*ఓం నమో భగవతే శ్రీ రమణాయ*
ప్రశ్న :
భగవాన్! ఆత్మ సమర్పణ అంటే ఏమిటి?
మహర్షి :
ఆత్మ సమర్పణ అన్నా, మనో నిగ్రహము అన్నా ఒకటే. అహంకారం, ఆత్మయొక్క ఆధిపత్యాన్ని అంగీకరించి చివరకు అహంకారం లొంగిపోతుంది. ఇది శరణాగతి యొక్క మొదటి మెట్టు.
ఆత్మ లేనిదే అహంకారం ఉండలేదు. కాని ఈ విషయం తెలియక అజ్ఞానంతో విప్లవం చేస్తూ తన స్వంత ఇచ్ఛతో, స్వంత బుద్ధితో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది అహంకారం.
**
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
విదేశీయుడు :
భగవాన్! భక్తిజ్ఞానాలు కలిగినవారు మరణ సమయంలో ఏమి చేయాలి?
మహర్షి :
భక్తుడు ఎన్నడూ మరణించడు. అసలు అతడు అప్పటికే మరణించి ఉంటాడు. మనుష్యులు జీవితకాలమంతా ఏమి చేస్తూ వస్తారో మరణ సమయంలో కూడా అదే చేస్తారు. ప్రాపంచిక జీవి, ప్రాపంచిక విషయాల గురించి యోచిస్తాడు.
భక్తుడు, భక్తి గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి యోచిస్తాడు. కాని జ్ఞాని మాత్రం ఏ ఆలోచనలు లేనివాడు గనుక ఉన్నవాడు ఉన్నట్లే ఉండిపోతాడు. జ్ఞాని ఆలోచనలు ఏనాడో మరణించి ఉంటాయి గనుక జ్ఞాని శరీరం కూడా ఆ ఆలోచనలతోపాటే మరణించి ఉంటుంది. అందుచేత జ్ఞానికి ప్రత్యేకంగా మరణమంటూ ఏమీ ఉండదు.
***
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
మనుష్యులకు వారి వస్తువులను వదలు కోవటమంటే భయం గనుక వారికి మరణము అంటే భయం. నిద్రకూడా మరణం వంటిదే అయినా నిద్ర పోయేటప్పుడు మళ్ళీ మేల్కొనగానే తమ వస్తువులన్నీ యథాతథంగానే ఉంటాయి గనుక భయం ఉండదు.
జ్ఞానికి, భక్తునికి తనది అన్న భావం దేనిమీదా ఉండదు గనుక అతడు మరణానికి కించిత్తు కూడా భయపడడు. మరణం తరువాత కూడా ముందు ఉన్నట్లే ఉంటాడు.
**
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ఒక యువకుడికి, మహర్షి ఇలా ఉపదేశించారు...
"నీవు ఇంత చిన్నవయస్సులో దైవాన్ని అన్వేషిస్తున్నావు. అది చాల మంచి పని. దైవంపైనే చిత్తం ఏకాగ్రంగా నిలుపు. ఫలాలను ఏమీ ఆశింపక, నీ పని నీవు చేయి. నీవు చేయవలసింది అంతే."
No comments:
Post a Comment