Friday, August 9, 2024

 నిజాల వేట - సాక్షి పత్రికలో వచ్చిన బాలల కథ డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూల్
**************************
       మహారాజు సింహాసనం అధిష్టించి పది సంవత్సరాలు పూర్తి అయింది. దాంతో తన పరిపాలన ఎలా వుందో తెలుసుకోవాలనుకున్నాడు. అంగరంగ వైభవంగా సమావేశం ఏర్పాటు చేశాడు. సామంతులు, సైన్యాధికారులు, వ్యాపారస్తులు, కళాకారులు, పుర ప్రముఖులు అందరినీ ఆహ్వానించాడు. మహారాజు వచ్చిన వాళ్లందరినీ చిరునవ్వుతో చూస్తూ "నా పాలనలో రాజ్యమంతా సుభిక్షంగా ఎలా వుందో తెలుసుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేశాను. బాగుంటే బాగుందనండి. లేదంటే లేదనండి. సరిదిద్దుకోవల్సిన అంశాలు వుంటే తెలియచేయండి. రాజ్యం మరింత సుసంపన్నం కావడానికి సలహాలు ఇవ్వండి" అన్నాడు.
    ఒక పది నిమిషాలు అక్కడ మౌనం తాండవించింది. "మహారాజా... మీరు మాకు దేవుడిచ్చిన వరం. ఎన్ని జన్మలైనా మీరే మాకు రాజుగా ఉండాలి. అదే మా అందరి కోరిక" అంటూ నోరిప్పారు సామంతులు.
    "మీ పాలనలో ఎటువంటి తిరుగుబాట్లు లేవు. రాజ్యమంతా ప్రశాంతంగా సుఖసంతోషాలతో నిండి వుంది. ప్రజలు ఆరుబయట మంచాలు వేసుకొని, తలుపులకు తాళాలు కూడా వేసుకోకుండా పడుకుంటున్నారు" అన్నారు సైన్యాధికారులు.
    "వ్యాపారాలు పుష్కలంగా జరుగుతున్నాయి. గల్లాపెట్టెలు గలగలలాడుతున్నాయి. నగరంలో దొరకని వస్తువంటూ ఏదీ లేదు. ఎగుమతులు కూడా రోజురోజుకీ పుంజుకుంటున్నాయి" అన్నారు వ్యాపారస్తులు.
    "రాజ్యంలో ఎక్కడ చూసినా సభలు, సమావేశాలు, నాటక ప్రదర్శనలు, కవితా పఠనాలు, కొత్త గ్రంథాల ఆవిష్కరణలు, పురస్కారాలు, సన్మానాలతో ఆ శ్రీకృష్ణదేవరాయలే మళ్లీ జన్మించాడా అన్నట్టుంది ప్రభూ మాకు" పొగిడారు కళాకారులు.
    ఒక్కొక్క మాటకు రాజు ఛాతి ఒక్కొక్క అంగుళం సంతోషంతో పెరిగిపోసాగింది. మొహంలో కోటి నక్షత్రాల కాంతులు వెదజల్లసాగాయి. వచ్చిన వారందరికీ దేశదేశాల నుండి తీసుకొని వచ్చిన, రకరకాల ఆహార పదార్థాలతో విందు భోజనం ఏర్పాటు చేసి కానుకలతో సత్కరించి పంపించాడు.
    రాత్రి అంతఃపురంలో తూగుటుయ్యాల మీద ఊగుతూ మహారాణితో "చూశావా రాణీ... నా పరిపాలనలో రాజ్యం ఎలా సుభిక్షంగా కళకళలాడిపోతున్నదో. ఎక్కడా ఆకలికేకలు లేవు. తిరుగుబాట్లు లేవు. అందరూ నన్నే మరలా మరలా రాజు కావాలంటూ నింగిని తాకేలా కీర్తిస్తున్నారు" అన్నాడు సంబరంగా.
    రాణి చిరునవ్వుతో "అలాకాక ఇంకెలా చెబుతారులే మహారాజా మీ వద్ద. రాజంటే ఆ మాత్రం భయం ఉండాలి కదా" అంది తాంబూలం అందిస్తూ.
    ఆ మాటల్లో ఏదో వ్యంగ్యం కనబడింది రాజుకు.
    "అంటే... ఆ పొగడ్తలన్నీ కేవలం భయం వల్ల వచ్చినవి అంటావా" ప్రశ్నించాడు నవ్వు ఆపి.
    "భయం వల్లనే కాకపోవచ్చు. మీతో వారికున్న అవసరాల వల్ల కూడా కావచ్చు" అంది రాణి.
    "విషయం సూటిగా చెప్పు" ఊగుతున్న ఊయలను ఆపి అడిగాడు మహారాజు.
    "రాజా... మీ ముందు నిలబడి మీకు వ్యతిరేకంగా మీ కింద పనిచేసే అధికారులు ఎవరైనా నోరు విప్పగలరా. మనసులో మాట చెప్పగలరా. మీరు మంచి పనులు చేసినా, పిచ్చి పనులు చేసినా ఆహా... ఓహో... అని ఆకాశానికి ఎత్తేసేటోళ్ళే తప్ప విమర్శించేటోళ్లు ఎవరు" అంది.
    "అయితే వాళ్ళందరూ అలా అబద్ధాలు ఆడుతూ నన్ను వూరికే పొగుడుతున్నారని నిరూపించగలవా" అన్నాడు రాజు.
    "తప్పకుండా మహారాజా... మీకు అసలు రాని కళ ఏదైనా వుంటే చెప్పండి" అంది.  మహారాజు కాసేపు ఆలోచించి "నీకు తెలియనిదేముంది రాణీ... సంగీతమంటే నాకు ప్రాణం. మిగతా లలిత కళల్లో కూడా ఎంతో కొంత ప్రావీణ్యం వుంది. కాకపోతే అసలు రానిది, ఎప్పుడూ ముట్టుకోనిదీ చిత్రలేఖనం ఒక్కటే" అన్నాడు.
    "అయితే ఒక పని చేయండి మహారాజా. ఒక్కరోజులో చిత్రలేఖనం గురించి తెలుసుకొని మీకు ఎలా తోస్తే అలా రకరకాలుగా చిత్రాలు చిత్రించండి. అవన్నీ ప్రదర్శనకు పెడదాం. ఇప్పుడు పిలిచిన వాళ్లందరినీ అప్పుడు కూడా ఆహ్వానిద్దాం. తెలుస్తుంది ఎవరు ఏమంటారో" అంది.
    మహారాజు సరే అని ఒక ప్రముఖ చిత్రకారున్ని పిలిపించి ఒక రోజంతా చిత్రకళ గురించి తెలుసుకున్నాడు. తర్వాత రోజు నుంచి బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. కుడి చేత్తో కొన్ని, ఎడం చేత్తో కొన్ని, నోటితో పట్టుకొని కొన్ని, వెనక్కి తిరిగి కొన్ని, ఆఖరికి పడుకొని, కూర్చుని, నుంచుని రకరకాలుగా వారం రోజుల్లో వంద చిత్రాలు పూర్తి చేశాడు. వాటన్నింటినీ ప్రదర్శనకు పెట్టాడు. అందులో కొన్ని చిత్రాలను తిరగేసి కూడా పెట్టాడు. సామంతులను, అధికారులను, పుర ప్రముఖులను, వ్యాపారవేత్తలను, కళాకారులను అందరినీ తన చిత్రకళ ప్రదర్శనకు ఆహ్వానించాడు.
    ప్రదర్శనా ప్రాంగణమంతా నగర ప్రముఖులతో నిండిపోయింది. ఏ చిత్రం చూసినా రంగులు ఒకదానితో ఒకటి కలసిపోయి కనిపించాయి. దేనిలో ఏముందో, అందులో భావమేమో ఎంత ఆలోచించినా ఎవరికీ అంతుచిక్క లేదు. అర్థం కానిదంతా అద్భుతమే అని తీర్మానించుకున్నారు. అవతల ఉన్నది మహారాజు. తప్పు పట్టినా, బాగా లేదన్నా కొరడా దెబ్బలు శరీరం మీద భరతనాట్యం చేస్తాయి. దాంతో ఎందుకైనా మంచిదని 'ఆహా' అన్నారు కొందరు. వెంటనే 'ఓహో' అన్నారు మరికొందరు. 'అద్భుతం. మీకు మీరే సాటి' అంటూ అందుకొన్నారు ఇంకొందరు.
    ఇలా పొడి పొడి మాటలైతే లాభం లేదనుకొని ఇంకొకరు ముందడుగు వేసి "మహారాజా... ఇంత వేగంగా ఇన్ని చిత్రాలు గీయడం మామూలు మానవులకు సాధ్యం కాదు. మీలాంటి కారణజన్ములు ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఎక్కడా ఉండరు. మీకు చిత్రరత్న పురస్కారం ఖచ్చితంగా ఇచ్చి తీరవలసిందే" అన్నాడు.
    అది విన్న మరికొందరు తాము ఎక్కడ వెనుకబడి పోతామో అనుకుంటూ "మహారాజా... ఈ చిత్రాలు మీరు గనుక మాకు ఇస్తే మా భవనాలలో అందరికీ కనపడేలా అలంకరించుకుంటాం. వీటివల్ల మా ఇంటి అందం రెట్టింపు అవుతుంది" అన్నారు. ఒకరిని చూసి మరొకరు పొగడ్తలలో పోటీపడ్డారు. వాళ్ళలా పొగడ్తల వర్షం కురిపిస్తా వుంటే మహారాజు తన పక్కనే ఉన్న మహారాణికి మొహం చూపించలేక సిగ్గుతో చితికిపోయాడు.
    ప్రదర్శన పూర్తయి అందరూ వెళ్ళిపోయాక "అర్థమైంది కదా రాజా ప్రముఖుల సంగతి. మీ పాలన గురించి నిజానిజాలు తెలియాలంటే ధనవంతులను కాదు కలవాల్సింది పేద ప్రజలను. అధికార దర్పంతో రాజుగా కాదు వాళ్లలో ఒకరిగా మారిపోవాలి. అప్పుడే మీ లోటుపాట్లు తెలుస్తాయి. సరిదిద్దుకోవలసినవి అర్థమవుతాయి" అంది. మహారాజు చిరునవ్వు నవ్వి మహారాణి నుదుటిపై చిరుముద్దు పెట్టాడు. తర్వాతరోజే సాధారణ పల్లెమనిషిగా మారువేషం వేసుకొని కాలినడకన నగర సంచారానికి బయలుదేరాడు. నిజాల వేటకై.
**************************
డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూల్
**************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

No comments:

Post a Comment