Wednesday, September 4, 2024

గురువుకు పాదాభివందనం*

 *గురువుకు పాదాభివందనం*రేపటి రోజు
గురుపూజోత్సవ సందర్భంగా
గురుర్బహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః

ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి.. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు.. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే.. గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ అన్నారు.

మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడిని సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. ‘మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని’ అన్నారు గాంధీజీ. ‘మీరు నా ఉపాధ్యాయుడు’ అని కీర్తించారు పండిట్‌ నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో..!

యుగపురుషుడు.. జ్ఞాన మహర్షి.. మన సర్వేపల్లి
యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే.. యుగపురుషుడే వచ్చి ఉపన్యసించారు అని కొనియాడారు హోవెల్‌. నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి అని కీర్తించారు సోవియట్‌ అధినేత స్టాలిన్‌. అలాంటి గీతాచార్యుడు, ప్రబోధకుడు, యుగపురుషుడు, జ్ఞాన మహర్షి.. మన సర్వేపల్లి రాధాకృష్ణన్‌. గురువులకే గురువు ఆయన. అందుకే ఆయన పుట్టిన రోజు ‘ఉపాధ్యాయ దినోత్సవం’ అయ్యింది.

తరతరాలుగా, యుగయుగాలుగా సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు, ధీశాలి సర్వేపల్లి. హృదయాన్ని, మేధను సమపాళ్లలో పండించిన ప్రజ్ఞాశాలి ఆయన. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహా రచయిత రాధాకృష్ణన్‌. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయచరిత్రలో స్పష్టంగా వివరించారు. బోధ గురువులు, బాధ గురువుల లక్షణాలను ప్రస్తావించారు.

గురువు గొప్పదనం
ఇది గురువు గొప్పదనం..!
మహాభారతం అరణ్య పర్వంలోని యక్షప్రశ్నల ఇతివృత్తంలోని అంశం.. యక్షుడు ‘మనిషి మనీషి ఎలా అవుతాడు?’ అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. అప్పుడు ధర్మరాజు ‘అధ్యయనం వల్ల, గురువు ద్వారా’ అని బదులిస్తాడు. గురువుకు ఉన్న శక్తి అంతటి గొప్పది. అధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవతా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ‘స్వస్తినో బృహస్పతిర్దదాతు’ అని గురువును స్మరిస్తాడు.

చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తమౌర్యుడు. సమర్థ రామదాసు తయారుచేసిన వీరఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లు ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది.

సనాతన ధర్మాన్ని పరంపరాగతంగా పరిరక్షిస్తున్న ఆ గురుదేవులను స్మరించుకుంటూ.. నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా.. రాబోవు తరం దూతలుగా తీర్చిదిద్దడానికి ఘనమైన అడుగులు వేయాలని కోరుకుంటూ.. గురువులందరికీ వందనం.. అభివందనం.  🌹🙏

No comments:

Post a Comment