Friday, September 20, 2024

****ప్రధాన_శత్రువులు

 *ప్రధాన_శత్రువులు*
              
*పుణ్య పాపాలగురించి చాలా మందికి అవగాహన ఉంది. పాపపుణ్యాలు క్రమంగా సత్కర్మలు మరియు దుష్కర్మల ఫలితమని మనందరికీ తెలుసు.*

*మంచిచెడుల మధ్య తేడాను గ్రహించగలిగినప్పటికీ ఆశ్చర్యకరంగా మానవుడు పాపపు కర్మలలోనే నిమగ్నుడవుతాడు.*

*ఒకసారి దుర్యోధనుని ఇలా ప్రశ్నించారు. "మీరు రాజు, శాస్త్రాలను చదివారు. ధర్మమంటే ఏమిటో తెలుసు. అయినా మీరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?”* 

*అప్పుడు దుర్యోధనుడు - "ధర్మమంటే ఏమిటో నాకు తెలుసు. అయినా నా మనస్సు దాని వైపు మొగ్గటంలేదు. అధర్మమూ నాకు తెలుసు. కాని నా మనస్సు పాపకర్మలు ఆచరించటానికే ఇష్టపడుతోంది." అని సమాధానమిచ్చుట ఆశ్చర్యకరమైన విషయం.*

*శ్రీకృష్ణభగవానుని మాటలను వింటున్న అర్జునుడు…   "దేవా ! నీవు బోధించే విషయం తెలుస్తున్నా మనిషి ప్రవర్తన చూస్తే వింతగా అనిపిస్తోంది." అని ప్రశ్నించాడు.* 

*"మనిషికి తాను ఏమి చేస్తున్నాడో తెలిసి చేసినా ఎవరి బలవంతం మీదనో చేస్తున్నట్లు పాపపు పనులనే చేస్తుంటాడు. దానికి కారణమేమిటి?"*

*దానికి శ్రీకృష్ణ భగవానుని సమాధానం ఇచ్చారు… కామము మరియు క్రోధము అనబడు శత్రువులు రజో గుణం వలన జనిస్తవి. మహా పాపిష్టమైనవి. అవే మనిషిని బలవంతంగా పాపానికి ప్రేరేపిస్తాయి.*

*పైన చెప్పిన విషయం మనకు క్రొత్త కాదు. మనందరికీ సామాన్యంగా తెలిసినదే. అయితే మళ్ళీమళ్ళీ మనం దానిని గురించి చర్చించాలి. ఎందుకంటే మనం దానిని ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నాం కదా.*

*కామం, క్రోధం అనేవి ప్రతి మనిషికి బద్ద శత్రువులు. మనిషికి మొదట ఇష్టం లేకపోయినా పాపకార్యాలు చేసేటట్లు ఈ రెండూ బలపరుస్తాయి. కామక్రోధాలను అదుపులో ఉంచుకున్నట్లయితే పాపం చేయాలనే ఆలోచన కలగదు. ఏ వస్తువునైనా తీవ్రంగా కోరుకోవటం కామమైతే, ఆ వస్తువు లభించకపోతే లేదా దానిని కోల్పోతే క్రోధం వస్తుంది.*.         

No comments:

Post a Comment