శ్రావణమాసం అంటేనే నోములు వ్రతాలు గుర్తొస్తాయి. సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో శ్రీవరలక్ష్మీ వ్రతం ప్రధానమైనది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు ‘స్కాంద పురాణం’ పేర్కొంటోంది. భక్తుల పాలిట వరాల కల్పవల్లి అయిన వరలక్ష్మి రూప, గుణ విశేషాలన్నీ శ్రీసూక్తంలో ప్రస్తావితమై ఉన్నాయి.
మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి అమ్మవారు.
శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం భారతీయ హిందువుల సాంప్రదాయ ఆచారంగా వస్తున్నది. వరలక్ష్మీ దేవత శ్రీ మహావిష్ణుమూర్తి గారి భార్య. శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం పేరుతో వచ్చే మానం శ్రావణం. చాంద్రమాన ప్రకారం తెలుగు సంవత్సరాదిలో ఐదో నెల శ్రావణం. ఈ నెలలో నోములు, వ్రతాలు, పూజలకు ప్రశస్తి. ఈ పండగ ముత్తైదువలకు ఎంతో విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని అమ్మాయిలు కూడా పూజిస్తారు. ఈ అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపద, భూమి, క్రమశిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
ఎందుకు ఈ వ్రతం చేస్తారు :- అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంటుంది. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.
పురాణ గాధ ఏమిటి :- స్కందపురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేసాడంటారు. పూర్వ కాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి వినయవిధేయురాలు. దైవభక్తి కలిగిన మహిళ. ప్రతిరోజు ప్రాతః కాలాన నిద్ర లేచి భర్త పాదాలకు నమస్కరించి గృహ కృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకుంటూ జీవిస్తూ ఉండేది. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని పెద్దల మాట.
లక్ష్మీ పూజ అంటే కేవలం ధన, కనక, వస్తు రూపాలను అర్థించడానికి కాదు... భావ దారిద్య్రాన్ని తొలగించాలని ప్రార్థించడానికి. మంచి గుణాలు, సంపద, ఉత్సాహం, కళాకాంతులు, ఆనందం, శాంతం, పెద్దల పట్ల గౌరవం, సామరస్యం, మంచి మనస్తత్వం, లోకహితాన్ని కోరుకోవడం.. ఇవన్నీ లక్ష్మీప్రదమైన లక్షణాలు. వాటిని కోరుకుంటూ లక్ష్మీ పూజ చేయాలి. మనలో అంతర్గతంగా ఉండే దైవిక శక్తులను చైతన్యపరిచేది పరాశక్తికి ప్రతిరూపమైన శ్రీమహాలక్ష్మి అంటారు పెద్దలు. ఆమె ఆరాధనే వరలక్ష్మీ వ్రతం.
కార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత... ఇవన్నీ వరలక్ష్మీ స్వరూపమైన సద్గుణాలు. ఆ గుణాలను పొందడానికి ఉద్దేశించినదే వరలక్ష్మీ వ్రతం. ఇది అన్ని వ్రతాలలోనూ శ్రేష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి. అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీ వరలక్ష్మీ వ్రతకథ చెబుతోంది.
No comments:
Post a Comment