రామాయణమ్. 43
.
మంధరా ! రాముని పట్టాభిషేకము తప్పించే ఉపాయం ఆలోచించవే ! వాడిని ఎలాగైనా సరే అడవులకు పంపాలి ! అడిగింది కైక .
.
పూర్వము నీవే నాకు ఒక విషయము చెప్పావు గుర్తులేదా! అయితే చెపుతా విను ! మహారాజు శంబరాసురునితో యుద్ధానికి వెళ్ళి నప్పుడు నీవు కూడా ఆయన వెంట వెళ్ళావు !
ఆ యుద్ధంలో ఒకసారి గాయాలబారిన పడి స్పృహకోల్పోయిన దశరధుడిని రాక్షసులబారినుండి నేర్పుగా నీవు తప్పించావు !. అందుకు రాజు సంతోషించి నీకు రెండువరాలిచ్చాడు ! నీవు అవసరమయినప్పుడు ఆ వరాలు కోరుకుంటానన్నావు అందుకు రాజు సరే నన్నాడు ! గుర్తుకు వచ్చిందా ! .
.
ఇదే సరయిన సమయం ఆ రెండు వరాలు ఇప్పుడు కోరుకో !
నీ కొడుకు భరతుడికి రాజ్యపట్టాభిషేకము ,రామునికి పదునాలుగేండ్లు అరణ్యవాసము .
.
పదునాలుగేండ్లు భరతుడు పరిపాలించెనా ! జనం మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతాడు ,రాజ్యాధికారం స్థిరమవుతుంది ! అని చెప్పి, నీవు నిరాలంకారవై ,మలినవస్త్రాలు ధరించు ! నీ మగడు వచ్చే వేళ అయింది ! ఆయనతో మాటాడకు మొదట బెట్టు చేయి!.అని నూరిపోసింది మంధర!.
.
ఇలా పలికిన మంధర కైక కంటికి మనోహరంగా కనపడ్డది ! రాజహంసలాగ ఉన్నావే నీవు అంటూ ప్రశంసించింది.
నీ గూని కూడా ఎంత అందంగా ఉన్నదే ! దానికి బంగరుమాల తొడిగి అలంకరిస్తాను భరతుడు రాజు కాగానే !
.
ఈ మాటలు,వరాలమూటలు తరువాత , ముందు కాగల కార్యం చూడమ్మా కైకమ్మా ! రాజు వచ్చే వేళ అయ్యింది అని హెచ్చరించింది దాసి మంధర!.
.
వంటికున్న అన్ని ఆభరణాలు తొలగించి ,మాసిన చీర ధరించి మంధరతో కలసి కోపగృహప్రవేశం చేసింది కైక!.
.
కైకను చూడకుండా దశరధుడుండలేడు ,కౌసల్యా మందిరానికి ఎప్పుడోగాని పోడు!
.
ఆమె ఆయనకు కామసంజీవనౌషధి,ఆమె పెడమొగమయితే ఆయనకు నరకమే ! రాముని పట్టాభిషేక వార్త ఆవిడకింకా చెప్పలేదు ! తనకు చెప్పనందుకు ఎంతకోపంతో ఉన్నదో ఏమో ! వెంటనే చెప్పి ఆవిడను ప్రసన్నురాలిని చేసుకోవాలి,
.
కసిరికొడితే బుజ్జగించాలి , కోపగిస్తే లాలించాలి ఏ విధంగానైనా ఆవిడను ప్రసన్నురాలిని చేసుకోవాలి అని ఆలోచిస్తూ కైక మందిరంలో అడుగుపెట్టాడు దశరధుడు.
.
జానకిరామారావు వూటుకూరు
No comments:
Post a Comment