Vedantha panchadasi:
ఈశ కార్యం జీవభోగ్యం
జగద్ ద్వాభ్యాం సమన్వితమ్ ౹
పితృజన్యాభర్తృభోగ్యా యథా యోషిత్తథేష్యతామ్ ౹౹18౹౹
18.ఈశ్వరసృష్టము జీవభోగ్యము అగు సప్తాన్న రూపమైన జగత్తు ఆ ఇరువురి తోడను సంబంధ పడియున్నది.ఒక కన్య మాతాపితలకు పుత్రికయు భర్తకు భార్యయునైనట్లే.
మాయా వృత్త్యాత్మకో హీశసంకల్పః సాధనం జనౌ ౹
మనో వృత్త్యాత్మకో జీవసంకల్పో భోగసాధనమ. ౹౹19౹౹
19.సకల జగత్తుయొక్క సృష్టికి మాయాశక్తి సహితమైన ఈశ్వర సంకల్పమే సాధనము వాని ననుభవించుటయందు అంతఃకరణ వికారరూపమగు జీవసంకల్పము సాధనము.
వాఖ్య:త్రిగుణాత్మికమైన మాయను ఉపాధిగ చేసుకుని ఈశ్వరుడు సంకల్ప మాత్రముననే సృష్టికార్యము నెరపును.
అందలి వస్తువులను అనుభవించుటకు జీవుడు పుణ్యాపుణ్య సంపాదనకై ధర్మాధర్మకర్మను జేయును.
పుణ్యాపుణ్యముల ఫలమగు సుఖదుఃఖములు మనోవృత్తుల ద్వారా అనుభవమగును.
ఈ విధముగా జీవసృష్టి జీవసంకల్పములపై ఆధారపడి అంతఃకరణ వికారముల ద్వారా భోగసాధనమగుచున్నది.
ఆ పరమాత్మయే మాయచే మోహింపబడిన అంతఃకరణము గలవాడై,శరీరమును పొంది సమస్తకార్యములను జేయుచున్నాడు.
జీవేశ్వరుడు స్వప్నమనే తనయొక్క మాయచేత కల్పింపబడి సకల లోకములలో సుఖ దుఃఖముల ననుభవించుచున్నాడు.
తిరిగి పూర్వజన్మ కర్మ సంబంధము వలన ఆ జీవశ్వరుడే (దుఃఖము లేక అజ్ఞానము నుండి) మేల్కొని మరల జాగృతి జెందుచున్నాడు.
ఒకే బంగారము ఆభరణాలుగా వివిధ రూపాలను పొందిన విధముగా ఆ పరమత్మయే వివిధ రకాలుగా ప్రకాశించుచున్నాడు.
ఒకే వ్యక్తి ఒకరికి తండ్రిగా ఒకరికి తాతగా,ఒకరికి భర్తగా వివిధ రకాలుగా ఒకే వ్యక్తి వున్నవిధముగా ఆ పరమాత్మ సర్వస్వరూపిగను ఈ ప్రపంచమునకు ముఖ్య స్థానమగు సూక్ష్మము కంటే సూక్ష్మముగను నుండు పరబ్రహ్మమే అంతఃకరణముగానుండి సర్వమును నడపబడుచున్నాడు.
ఈశ నిర్మిత మణ్యాదౌ వస్తున్యేకవిధేస్థితే ౹
భోక్తృ ధీవృత్తి నానాత్త్వాత్తద్భోగో బహుధేష్యతే ౹౹20౹౹
20.ఈశ్వరనిర్మితములగు మణులు మొదలగు వస్తువులు ఒక విధముగనే ఉండును. జీవసృష్టియగు వాటి అనుభవములు,భోక్తల అంతఃకరణ వృత్తుల వైవిధ్యముచే బహువిధములుగ ఉండును.
హృష్యతేకో మణిం లబ్ధ్వా క్రుధ్యత్యన్యో హ్యలాభతః ౹
పశ్యత్యేవ విరక్తోఽ త్ర న హృష్యతి న కుష్యతి ౹౹21౹౹
21.మణి దొరికినదని ఒకడు మహానందము నొందును.మరియొకడు తనకు దొరకలేదని క్రుద్ధుడగును. విరక్తుడగు ఇంకొకడు సంతోషము గాని కోపముగాని లేక ఉదాసీనముగ జూచును.
ప్రియోఽ ప్రియ ఉపేక్షత్యాకారా మణిగాస్త్రయః ౹
సృష్టా జీవైరీశ సృష్టం రూపం సాధారణం త్రిషు ౹౹22౹౹
22.ప్రియము అప్రియము ఉపేక్ష(ఉదాసీనత)అను నీ మూడు భావములు మణియందు జీవులచే సృష్టింపబడినది.మూడింటియందును ఈశ్వరసృష్టమైన మణిరూపము సమానమే.
భార్యా స్నుషా ననందా చ యాతా మాతేత్యనేకధా ౹
ప్రతియోగిధియో యోషిద్భిద్యతే న స్వరూపతః ౹౹23౹౹
23.ఒక స్త్రీయే ఒకరికి(భర్తకు)భార్యగను,కోడలుగను,మరదలుగను,తోడికోడలుగను,తల్లిగను, వారి సంబంధమును అనుసరించి వేరు వేరుగ ఉండును.కాని స్వరూపమున ఉన్నది ఒక స్త్రీయే.
నను జ్ఞానాని భిద్యన్తా మాకరస్తు న భిద్యతే ౹
యోషిద్వపుష్యతిశయో న దృష్టో జీవనిర్మితః ౹౹24౹౹
24.(ఆక్షేపము):భావములు
(జ్ఞానములు) మారిన మారుగాక.వస్తువు యొక్క ఆకారము మారుటలేదు గదా.జీవనిర్మితమైన విశేషమేమీ ఈ స్త్రీ శరీరమున కన్పించుట లేదు.
మైవం మాంసమయీ యోషిత్కాచిదన్యా మనోమయీ ౹
మాంసమయ్యా అభేదేఽ పి భిద్యతే హి మనోమయీ ౹౹25౹౹
25. (సమాధానము):అట్లు కాదు.మాంసనిర్మిత శరీరము గల స్త్రీకి మనో నిర్మితమైన సూక్ష్మశరీరము మరియొకటి ఉన్నది.మాంస శరీరమున మార్పులేకున్నను మనోనిర్మిత శరీరము మారుట ప్రసిద్ధమే.
నచ్చినది దొరికిన ఆనందము,దొరకకున్న విచారము, ఉదాశీనత,కోర్కె,కోపము,
భయము,దుఃఖము మొదలగు సంకల్ప,వికల్పములన్నియు
మనో ధర్మములు.
ఈశ్వరసృష్టియగు వస్తువు నందు మార్పులేదు కానీ మనోభావనను అనుసరించి జీవునియందు ఇష్టాఇష్టాలు, సుఖదుఃఖాలు సృష్టి జరుగుతుంది.ఇదియంతయు భ్రాంతి చెందిన మనస్సుయొక్క ఊహ తప్ప వేరేదియుగాదు.
మానసిక పరిమితిచేత ఈ మనస్సే జీవుడనబడును.ఈ జీవుడే అపరిచ్ఛిన్న చైతన్యతత్త్వము నుండి దూరముగా బోయి పరిమితిలోనికి అంతకంతకు మునుగుచు ప్రపంచదృశ్యములో చిక్కుకొనును.
సత్యత్వదృష్టిచే చూచిన అసత్యము అదృశ్యమగును.కేవల భావనా శక్తి వలన జనించిన అసత్యమును సత్యమయినట్లు భావించుచున్నాము.
సత్యము అనుభవగోచరమయినప్పుడు ఊహింపబడిన ప్రపంచము అంతమొందును.
ఒకే బ్రహ్మమమునందు
భోక్త-భోగ్యము అను భేదము తెలియవచ్చుచున్నది.అయితే వేదాంతము ఆత్మ అకర్త అభోక్త అని గదా చెప్పుచున్నది.
ఆత్మ సాక్షిమాత్రమై యుండునని వేదాంతము చెప్పును. అనిర్వచనీయమగు మాయా శక్తి(అవిద్య)ఆత్మ దేవుని ఆధారముగా గొని పై దెల్పిన భేదమును సాక్షియందు జూపును.అంతేగానీ భోక్త అని చెప్పబడు జీవుడు గాని, భోగ్యమను చెప్పంబడు జగత్తుగానీ మాయాకార్యమేగానీ సత్యము గాదు. ఈ భోక్తాభోగ్యములు మాయా(అవిద్యా)వశంబున ఒకే బ్రహ్మ మందు కల్పించబడుటచే వాస్తవముగాదు.వీని పరమార్థము బ్రహ్మమే.
No comments:
Post a Comment