద రాత్రి నుంచీ దాచిపెట్టుకుని వున్న విశ్వనాథం నెమ్మదిగా చెట్టు దిగాడు. పొదలో దాచిన పెద్ద ఉడుమును బైటకు తీసి, దాని నడుముకు గట్టిగా తాడు కట్టాడు. తేనె పూసిన కట్టెను దాని తల భాగంలో అందకుండా వుండేటట్టు తాడుతో కట్టి, దానిని కోట గోడ మీద వదిలాడు. అది తేనె వాసన పీలుస్తూ, దాన్ని అందుకోవడం కోసం ముందుకు పాకుతూ పది నిమిషాల్లో పై భాగానికి చేరుకొంది. వెంటనే తాడు పట్టుకొని గట్టిగా లాగాడు. ఉడుము ఒక్కసారిగా గోడకు అతుక్కుపోయింది. విశ్వనాథం గబగబా బ్రిటిష్ సైనికునిలా దుస్తులు వేసుకొని, నెమ్మదిగా ఎక్కడం మొదలుపెట్టాడు. పావుగంటలో పైకి చేరుకుని లోపలికి తొంగి చూశాడు. ఎవరూ లేరు. నెమ్మదిగా బురుజు లోనికి అడుగుపెట్టాడు. వడివడిగా పోసాగాడు. ఎదురుగా ఇద్దరు ముగ్గురు సైనికులు వచ్చినా ఎవరూ అనుమానించలేదు. గబగబా మూడో అంతస్తుకు చేరుకుని తలెత్తి పైకి చూశాడు. స్థూపం ఎత్తుగా, గర్వంగా, నిటారుగా వుంది. దాని మీదకు ఎక్కడానికి ఒక పొడవాటి ఇనుప నిచ్చెన వుంది. పైన బ్రిటిష్ జెండా ఎగురుతూ వుంది. దాన్ని చూడగానే విశ్వనాథం పల్లు పటపటలాడాయి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, వేగంగా నిచ్చెన ఎక్కుతూ పైకి చేరుకున్నాడు.
అంతవరకూ బొడ్లో భద్రంగా దాచిపెట్టుకున్న మూడు రంగుల జెండాను తీసి గర్వంగా ముద్దు పెట్టుకున్నాడు. జరజరజర బ్రిటిష్ జెండాను క్రిందికి దించి భారతీయుల గుండె చప్పుడుని దానికి కట్టాడు. గర్వంగా ఆ 168 అడుగుల ఎత్తు గల స్థూపంపై నిలబడి ''వందేమాతరం'' అని దిక్కులు పిక్కటిల్లేలా ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. కింద వున్న జనాల దృష్టి పైకి మళ్ళింది. పైన ఎవరో అర్థం కాలేదు. బ్రిటిష్ సైనికుని దుస్తుల్లోనే వున్నాడు. కానీ అంతవరకూ అక్కడ రెపరెపలాడుతున్న బ్రిటిష్ జెండా మాత్రం లేదు. అంతలో మరలా పై నుంచి ''వందేమాతరం, భారతమాతా జిందాబాద్'' అని గట్టిగా అరిచాడు. పోలీసులు, ప్రజలు అందరూ నిశ్చేష్టులై చూస్తుండగా ఒక్కసారిగా మూడు రంగుల జెండా పైకి పోవడం ప్రారంభించింది.
అంతే... కిందనున్న జనాల్లో ఆనందం అంబరాన్ని తాకింది. 'జయహో... భారతమాతాకీ', 'వందేమాతరం', 'మహాత్మాగాంధీకి జై' అంటూ నినాదాలు మిన్ను ముట్టాయి. జెండా పైకి చేరుకుని గాలికి గర్వంగా రెపరెపలాడసాగింది. ఆంగ్లేయ అధికారి ఆగ్రహంతో ఊగిపోయాడు. 'క్యాచ్ హిమ్' అంటూ సైనికులను పురమాయించాడు. విశ్వనాథం అక్కడి నుంచి పారిపోవడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు. బ్రిటిష్ పార్లమెంటులో బాంబులు వేసి అక్కడే చిరునవ్వులతో నిలబడ్డ వీరకిశోరం భగత్‌సింగ్‌లా ఆ స్థూపంపై నినాదాలు చేస్తూ అట్లాగే నిలబడిపోయాడు. పోలీసులు అతన్ని పట్టి బంధించి కిందకు తెచ్చారు. రక్తం కారేలా కొట్టి, రాజద్రోహనేరం కింద న్యాయస్థానంలో హాజరుపరిచారు. యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడంతో అల్లీపురం జైలులో నిర్బంధించారు. ఐదు సంవత్సరాలు కారాగారంలో పోలీసుల చేతిలో తీవ్రమైన హింసను అనుభవించాడు. కానీ అంతలోనే భారతదేశానికి స్వాతంత్య్రం లభించడంతో జైలు నుంచి విడుదలయ్యాడు.
ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని నంద్యాలలో ఉపాధ్యాయునిగా స్థిరపడ్డాడు. స్వాతంత్య్ర సమర యోధునిగా గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన ఐదు ఎకరాలను ఒక అనాథ శరణాలయానికి ఇచ్చివేశాడు. పాఠశాలలో పేద పిల్లలకు అవసరమైన సహాయాలు అందిస్తూ, వారిని బాగా చదువుకొనేలా ప్రోత్సహిస్తూ వుండేవాడు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. పిల్లలు... మనుమలు... మనమరాళ్ళు అందరూ వచ్చేశారు. పత్రికల్లో ప్రస్తుత తరం రాజకీయ నాయకులను చూస్తూ చాలా బాధపడేవాడు. అందుకే వాళ్ళ చేతుల మీద జరిగే సన్మానాలకు, సత్కారాలకు హాజరు కావడం మానేశాడు. మరలా ఇన్ని రోజులకు... మనవరాలి కోసం...
బస్సాగడంతో మనవరాలు ''తాతా.. రాజ్‌విహార్ వచ్చేసింది. ఇక్కడ దిగి ఆటోలో వెళదాం'' అంది. పాప చేయి పట్టుకొని నెమ్మదిగా దిగాడు. ఆటోలో కొండారెడ్డి బురుజు పక్కనే వున్న పోలీస్ పెరేడ్ గ్రౌండుకు చేరుకున్నాడు. ఒకప్పుడు ఊరిబైట విసిరేసినట్లుగా వున్న బురుజు నగరం విస్తరించడంతో నడిబొడ్డుగా మారింది. గ్రౌండ్లో జనాలెవరూ లేరు. నెమ్మదిగా వేదిక దగ్గరికి చేరుకున్నాడు. చేతిలోని పత్రికను చూపించగానే ఒక పోలీసు 'ప్రత్యేక ఆహ్వానితులు' అని వున్న చోట కూర్చోబెట్టాడు. కాసేపటికి తనలాగే మరో ముగ్గురు సమరయోధులు వచ్చారు. అందరూ ముసలి వాళ్ళై పోయారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. గ్రౌండులోకి పాఠశాలల నుంచి పిల్లలు, ఉపాధ్యాయులు రావడంతో అక్కడంతా కోలాహలంగా మారిపోయింది. కాసేపటికి అధికారులు, మంత్రులు విచ్చేశారు. వాళ్ళతో పాటు ఒక పెద్ద గుంపు ఖద్దరు చొక్కాలతో... పతాకావిష్కరణ తర్వాత మంత్రి శాలువాలతో స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించడానికి వచ్చాడు. విశ్వనాథానికి చూపు సరిగా ఆనడం లేదు. దగ్గరగా వచ్చి శాలువా కప్పుతున్న మంత్రిని పరీక్షగా చూశాడు. ఒక పెద్ద ఫ్యాక్షనిస్టు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి వందల కోట్ల ప్రజల సొమ్మును దోచుకున్న నిందితుడు. అనేక హత్యలతో సంబంధమున్న ఒకప్పటి రౌడీషీటర్. అతను మెడలో దండేసి, శాలువా కప్పుతుంటే ఆంగ్లేయాధికారిలా కనిపించి ఒళ్ళంతా తేళ్ళు, జర్రులు పాకినట్లనిపించింది.
సభ ప్రారంభమయ్యింది. ''ఎవరైనా స్వాతంత్య్ర సమర వీరునితో మాట్లాడిద్దామా'' అన్నాడు ఒక అధికారి. ''ఆ ముసలోళ్ళతోనా... వాళ్ళ సుత్తి భరించడం కష్టం'' అంటూ మంత్రి, స్ధానిక శాసనసభ్యులు ప్రసంగించారు. తమ ప్రసంగాలు పూర్తి కాగానే వేరే అత్యవసరమైన పనులున్నాయంటూ మధ్యలోనే వెళ్ళిపోయారు.విశ్వనాథం సభ అంతా కలియజూశాడు. అంతా పిల్లలే. బలవంతంగా తోలుకొచ్చిన బడిపిల్లలు. ప్రజలెవరూ లేరు...
సభ పూర్తి కాగానే ఎక్కడి వారక్కడ వేగంగా పనై పోయినట్టు వెళ్ళిపోతున్నారు. తమని పట్టించుకునేవాళ్ళు, పలకరించేవాళ్ళు ఎవరూ లేరు. ఆ గుంపులో వెళితే ఎక్కడ పడిపోతామో అని భయపడి అలాగే కూర్చున్నారు. కాసేపటికి సభంతా నిర్మానుష్యమైంది. కొందరు పనివాళ్ళు కుర్చీలు ఎత్తి పక్కన పెడుతున్నారు.
భారతి చుట్టూ చూసింది. పక్కన మరో ముగ్గురు స్వాతంత్య్ర సమర వీరులు. ఒంటరిగా తమలాగే...
తాత ఇటువంటి కార్యక్రమాలకు రావడానికి ఎందుకు ఇష్టపడడో భారతికి అప్పుడర్థమయ్యింది.. చేతిలో వున్న దండ, శాలువాలను అక్కడే పడేసి, తాత చేయి పట్టుకుని పైకి లేచింది. ఎదురుగా కొండారెడ్డి బురుజుపై స్థూపం... నిటారుగా... ఒంటరిగా... త్యాగాలకు గుర్తుగా... మరో పోరాటం కోసం ఎదురు చూస్తూ...
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
కథ నచ్చితే SHARE చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment