పుస్తకం విలువ తెలియజేసే కథ *జ్ఞాన గ్రంథాలయం* - డా.ఎం.హరికిషన్- కర్నూల్-9441032212.
****************************
*ఒక రాజుకు పుస్తకాలు సేకరించే అలవాటు వుంది* . తనకు నచ్చిన పుస్తకాలను దేశంలో ఎక్కడున్నా సరే, ఎంత డబ్బయినా ఇచ్చి తెప్పించి తన గదిలో భద్రపరచుకునేవాడు. రాజ్యంలో వున్న విలువయిన పుస్తకాలన్నీ రాజు ఇంటికే చేరుకునేవి.
ఆ వూరిలో ఒక పండితుడు వుండేవాడు. తరతరాలుగా వాళ్ళ వంశమంతా దేశదేశాలు తిరుగుతూ, ఎక్కడ మంచి పుస్తకం కనబడినా వెంటనే కొని వూరికి తీసుకువచ్చేవారు. వేరే భాషలలో వున్న అమూల్యమైన గ్రంథాలను తెలుగులోకి అనువదించి భద్రపరిచేవారు. చుట్టుపక్కల వున్న రాజ్యాలనుంచి అనేకమంది పండితులు, పరిశోధకులు ఆ పుస్తకాలను చదవడానికి వాళ్ళ ఇంటికి వచ్చేవారు. ఎన్నో కొత్త విషయాలను చదివేవారు, చర్చించేవారు. ఆ ఇళ్ళంతా నిత్యం పండితుల వాదోపవాదాలతో, పరిష్కారాలతో కళకళలాడుతూ వుండేది.
రాజుకి ఆ పండితుని గురించి తెలిసింది. వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పుస్తకాలు చూసి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు కనీవినీ ఎరుగని, లోకంలో ఎక్కడా దొరకని, అరుదైన అపూర్వమైన గ్రంథాలు అక్కడ వున్నాయి. తన గ్రంథాలయం అందులో పదోవంతుగూడా లేదు. రాజుకు చాలా అసూయ కలిగింది. వెంటనే పండితున్ని పిలిచి చెప్పు.... నీకు మణులు కావాలా, మాణిక్యాలు కావాలా... మోయలేనంత బంగారం కావాలా, కొలువలేనంత భూమి కావాలా.... నీకేం కావాలంటే అది కోరుకో ఇస్తాను. కానీ నీ గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ వెంటనే మా ఇంటికి పంపించేయ్'' అన్నాడు.
పండితుడు చిరునవ్వి నవ్వి ''రాజా.... ఇవి తరతరాలుగా మా పూర్వీకులనుంచి వస్తున్న ఆస్థి... ఎన్ని సంపదలిచ్చినా సరే... నేను వీటిని ఎవరికీ అమ్మను'' అన్నాడు.
ఆ మాటలతో రాజుకు చాలా కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. ''ఈ వూరికి రాజునైన నా మాటకే ఎదురు చెబుతున్నావా. ఎంత ధైర్యం నీకు సరిగ్గా వారం రోజులు సమయం ఇస్తున్నా. అంతలోపు పుస్తకాలన్నీ మూట గట్టి నా అంతఃపురానికి పంపించు. లేదంటే తరువాత రోజు నీవు సూర్యోదయాన్ని చూడలేవు. అదే నీకు ఈ భూమ్మీద ఆఖరి రోజవుతుంది జాగ్రత్త'' అంటూ హెచ్చరించి సరసరసర అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
పండితుడు మారు మాట్లాడకుండా మౌనంగా వుండిపోయాడు.
చుట్టు పక్కల వాళ్ళంతా ఆ పండితునితో ''చూడు... మన రాజు పెద్ద మూర్ఖుడు. స్వార్థపరుడు. అహంకారి. తాను చెప్పిందే పది మంది చెయ్యాలనుకుంటాడు గానీ ఎదుటి వాళ్ళ అభిప్రాయానికి అణుమాత్రం గూడా విలువ నివ్వడు. రాజుతో ఎందుకు గొడవ. పుస్తకాలన్నీ ఇచ్చెయ్యి. ప్రాణాలు నిలబెట్టుకో'' అని పదే పదే చెప్పారు.
పండితుడు అలాగేనంటూ ఇంటిలోని గ్రంథాలన్నీ తీసి మూటలు కట్టసాగాడు. అవన్నీ కలిపితే అరవై బండ్లయినాయి.
రాజు ఆ అమూల్యమైన గ్రంథాలు ఈ రోజొస్తాయి, రేపొస్తాయి అని ఎదురు చూడసాగాడు. అట్లా వారం రోజులు గడిచిపోయింది గానీ, ఒక్క పుస్తకమూ చేతికందలేదు. దాంతో కోపంతో సలసలసల మండిపోతూ భటులను పిలిచి ''పోండి... పోయి ఆ పండితున్ని బంధించి, వాళ్ళ ఇంటిలోని పుస్తకాలన్నీ ఒక్కటి గూడా మిగలకుండా తీసుకొని రాపోండి'' అంటూ పంపించాడు.
భటులు వచ్చి చూసే సరికి ఇంగేముంది.... ఇంటిలో ఒక పుస్తకం కాదు గదా కనీసం ఒక కాగితం గూడా లేదు. బీరువాలన్నీ ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. పండితుడు మాత్రం చిరునవ్వుతో తూగుటుయ్యాల మీద వూగుతూ కనబడ్డాడు.
భటులు ఆ పండితున్ని బంధించి రాజు వద్దకు తీసుకోనొచ్చి విషయమంతా వివరించి చెప్పారు.
రాజు కోపంతో వూగి పోయాడు. సలసలసల మండిపోయాడు. ''ఎంత ధైర్యం నీకు. నా మాటనే ధిక్కరిస్తావా? నీకిప్పుడే మరణశిక్ష విధిస్తున్నాను'' అన్నాడు కోపంగా బుసలు కొడుతూ.
పండితుడు చిరునవ్వు నవ్వి ''మహారాజా! మనుషులు మరణించినా పరవాలేదు గానీ జ్ఞానం మరణించగూడదు. మీకు పుస్తకాలు ఇస్తే ఆ విలువైన సమాచారమంతా మీ స్వంత గ్రంథాలయానికి చేరుతుంది. దానివల్ల ఎవరికీ ఎటువంటి ప్రయోజనమూ లేదు. అందుకే వాటిని చుట్టుపక్కల రాజ్యాలలో వున్న ప్రసిద్ధి చెందిన గ్రంథాలయాలకు వుచితంగా పంపించాను. వాటి ద్వారా పదిమందికి కొత్త విషయాలు తెలుస్తాయి. పరిశోధనలు జరుగుతాయి. సమాజానికి మంచి జరుగుతుంది'' అన్నాడు.
ఆ మాటలకు రాజు ఆలోచనలో పడ్డాడు. ''నిజమే... ఏ ఒక్కరివద్దనో, సమూహం వద్దనో నిలువ వుండే జ్ఞానం వల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగమూ వుండదు. జ్ఞానం ఎంత త్వరగా ఎక్కువ మందికి వ్యాప్తి చెందుతే అంత త్వరగా ఆ రాజ్యం, ప్రజలు చైతన్యం పొంది బాగుపడతారు'' అనుకున్నాడు.
వెంటనే రాజ్యంలో ఒక పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి తాను సేకరించిన గ్రంథాలన్నీ అందులో వుంచాడు. రాజ్యంలోని ప్రజలందరికీ అందులో చదువుకోవడానికి అవకాశం కల్పించాడు. పుస్తకాల విలువ తెలియజెప్పిన ఆ పండితున్నే ఆ గ్రంథాలయానికి అధికారిగా నియమించాడు.
****************************
డా.ఎం.హరికిషన్, కర్నూల్,9441032212.
****************************
కథ నచ్చితే SHARE చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment