Wednesday, September 18, 2024

 గతాలన్ని వెనకాల వదిలేస్తూ
గాయాలకు మరపుపూత పూస్తూ
ధ్యేయం వైపు గమనం
ఆయుధం లేని యుధ్ధం.

రానున్నది అసలు తెలియదు
కానున్నది కాక మానదు
రేపన్నది కమ్మని తలపు
రేపునదే బ్రతుకుపై వలపు

అనుకోని పరిణామాలు
పరీక్ష తరువాతి పాఠాలు
చదవని పుస్తకంలో ప్రశ్నలు
అనుభవాలే అధ్యాయాలు

తెలియని లోకం తీరు
లౌక్యం నేర్పి తీరు
కలవని తీరాల తీరున
కలిసే సాగాలి కడవరకు..

చిగురించే రెమ్మల నడుమ
వాడి మోడయే కొమ్మలు 
ఎప్పటికీ వీడని నీడలు
ఎదురీత తెలియని బ్రతుకులు

అడుగు సాగితేనే
వెలుగు తోచు దారి
ఆగిపోక సాగుటొకటే
తెలుసుకో బాటసారీ!

ఎల్లకాలం చీకటుండదు
వెలుతురేమో రాక మానదు
వెల్లువైన వేకువైనా
మాపులోన మాసి పోక నిలవదు

దిగులు దింపే దివ్వెలాగా
దిక్కులు నింపే వెలుతురై
కదిలొచ్చే కాలంతో
ఎదురొచ్చే వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸

బృంద 🙏

No comments:

Post a Comment