Tuesday, September 3, 2024

 🎻🌹🙏 క్షేత్రపాలకుడు....!

🌿క్షేత్ర పాలకుడు అంటే ఆ క్షేత్రాన్ని పాలించేవాడు, రక్షించేవాడు అని అర్థం.

🌸 ముఖ్యంగా క్షేత్రాలలోని ఆలయాలకు తప్పకుండా ఈ క్షేత్రపాలకుడు ఉంటాడు. 

🌿భక్తులు తప్పనిసరిగా ఆ స్వామిని దర్శించుకోవడం క్షేత్రనియమంగా వస్తోంది. 

🌸సాధారణంగా క్షేత్రపాలకుడంటే శివుడే అని శైవాగమాలు చెప్తున్నాయి. వైష్ణవాగమాల్లో కూడా దండపాణిగా శివుడే క్షేత్రపాలకుడుగా దర్శనమిస్తాడు. 

🌿శివాలయంలో ఈయన ముఖ్యదేవతగా ఉంటాడు. శివాలయంలో ఆగ్నేయదిక్కున ఈ స్వామి ఆలయం ఉంటుంది.

 🌸భక్తులు ముందుగా ఈయనను దర్శించి శివ దర్శనం.. శివార్చన కొరకు అనుమతి పొందిన తరువాతే ఆలయంలోకి అడుగుపెట్టాలనే నియమం కూడా ఉంది.

🌿 ఈ నియమం ఒక్క భక్తులకే కాక అర్చనాది కైంకర్యాలు జరిపే అర్చకులకు కూడా ఉంది.

🌸ముఖ్యంగా అర్చకులు శివాలయానికి వేసిన తాళాలను ఈ క్షేత్రపాలకుడి వద్దే ఉంచి వెళ్తారు.

🌿 ఉదయాన్నే ఆలయం తెరిచే ముందు ఈయన అనుజ్ఞ తీసుకొని అర్చనాది కార్యక్రమాలు మొదలుపెడతారు.

🌸 ఈశ్వరుడి వెయ్యో అంశగా క్షేత్రపాలకుడు ఉద్భవించినట్లు సుప్రభేదాగమం చెప్పింది. 

🌿గ్రామానికి ఈశాన్యంలో లోకరక్షణ కోసం ఈయనకు ప్రత్యేకంగా ఆలయం కూడా  నిర్మించాలని ఆగమశాస్త్ర నియమం.

🌸 క్షేత్రపాలకుడు నల్లని మబ్బులవంటి శరీరవర్ణంతో.. గుండ్రటి కన్నులతో.. నగ్నంగా.. పదునైన పళ్లకోరలతో.. భ్రుకుటిని ముడిచి.. ఎర్రటి పొడవైన కేశాలతో.. శరీరంపై కపాలమాలలతో.. చేతుల్లో త్రిశూలం, కపాలం వంటి ఆయుధాలతో నిలుచుని.. భైరవవాహనంతో ఉంటాడు.

 🌿కాశ్యప శిల్పశాస్త్రం ఆయన చేతులు, ధరించే ఆయుధాలను బట్టీ సాత్త్విక, రాజస, తామస మూర్తులుగా విభజించింది.

🌸తెల్లగా.. శాంతముఖంతో.. రెండు/నాలుగు చేతులతో.. అభయ–వరదముద్రలతో.. రెండు ఆయుధాలతో ఉన్న స్వామి సాత్త్విక క్షేత్రపాలకుడు.

🌿ఎర్రగా..ఉగ్రముఖంతో ఆరు చేతుల్లో ఆయుధాలు పట్టిన మూర్తి రాజసిక క్షేత్రపాలకుడు. నల్లగా.. తీక్షణంగా చూస్తూ.. మూడు కన్నులతో.. నాగాభరణాలతో.. ఎనిమిది చేతులతో తామసిక క్షేత్రపాలకుడు ఉంటాడు.

🌸 శ్రీవిద్యార్ణవ తంత్రం క్షేత్రపాలకుడు.. అనల, అగ్నికేశ,కరాళ, ఘంటికారవ, మహాకోప, పిశితాశ, పింగాక్ష, ఊర్ధ్వకేశులనే అష్ట (8) కింకరులను కలిగి ఉంటాడని పేర్కొంది.

🌿 క్షేత్రపాలకుడు ఆలయానికి.. గ్రామానికి.. క్షేత్రానికి ముఖ్యమైన దేవుడనీ.. తొలుత ఆయన్నే పూజించాలని శాస్త్రోక్తి.

🌸జననానుడిలో.. కొన్ని స్థలమాహాత్మ్యాల్లో మాత్రం శివక్షేత్రానికి విష్ణువు.. విష్ణుక్షేత్రాలలో శివుడు క్షేత్రపాలకులని ఉంది. 

🌿ఉదాహరణకు తిరుమల ఆలయంలో ఈశాన్యంలో క్షేత్రపాలక రుద్రశిల ఉంది. అలాగే గోగర్భం జలాశయం వద్ద ఉన్న ఒక పెద్దరుద్రశిలను భక్తులు దర్శిస్తారు.

🌸 అలాగే పంచారామ క్షేత్రాలన్నింటికీ విష్ణువు క్షేత్రపాలకుడై ఉన్నాడు. వీరేగాక భద్రాచలం, కొన్ని నృసింహ క్షేత్రాలకు ఆంజనేయస్వామి, శ్రీశైలానికి వీరభద్రుడు, 
బద్రీనాథ్‌ క్షేత్రానికి ఘంటాకర్ణుడు, వారణాసి, శ్రీకాళహస్తి, ఉజ్జయిని క్షేత్రాలలో కాలభైరవుడు క్షేత్రపాలకులు. క్షేత్రపాలకుడి దర్శనం, పూజ విశేష ఫలితాలిస్తాయి...స్వస్తి...          

No comments:

Post a Comment