Wednesday, September 18, 2024

 Vedantha panchadasi:
భ్రాంతి స్వప్న మనోరాజ్య స్మృతిష్వస్తు మనోమయమ్ ౹
జాగ్రన్మానేన మేయస్య న మనోమయ తేతి చేత్ ౹౹26౹౹

26. భ్రాంతి స్వప్నము పగటికలలు జ్ఞాపకములు వీని యందు మానసిక మైన ఆకారములు ఉండనిమ్ము.వీనియందు స్థూలరూపములు గాక మానసిక రూపములే కన్పించును.కాని జాగ్రదవస్థయందు మానసిక రూపములు కన్పింపవు గదా.

భాఢం మానే తు మేయేన యోగాత్స్వాద్విషయాకృతిః ౹
భాష్యవార్తికకారాభ్యామయమర్థ ఉదీరితః ౹౹27౹౹

27.(సమాధానము:)సత్యమే. జాగ్రదవస్థయందు స్థూలరూపములే కన్పించును.కాని విషయాకృతి మనస్సు ఆవిషయముతో కలియుటవలన ఏర్పడుచున్నది.ఈ విషయమును శ్రీ శంకరులు సురేశ్వరాచార్యులు భోధించిరి.

మూషాసిక్తం యథా తామ్రం తన్నిభం జాయతే తథా ౹
రూపాదీన్ వ్యాప్నువచ్చిత్తం తన్నిభం దృశ్యతే ధ్రువమ్ ౹౹28౹౹

28.కరిగిన రాగి(లోహము) మూసయందు పోయబడినపుడు ఆమూస ఆకారమును పొందినట్లే రూపము మొదలగు విషయములందు వ్యాపించిన మనస్సు అవస్యము ఆ సాకారమునే పొందుచున్నదని శ్రీ శంకరాచార్యులు చెప్పిరి.(ఉపదేశసాహస్రి 14.3-4 బ్రహ్మసూత్రభాష్యము1.1.12)

వ్యంజకో వాయథాఽ లోకోవ్యంగ్యస్యాకారతామియాత్ ౹
సర్వర్థ వ్యఞ్ధకత్యాద్ధీరర్థాకారా ప్రదృశ్యతే ౹౹29౹౹

29.తామ్రము స్థూల వస్థువు -మనస్సు అట్టిది కాదేయను సంశయమును వారించుచున్నాడు. సూర్యకాంతి తాను ప్రకాశింప జేయుచున్నను వస్తువు ఆకారమునే పొందును.సకల వస్తువుల ప్రకాశింపజేయునది తుదకు బుద్ధి యే అగుటచే అదికూడా తాను చూచుచున్న వస్తువుల ఆకారమునే పొందును.

కుమ్మరి కుండనుచేయువిధముగా కేవలభావనలతో దేహమును 'కల్పించునది' మనస్సే.అది నూతన దేహములను సృజించి ఉన్నదానిని నశింపజేయును.ఇది అంతయు కేవలము ఇచ్ఛాఫలితమే.

భ్రాంతి,స్వప్నము,వివేకరహితమగు ఆలోచన అనువాని శక్తులు మనస్సులోపలనుండుననుట నిశ్చితముగా స్పష్టము.అవి ఆకాశకుశుమమును గూడా తప్పక కల్పించును.

అదే విధముగా అది తనలోపల దేహదృశ్యమును గూడా కల్పించును.కానీ అజ్ఞాని స్థూలమగు భౌతికదృష్టితో భౌతిక శరీరమును మనస్సుకంటే భిన్నముగాను,స్వతంత్రమయిన దానినిగాను జూచును.

కలతపడినప్పుడిన మనస్సు ,మట్టిలో ఆడుకొను బాలునివలె,తనలో మార్పులను పరంపరగా కలిగించుచు తన ఇష్టము వచ్చీనట్లు దేహమును ఆడించును.

మానసికమగు కర్మలే కర్మలు దాని భావనలు బంధమును కలిగించును.దాని నిర్మలస్థితి మోక్షము.

దేహమును దాని అవయవములన్నింటితో సృజించునది మనస్సే,
చేతన-అచేతన జీవులు రెండును మనస్సే.

అనంతమయిన ఈ వైవిధ్యమంతయును మనస్సు తప్ప వేరేదియుగాదు. మనస్సే నిర్ధారణగా పనిచేయునప్పుడు బుద్ధి అనబడును,అది తాదాత్మ్యముగా పనిచేయునప్పుడు అహంభావమనబడును.

జాగ్రత్,స్వప్న,సుషుప్తులను త్రిలోకములు మనశ్శక్తులయొక్క అభివ్యక్తి తప్ప వేరేవియుగావు.

ఈ అభివ్యక్తి సత్యమని కానీ అసత్యమనికానీ భావింపజాలము.మనస్సు నానాత్వదృష్టితో(జ్ఞానముతో)పరిమితమయి 'చూచు'నప్పుడు అది నానాత్వమును జూచును.

"నేను బలహీనుడను, దుఃఖితుడను,మూర్ఖుడను"
మొదలగు అనేక భావనలను పెట్టుకొని మనస్సు ఈ ప్రపంచదృశ్యములో స్వయముగా చిక్కుకొనును. 'ఇది అంతయు కేవలము మనస్సు యొక్క మిథ్యాసృష్టి , 
నేనున్న విధముగా ఉన్నాను'  అను అవగాహన ఉదయించినప్పుడు వ్యక్తి చైతన్యములో పరమశాంతి ఆవిర్భవించును.

భౌతికశరీరము భౌతికపదార్థము మాత్రమే.అయినను దానిని తనదానినిగా మనస్సు భావించును.అయినప్పటికి మనస్సు సత్యము(తత్త్వము)వైపు మరలినచో అది దేహముతో తన తాదాత్మ్యమును విసర్జించి పరమాత్మను పొందును.       

No comments:

Post a Comment