Vedantha panchadasi:
అన్వయ వ్యతిరేకాభ్యాం ధీమయో జీవ బంధకృత్౹
సత్యస్మిన్ సుఖదుఃఖే స్తన్తస్మిన్నసతి న ద్వయమ్ ౹౹32౹౹
32.అన్వయవ్యతిరేకములచే ధీమయ విషయమే జీవ బంధకారణము.అది ఉండినచో సుఖదుఃఖములున్నవి.అది లేనిచో సుఖదుఃఖములును లేవు.
అసత్యపి చ బాహ్యార్థే స్వప్నాదౌ బంధ్యతే నరః ౹
సమాధి సుప్తి మూర్ఛాసు సత్యప్యస్మి న్న బధ్యతే ౹౹33౹౹
33.బాహ్యవిషయములు లేని స్వప్నము జ్ఞాపకము మొదలగు స్థితుల యందు బుద్ధి జనిత వికారముల వలన మానవుడు అనుకూల వికారములచే సుఖమును ప్రతికూల వికారములచే దుఃఖమును పొందుచు బుద్ధిచే బద్ధుడగుచున్నాడు.
అనుకూలములు ప్రతికూలములు అగు బాహ్యవిషయములున్నను సమాధి సుషుప్తి మూర్చ మొదలగు అవస్థలయందు తదనుగుణములైన సుఖదుఃఖములు లేవు,బంధము లేదు.ఏలన బుద్ధి వికారము లేదు గనుక.
వాఖ్య: బుద్ధికృతములైన సూక్ష్మవిషయాకారములున్ననే జాగ్రత్స్వప్నములు అందలి సుఖదుఃఖములు ఉన్నవి.బుద్ధి యట్టి వికారములు పొందని సుషుప్తి సమాధి స్థితులయందు సుఖదుఃఖములు లేవు.ఆ బుద్ధి జనిత వికారములు జీవసృష్టి కనుక అదియే బంధకారణము.
వస్తువుల విభజించి గ్రహించెడి ధీవృత్తి బుద్ధి అనబడును.ఇది నిశ్చయించెడి స్వభావము గలది.సర్వార్థముల ననుభవించెడి ఈ బుద్ధిని తెలియువాడు ఆత్మ.
ఆహంకారభ్రాంతి ఆకాశము యొక్క నీలివర్ణము వంటిది.దీనిని మరల స్మరింపకుడునట్లుగా పూర్తిగా విస్మరించుటయే ఉత్తమము.
ఆహంకారము అంతులేని విషాదమునకు, బాధకు,దుష్కార్యమునకును మూలము.జీవనము మరణముతో అంతమొందును.మరణము జననమునకు దారితీయును అట్టి భావనలు మహాదుఃఖమునకు దారితీయును.
ఈ ప్రపంచమందు మిత్రుడుగానీ,శత్రువుగానీ లేడు. మనకు సఖమునిచ్చుదానిని మన మిత్రునిగాను,బాధను కలిగించు దానిని మన శత్రువుగాను భావింతుము.
మనస్సు తన భావనాశక్తిద్వారా దేహమును సృజించును.మరియు దేహము యొక్క జీవితకాలమంతయు మనస్సు తన దుఃఖముతో దానిని పోషించును.
మనోనాశనమువలననే సుఖము ఉండగలదు.
"నేనిప్పుడు దీనిని పొందితిని"
"నేను దానిని గూడ పొందెదను"-ఇటువంటి ఆలోచనలవలన కలిగిన ఆందోళన అజ్ఞానిని దహించును.
"ఇది ఉన్నది",అది లేదు"- ఇట్టి భావనలు అహంకారిలో అశాంతిని
కలిగించును.కానీ అహంకారము నివర్తించినచో అప్పుడు మాయామయమగు ప్రపంచదృశ్యము మరల అంకురింపదు,తృష్ణలన్నియును అంతరించును.
మనస్సు క్షీణించినచో శరీరము వాసనారహితమయి నశించును.కానీ దేహము క్షీణించినచో మనస్సు క్షీణించదు,అందు వలన మనస్సును నశింపజేయవలెను.
No comments:
Post a Comment