అనేక జబ్బులకు ‘పేగుల్లోని సూక్ష్మక్రిములే (మైక్రోబయోమ్) ' కారణం
-దీర్ఘకాలం నాణ్యమైన జీవితంలో.. పేగు బ్యాక్టీరియా పాత్ర పై
ప్రఖ్యాత జీర్ణకోశ నిపుణులు డాక్టర్ నాగేశ్వరరెడ్డి
ఆరోగ్యకర అలవాట్లు,జీవనశైలిలో మార్పులు అవసరం
ఆహారానికి ముందు స్వీట్ అస్సలు తినొద్దు
ఇంటి తిండికి, జంక్‌ఫుడ్‌కు బ్యాక్టీరియా వృద్ధిలో తేడా
అనేక జబ్బులకు పేగు సూక్ష్మక్రిములే కారణం
నాలుగు గంటల గాఢ నిద్ర తప్పనిసరి
దీర్ఘకాలం నాణ్యమైన జీవితంలో..
పేగు బ్యాక్టీరియా పాత్ర’పై ‘ఈనాడు’తో ముఖాముఖిలో ఏఐజీ ఛైర్మన్, ప్రఖ్యాత జీర్ణకోశ నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి పలు అంశాలు వెల్లడించారు.
‘‘జంతువులు, పక్షుల్లో ఒక్కోదానికి జీవితకాలం ‘ఇంత’ అని ఉంటుంది.
అలాగే మనుషుల జీవితకాలం 120 ఏళ్లు.
అయితే చాలా తక్కువమంది అప్పటివరకు జీవిస్తుంటారు.
ఒకవేళ దీర్ఘకాలం బతికినా..
80 ఏళ్లు దాటిన తర్వాత ఎక్కువమంది నాణ్యమైన జీవితం గడపలేకపోతున్నారు.
పుట్టుకతోనే మంచి బ్యాక్టీరియా
అనేక జబ్బులకు ‘పేగుల్లోని సూక్ష్మక్రిములే (మైక్రోబయోమ్)’ మూలకారణమని పరిశోధనల్లో నిర్ధారించారు.
ఇందులో మంచి, చెడు బ్యాక్టీరియాలుంటాయి.
మనం ఆరోగ్యకర అలవాట్లు పాటిస్తే ‘మంచి బ్యాక్టీరియా’ వృద్ధి చెందుతుంది.
చెడు అలవాట్లను అలవర్చుకుంటే ‘హానికారక బ్యాక్టీరియా’ విజృంభిస్తుంది.
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలా? జబ్బులతో శల్యమవ్వాలా? అన్నది నిర్ణయించేది ఈ బ్యాక్టీరియాలే!
మనిషి శరీరంలో 20 వేల జన్యువులుండగా.. పేగు బ్యాక్టీరియాలో 20 మిలియన్ల జన్యువులుంటాయి.
ఈ బ్యాక్టీరియా మనకు పుట్టుకతోనే వస్తుంది.
సహజ ప్రసవం అయినప్పుడు తల్లి నుంచి బిడ్డకు..
ఆరు నెలలు తల్లి చనుపాలు ఇవ్వడం ద్వారా..
పుట్టిన ఆరు నెలల వరకూ శిశువుకు యాంటీబయాటిక్స్ మందులు వాడకపోతే
మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
సిజేరియన్ వల్ల శిశువు పుట్టినా..
తల్లి పాలు పట్టకపోయినా..
తొలి ఆరు నెలల్లోనే యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వచ్చినా..
మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందదు.
హాంకాంగ్‌లో సిజేరియన్ ద్వారా పుట్టిన శిశువుకు తల్లి నుంచి పేగు బ్యాక్టీరియాను మార్పిడి చేస్తున్నారు.
మన దగ్గర ఇది ఇంకా అమల్లోకి రాలేదు.
తల్లి గర్భంతో ఉన్నప్పుడు
ఇంటి పెరుగు, చీజ్, కిమ్చి, ఆపిల్, టమాట, అరటిపండు, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి
వంటివి తినడం వల్ల మంచి బ్యాక్టీరియా పెరిగి.. శిశువుకు కూడా సంక్రమిస్తుంది.
బ్యాక్టీరియా ఎలా నియంత్రిస్తుందంటే?
శరీర నియంత్రణలో కీలక పాత్ర పోషించేది బ్యాక్టీరియానే.
మనం తిన్న ఆహారాన్ని ముందుగా జీర్ణం చేసి, శరీరానికి అందిస్తుంది.
మంచి బ్యాక్టీరియా ఉంటే నెమ్మదిగా జీర్ణం చేస్తుంది.
చెడు బ్యాక్టీరియా ఉంటే వేగంగా జీర్ణం చేస్తుంది.
తద్వారా వెంటనే షుగర్ స్థాయుల్లో హెచ్చుదల కనిపిస్తుంది.
ఉదాహరణకు
చికెన్ తింటే జీర్ణాశయంలో ముందుగా బ్యాక్టీరియా అటాక్ చేస్తుంది.
మంచి బ్యాక్టీరియా ఉంటే.. ‘సెరోటోనిన్’ను ఉత్పత్తి చేస్తుంది.
జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది.
ఎక్కువ తిన్నా బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.
సెరోటోనిన్ వల్ల శరీరంలో చురుకుదనం పెరుగుతుంది.
చెడు బ్యాక్టీరియా ఉంటే..
‘మెలటోనిన్’ వంటి వాటిని ఉత్పత్తి చేస్తుంది.
దీనివల్ల తక్కువ తిన్నా క్యాలరీలు పెరిగిపోయి, కొవ్వు కిందకు మారిపోయి.. బరువు పెరుగుతారు.
మెలటోనిన్ వల్ల నీరసం వస్తుంది. బద్ధకం ఆవరిస్తుంది.
ఆహార నియంత్రణ
పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందాలంటే..
ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి.
ముఖ్యంగా ఆహారాన్ని నియంత్రించుకోవాలి.
లేకపోతే చెడు బ్యాక్టీరియా పెరిగి..
వ్యాధుల బారినపడే అవకాశాలున్నాయి.
ఇలా తినండి..
మనలో చాలామంది అల్పాహారం తినేటప్పుడు
ముందుగా ఇడ్లీ, వడ, పూరీ, దోసె వంటివి తింటారు.
దీంతో అరగంటలో షుగర్ పెరిగిపోతుంది.
ఇందుకు బదులుగా అల్పాహారానికి ముందు ఏదైనా ఒక పండు తినాలి.
ఇందులో పీచు ఎక్కువగా ఉండడం వల్ల.. నెమ్మదిగా జీర్ణమవుతుంది.
మధ్యాహ్న భోజనంలోనూ..
ముందుగా స్వీట్ అస్సలు తినొద్దు.
ముందుగా పండ్లు, కూరగాయల ముక్కలతో భోజనాన్ని ప్రారంభించాలి.
ఆ తర్వాత అన్నం, పప్పు, కూరగాయలు, రసం, పెరుగుతో ముగించాలి.
బిస్కెట్ తినాలనుకున్నప్పుడు..
ముందుగా ఆపిల్ సైడర్ వినెగర్‌ను ఒక టేబుల్ స్పూన్ తీసుకుని..
ఆ తర్వాత బిస్కెట్ తింటే రక్తంలో చక్కెర స్థాయులు గణనీయంగా పెరగవు.
కాలీఫ్లవర్, ఆకుకూరలు, కూరగాయలు తిన్న తర్వాత
మాంసాహారం, ఆలుగడ్డలు తిన్నా.. షుగర్ స్థాయులు అంతగా పెరగవు.
పండ్లు, పాలు, పంచదార కలిపి ‘స్మూతీ’ పేరిట ఒక పదార్థంగా తీసుకుంటుంటారు.
దీంతో అర గంటలోనే షుగర్ పెరుగుతుంది.
ఒకవేళ స్మూతీ తీసుకోవాలనుకుంటే.. భోజనం తర్వాత తాగాలి.
పండ్ల రసాలు శరీరానికి మేలు చేస్తాయని ఎక్కువమంది భావిస్తుంటారు.
నిజానికి జ్యూస్‌లో పీచు పదార్థం అస్సలు ఉండదు.
ఫ్రక్టోజ్ మాత్రమే ఉంటుంది.
ఫ్రక్టోజ్, గ్లూకోజ్ కలిపితే షుగర్ అవుతుంది.
కేవలం ఫ్రక్టోజ్ తీసుకోవడం గ్లూకోజ్ కన్నా ప్రమాదకరమైంది.
రోజూ 2 గ్లాసుల కొబ్బరినీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు.
దీనివల్ల చెడు బ్యాక్టీరియా పోయి.. మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
ఆలివ్ నూనెలు వాడి..
ఆకుకూరలు, కూరగాయలు, చేపలతో చేసిన వంటకాల వల్ల మంచి బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందుతుంది.
చిప్స్, సమోసాలు, పఫ్‌లు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్,
కూల్‌డ్రింక్‌లు, ఎనర్జీ డ్రింక్‌లు, ఐస్‌క్రీములు
వంటి తినుబండారాల్లో వాడే రంగులు, ఇతర ప్రిజర్వేటివ్స్ వల్ల ఎక్కువ హాని జరుగుతుంది.
ఇవి మంచి బ్యాక్టీరియాను కూడా చెడు బ్యాక్టీరియాగా మారుస్తాయి.
100 క్యాలరీలు ఆహారం తిన్నా.. చెడు బ్యాక్టీరియా 200 క్యాలరీలుగా మారుస్తుంది.
టూత్‌పేస్ట్‌లోని రంగుల్లో ‘టైటేనియం ఆక్సైడ్’ను వాడుతున్నారు.
బ్రష్ చేస్తున్నప్పుడు కొందరు పిల్లలు రుచిగా ఉందని పేస్ట్‌ను మింగుతుంటారు.
దీని వల్ల చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది.
ఇంట్లో తినే భోజనానికి, జంక్ ఫుడ్‌కు మధ్య బ్యాక్టీరియా వృద్ధిలో స్పష్టమైన తేడా ఉంది.
తిన్నాక 10 నిమిషాలు అటూ ఇటూ.. నడవాలి.
వ్యాయామం చేసినప్పుడు ‘లాక్టేట్’ అనేది ఉత్పత్తి అవుతుంది.
ఇది ఎక్కువగా ఉత్పత్తయ్యే వారిలో శరీరం నిస్సత్తువగా మారుతుంది.
అలసిపోయి.. పనిచేయాలనిపించదు.
ఇలాంటివారు ఉదయం వ్యాయామం చేస్తే ఇక ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేరు.
అందువల్ల లాక్టేట్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవారు సాయంత్రం పూట వ్యాయామం చేస్తే మంచిది.
అలసిపోయినా.. వ్యాయామం తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు.
ఎప్పుడైనా తినగానే కనీసం 10 నిమిషాలైనా అటూ ఇటూ నడవాలి.
దీనివల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.
ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు వేగంగా నడవొద్దు.
ఉపవాసాలతో మేలే!
వారానికి ఒకటి, రెండు రోజులు ఉపవాసం ఉండడం వల్ల శరీరానికి మేలే జరుగుతుంది.
ఈ రోజుల్లో కేవలం పీచు ఎక్కువగా ఉండే పండ్లను పరిమితంగా తినాలి.
వాటితో పాటు కొబ్బరి నీళ్లను తీసుకోవాలి.
ఇటీవల కొందరు ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ పద్ధతి అనుసరిస్తున్నారు.
ఇందులో రోజులోని 24 గంటల్లో కేవలం 8 గంటల్లో మాత్రమే తినాలి.
ఆ 8 గంటల్లో నాలుగైదు సార్లు కూడా తినొచ్చు.
మిగతా 16 గంటలు ఏమీ తినకూడదు.
ఉదాహరణకు ఉదయం 10 గంటలకు తినడం ప్రారంభిస్తే..
సాయంత్రం 6 గంటలకు ఆపేయాలి.
ఆ తర్వాత మళ్లీ మర్నాడు ఉదయం 10 గంటల వరకూ ఏమీ తినొద్దు.
ఈలోగా కొబ్బరి నీళ్లు, బ్లాక్ కాఫీ తాగొచ్చు.
ఈ విధానంలో కూడా మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.
మనం తినే ఆహారంలో నాలుగింట మూడో వంతు మాత్రమే తిని.. ఆఖరిది తినొద్దు.
ఇలా చేస్తే జీవిత కాలం 2-3 ఏళ్లు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఎందుకంటే రోజూ తినే ఆహారం కంటే తక్కువ తింటే..
క్యాలరీలు తక్కువగా వచ్చాయనే భావనతో.. శరీరంలో రుగ్మతలను నయం చేసే వ్యవస్థ బలంగా పనిచేస్తుంది.
అదే పుష్టిగా తింటే.. ఎక్కువ క్యాలరీలున్నాయిలే అన్న భావనతో ఆ వ్యవస్థ బద్ధకంగా ఉంటుంది.
సొంతంగా నయం చేసుకునే వ్యవస్థ పనిచేయదు.
గట్ మైక్రోబయోమ్ అంటే?
పీచు ఉన్న షుగరా? లేని షుగరా?
శరీరంపై ప్యాచ్‌లు పెట్టడం ద్వారా
ఒంట్లోని షుగర్ స్థాయులను గంటగంటకూ పరీక్షించుకునే
కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
సాధారణ ఆహారం తిన్నామనుకోండి..
గంటలో షుగర్ పెరుగుతుంది.
తిరిగి 2-2.30 గంటల్లో షుగర్ స్థాయులు కిందకు వస్తాయి. మళ్లీ ఆకలేస్తుంది.
ఒకవేళ తీపి పదార్థాలు తింటే..
షుగర్ స్థాయులు ఒక్కసారిగా పెరిగిపోతాయి.
2 గంటల్లో తగ్గిపోయి.. మళ్లీ ఆకలి అవుతుంది.
ఈ రెండూ కాకుండా
పీచు పదార్థాలున్న ఆహారం తీసుకుంటే.. షుగర్ ఎక్కువగా పెరగదు.
రెండు గంటల వరకు ఒకే స్థాయిలో గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలవుతోంది.
చాలామంది అరటిపండులో షుగర్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు.
కానీ, అందులో పీచు ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ నెమ్మదిగా విడుదలవుతుంది.
మూణ్నాలుగు గంటల తర్వాత గానీ మళ్లీ ఆకలి వేయదు.
షుగర్ ఒక్కటే ముఖ్యం కాదు..
పీచుతో పాటు ఉన్న షుగరా? పీచు లేని షుగరా? ఏది తింటున్నామన్నది ముఖ్యం.
‘గట్ మైక్రోబయామ్ మెటా జీనోమిక్స్’ పరీక్ష ద్వారా మంచి, చెడు బ్యాక్టీరియాల గురించి తెలుసుకోవచ్చు.
No comments:
Post a Comment