Wednesday, August 7, 2024

సినిమాల్లో చూపిస్తున్నట్టు టైమ్ ట్రావెల్‌లో ఓసారి కాస్త వెనక్కి వెళ్తే ఎంత బాగుండు... ఎంత మంచి కాలం...

 సినిమాల్లో చూపిస్తున్నట్టు టైమ్ ట్రావెల్‌లో ఓసారి కాస్త వెనక్కి వెళ్తే ఎంత బాగుండు... ఎంత మంచి కాలం... 

బస్సుల్లేవు, ఆటోల్లేవు, లంచ్‌కు సపరేట్ బాక్సుల్లేవు... తల్లోతండ్రో దిగబెట్టడాలు, పికప్ చేయడాలు తెలియనే తెలియవు... అసలు యూనిఫారాలే తెలియవు... 

అసలు టెన్త్‌కు వచ్చేదాకా ఫీజు కట్టింది లేదు... అడిగినోళ్లే లేరు... తలుచుకుంటే నవ్వొస్తుంది... టెన్త్ వచ్చాక కదా మొదటిసారి పాయింట్ తొడిగింది.. అప్పటి దాక రెండుమూడు సేమ్ కలర్ మాషికలు, టాకాలు, వేసిన నిక్కర్లే కదా తొడిగింది ... మొదటిసారి సొంత చెప్పులు తొడిగినరోజు ఎంత ఆనందమో... 

దసరా వస్తే రెండు కొత్త అంగీలు... కుంటి సత్యం కుడితే దాదాపు అందరికీ ఒకే కొలతలు... అందరమూ ఒకే తరీఖ పోరగాళ్లం కదా... అందరికీ సూటయ్యేవి... 

అసలు పాస్ అయ్యావా..? ఫెయిల్ అయ్యావా అనే రంది లేదు... అసలు మార్కుల శాతాలు లెక్కలు తీసినవాళ్లే లేరు... ఫస్ట్ బెల్, ఒంటేలు బెల్ ( ఇంటర్వెల్), చుట్టీ బెల్... ఎక్కడ ఆడుతున్నమో, ఎటు తిరుగుతున్నమో అడిగినోళ్లే ఉండరు... ఆకలైతే ఇంటికి భద్రంగా వస్తమని తెలుసు కదా అమ్మకు... 

ట్యూషన్ వెళ్తే అదో అవమానం అప్పట్లో... నెమలీకల్ని పుస్తకాల నడుమ పెట్టుకుని రోజూ చూసుకోవాలి, కొద్దిగా పెరిగినట్టే ఉందిరోయ్ అని అందరికీ చూపించుకుని సంబరపడిపోవడం... 

లొట్టపీసు కట్టెలు, ఆనపకాయ బుర్రలు... కాదంటే దోస్తులే వెనుక నుంచి బావిలోకి నూకి మరీ ఈత నేర్పించారు... మునుగుతూ, తేలుతూ, నీళ్లు మింగుతుంటే వాళ్లే జుత్తు పట్టుకుని లాక్కొచ్చేవాళ్లు... ఒక్కసారి నీళ్లంటే భయం పోయాక ఈత ఎంత సుఖం..? 

సైకిల్ కూడా అంతే... కాంచీట్... బొంగు... సీటు... తరువాత ముగ్గురం చొప్పున ఎక్కాలె... గంటకు 1 రూపాయి చొప్పున ఇచ్చి ఆవుల సత్యనారాయణ దగ్గర కిరాయి సైకల్ తీసుకొని తొక్కిన రోజులు...

కొత్త ఏడాది వచ్చిందంటే... ఆటోమేటిక్ క్లాస్ జంప్... అదే లిస్టు... ఎవరైనా వాళ్ల పాత పుస్తకాల సెట్టు ఇస్తానంటే, అమ్మను అడిగి అయిదారు రూపాయలు ఇచ్చేది... మన సెట్టు అమ్మితే కొంత డబ్బు ఎలాగూ వస్తదిగా... 

కొత్త అట్టపుట్టలు వేసుకోవడం ఒక్క రోజు కష్టం... పేర్లు రాసుకునే స్టిక్కర్లు కొనుక్కోవాలె... సరిగ్గా అతికేవి కాదు, తుమ్మబంక పూయాల్సిందే... బట్ట బ్యాగు ఓసారి ఉతుక్కున్నమంటే రెండుమూడు నెలలు బేఫికర్... 

హెడ్ మాస్టర్ ఆనందం సర్,
PT  సర్  క్లాసులోకి వస్తున్నడంటే కారిపోయేది... క్లాస్ టీచర్ రోజుకోసారి కొట్టినా పెద్ద ఫరక్ అనిపించేది కాదు... చెవులు మెలితిప్పి, గోడకుర్చీ వేయించకపోతే లెక్కలు ఓ పట్టాన ఎక్కేవి కాదు... 

అసలు ఖర్చేముందని..? పాకెట్ మనీ అనే పేరైనా వింటే కదా... దీపావళికి అయ్య తెచ్చిన పటాకుల్లో పొట్లం జాగ్రత్తగా విప్పి, ఒక్కో తాటాకు బాంబ్ ఆగీ ఆగీ కాల్చినోళ్లమే కదా అందరమూ... 

బడి బయట పల్లీలు, గొట్టాలు, కారా పొట్లాలు అమ్మే ముసలామె ఎటుపోయింది..? మధ్యాహ్నం ఐదు పైసలకు సాదా ఐస్‌  పదిహేను పైసలకు సేమ్యా ఐస్ అమ్మిన బీక్య ఏమైపోయాడు..? 

జ్వరమొచ్చినా రామలింగయ్య గారి దగ్గర సూది వేపించిన సంబురమే ఎందుకంటే అమ్మ గిలాస నిండా చాయ్ పోసి, డబల్ రొట్టె కొనిచ్చేది... ఉన్నయ్, ఏడ్చిన దినాలూ ఉన్నయ్... 

ఒక్కసారి టైమ్ ట్రావెల్ చేయగలిగితే బాగుండు...

(ఇది ఫేస్‌బుక్‌లో కనిపించిన ఓ హిందీ పోస్టుకు తెలుగీకరణ, స్థానికీకరణ... ఇంకా మన జ్ఞాపకాలు కూడా కలిపి రాస్తే ఒడవదు, తెగదు...)

No comments:

Post a Comment