Tuesday, August 6, 2024

శ్రీ కృష్ణుడిని ఆంజ‌నేయ స్వామి ఎన్ని సార్లు క‌లిశాడు.

 శ్రీ కృష్ణుడిని ఆంజ‌నేయ స్వామి ఎన్ని సార్లు క‌లిశాడు.

మహాభారతం మొత్తం మీద ఎక్కడ కూడా హనుమ, శ్రీకృష్ణుడు ఇద్దరు నేరుగా కలిసిన సందర్బాలు లేవు. భాగవతాది పురాణాలలో కూడా ఎక్కడా లేవు.

శ్రీకృష్ణాంజనేయ యుద్ధం సినిమాలో చూపించినట్టు, గరుత్మంతుని గర్వం తగ్గించటానికి శ్రీకృష్ణుడు గంధమాదన పర్వతం మీదనున్న హనుమను తీసుకురమ్మని పంపగా, గరుత్మంతుడు హనుమ చేతిలో భంగపడ్డారని, ద్వారకకు వచ్చిన తర్వాత హనుమకు శ్రీకృష్ణుడు, రుక్మిణి సీతారాములుగా దర్శనమిచ్చారన్న కథ, మైత్రేయ-పరాశర సంవాద రూపముగానున్న శ్రీ పరాశర సంహితా (శ్రీ హనుమచ్చరితము) అనే గ్రంథంలో 48 వ అధ్యాయంలో ప్రస్తావించబడింది.[1] శ్రీకృష్ణుడు హనుమ కలిసిన సందర్భం ఇదొక్కటే కనపడుతుంది.

అర్జునుడు అమ్ములతో సేతువు నిర్మిస్తే అది హనుమ కూల్చటం, తర్వాత మళ్ళీ నిర్మించిన సేతువు కృష్ణుడు కాపు కాసి కూలకుండా చేస్తాడు. తదుపరి హనుమకు రాముడిగా శ్రీకృష్ణుడు దర్శనమిచ్చాడని, అప్పుడు అర్జునుడి రథ పతాకం పై తానుంటానని హనుమ మాటిచ్చినట్టు చెప్పే కథ కల్పితమే. దానికి ఏ గ్రంథములలోనూ ఆధారం కనపడదు. ఒకవేళ ఈ కథ నిజమైతే, ద్వారకకు వెళ్ళిన కథలో హనుమకు శ్రీకృష్ణుడు తెలియకపోవటం జరిగుండకూడదు.

వ్యాసభారతంలో భీముడికి హనుమకి జరిగిన సంభాషణ చదివితే, జరగబోయే ఘటనలలో దైవసంకల్పం, తన ప్రమేయం, శ్రీకృష్ణుని కలవకపోయినా అతని దివ్యత్వం అప్పటికి హనుమకు విదితమేనని మనకు అర్థమవుతుంది……

No comments:

Post a Comment