అవ్యక్తం.....
పూర్వకల్పంలోని జీవుళ్ళు దేహాలను వదిలిన తర్వాత అవ్యక్తంలో - అంటే పరమాత్మలో ఉండిపోతారు. వారి అందరి వాసనలను సమిష్టివాసనలు అంటారు. అవి పక్వానికి వచ్చి అనుభవాలు పొందాలని భగవంతుని తొందర పెడతాయి. కనుక భగవంతుడు గర్బాదానానికి సిద్ధమయ్యాడు. మనం పండ్ల కోసం విత్తనం నాటినట్లు ఆయన వివిధ క్షేత్రాల సృష్టి కోసం ఈ వాసనలనే విత్తనాలను మాయ యొక్క గర్భంలో నాటుతున్నాడు. ఈ విత్తనం సూక్ష్మాతి సూక్ష్మం. కంటికి కనిపించదు. అందుకే దానిని అవ్యక్తం అన్నారు.
ఆ విచారణ ఎలా చేయాలి ? స్థూల సూక్ష్మ కారణశరీరాలతో గాని, వాటి వృత్తులతో గాని క్షేత్రజ్ఞుడవైన నీకు ఏ సంబంధమూ లేదు. నీవు వాటిని కేవలంగా చూచే సాక్షివి మాత్రమే. నీ ప్రకాశం వల్లనే అవి తమ పనులు తాము చేసుకొంటున్నాయి. అంతే.
జాగ్రదవస్ధలో స్థూలశరీరం, సూక్ష్మశరీరం, కారణశరీరం అన్నీ పని చేస్తుంటాయి. వాటిని పనిచేయించే జీవుణ్ణి 'విశ్వుడు' అంటారు. వాడు నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు ఏదేదో చేస్తుంటాడు. ఆ సంసారాన్ని వాడికి వదులు. ఇక నిద్రకుపక్రమించిన తర్వాత స్థూలశరీరం ప్రక్క మీదికి చేరి అలసి పోతుంది. అప్పుడు సూక్ష్మశరీరం పని చేస్తుంది. దాని పని స్వప్నాన్ని సృష్టించటం. ఆ స్వప్నావస్థలో పని చేసే జీవుణ్ణి 'తైజసుడు ' అంటారు. వాడి చిత్ర విచిత్ర వ్యవహారాలను వాడి నెత్తిన పెట్టు. ఇక గాఢనిద్రలో ఏమీ చేయకుండా హాయిగా ఉండే జీవుణ్ణి 'ప్రాజ్ఞుడు' అంటారు. వాడి గొడవను వాడికే అప్పగించు.
మరి ఇంతకీ నీవెవరు ? నీవు సాక్షివి. కేవల సాక్షివి. స్వయం ప్రకాశానివి. నిత్య సత్యానివి. ఆత్మవు. సాక్షివైన నీవు సాక్షిగానే ఉండు. వారి వ్యవహారాలలో జోక్యం చేసుకోకు. జోక్యం చేసుకొన్నవా ? సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు, మానావమానాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి. కనుక దూరంగా, కేవలంగా, సాక్షిగా, నిర్లిప్తంగా ఉండిపో.
(శ్రీమద్భగవద్గీత :13 వ అధ్యాయం : క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం)
No comments:
Post a Comment