*ఒకే కొమ్మకి వేరు వేరు పూవులు :*
*పాణినీ, వరరుచీ అన్నదమ్ములు. ఒక మహా పండితుడి కొడుకులు.*
*ఇద్దరూ అఖండమైన తెలివైన వాళ్లు. వాళ్ల దురదృష్టవశాత్తూ ఇద్దరూ ఏడెనిమినిదేళ్ల వయసులో ఉన్నప్పుడు, పడవ ప్రమాదంలో తల్లితండ్రులు ఇద్దరూ ఒకేసారి మరణించేరు.*
*పెద్దలు ఎవరూ లేకపొడం దగ్గర బంధువులు తక్కువ గా ఉండడం చేత పిల్లల బాధ్యత తీసుకుందికి ఎవరూ ముందుకు రాలేదు.*
*ఆఖరికి గ్రామపెద్దే రోజుకొక ఇంటి చొప్పున వారం ఇవ్వాలి, భోజనం పెట్టలేనివారు, బట్టలు పుస్తకాల ఖర్చు ఏడాదికి ఒకసారి పెట్టుకోవాలి అని నిర్ణయించేడు.*
*పాణిని, వరరుచి గ్రామపెద్ద ఆదేశం ప్రకారం ఆయన ఏర్పాటు చేసిన చిన్నగదిలో ఉంటూ వారాలు చేసుకుంటూ, చదువుకోడం ప్రారంభించేరు.*
*చాలా కష్టాలు పడ్డారు. తల్లి తండ్రులు ఉన్నప్పుడు చూసినట్టుగా ఏ ఇల్లాలూ చూడటం లేదు. బలవంతాన ఇంత తిండి పెడుతున్నారంతే!*
*పాణినికి ఓరిమి ఎక్కువ. వరరుచి తప్పదు అనుకుంటూ భరిస్తున్నాడు. అన్నం పెట్టే వారి విసుగులూ, ఏ రాత్రి మిగిలినవో పెట్టడాలు, పుస్తకాలు పాతవి కొనడాలు, బట్టలు కూడా తమ పిల్లలకి పాతబడినవే ఇవ్వడం ఇవి పాణినీ, వరరుచీ ఇద్దరూ మర్చిపోలేకపొతున్నారు.*
*చదువులో అగ్రగణ్యులు కనక అక్కడ మంచి పేరు తెచ్చుకొనే వారు.*
*ఇద్దరూ పెద్దవాళ్లయేరు. విద్య పూర్తి అయింది.*
*వరరుచి బస్తీలో మంచి కొలువు సంపాదించుకొని దానితో ఆగక ఇంకోపక్క వడ్డీ వ్యాపారం మొదలెట్టేడు.*
*పాణిని, సరకులు ఎగుమతి దిగుమతి వ్యాపారం కొంతకాలం చేసి కొంత డబ్బుకూడ పెట్టి తన స్వగ్రామంకి తిరిగి వెళ్లిపోదాం అనుకున్నాడు.*
*వరరుచి అన్నతో విభేదించేడు. పాణిని పట్టించుకోకుండా తన గ్రామం తిరిగి వెళ్లి పోయి, ముందు గ్రామపెద్ద దర్శనం చేసుకొని తను ఆ గ్రామంలోనే విద్యా మందిరం నడుపుతానని అనుమతి తీసుకున్నాడు.*
*తన దగ్గర ఉన్న ధనం వెచ్చించీ కొన్ని ఎకరాల భూమి, కొన్ని పళ్ళతోటలూ, కూరల పెరళ్లూ కొనుగోలు చేసేడు. కొంత ఖాళీ జాగాలో చిన్నపాటి ఇల్లు వేసుకొని తన కోరిక మేరకు విద్యాలయం అరంభించేడు.*
*విద్యాలయం ప్రారంభానికి వచ్చిన వరరుచి అన్న అభిరుచులు, ఆదర్శాలు చూసి కొంత వాదన పెట్టుకున్నాడు. మన చిన్నతనంలో పడ్డ కష్టాలు మన పిల్లలు పడ రాదంటే, డబ్బు సంపాదించాలి గానీ ఇలా ఉచిత సేవలు తప్పని వాదించేడు. పాణిని నవ్వి ఊరుకున్నాడు.*
*'శారదా విద్యాలయం' మొదలయింది. వరరుచి తన వడ్డీ వ్యాపారం ముమ్మరం చేసేడు. చాలా కొత్త కొత్త వ్యాపారాలు కూడా మొదలెట్టేడు. చాలా ధనవంతుడయేడు. కొన్నేళ్ళు గడిచేయి.*
*అతని పిల్లలు పెద్దవాళ్లు అయిన దగ్గరనించీ, విలాస వంతమైన జీవితంకి అలవాటు పడి చదువులో బాగా వెనక పడ్డారు.*
*అనుకోకుండా ఒక రోజు అప్పులు తీసుకుందికి వచ్చిన వాళ్ళు వెనకాల అతనిని చాలా తిట్టడం అతను చాటుగా విన్నాడు.*
*"వీడికన్నా నక్షత్రుకుడు నయం! పాపం ఒక పిల్లాడు వారాలు చేసుకొని చదువుకొని, కళాశాల ఖర్చుకని కొంచెం అప్పుచేసేడు. దానికి చక్రవడ్డీ వేస్తే, వాడు తీర్చలేక ఆత్మహత్య ప్రయత్నం చేసేడు. వాడికిగానీ ఏమన్నా అయితే ఆ వుసురు వీడికి తగలదా?" అనుకుంటున్నారు.*
*ఆ రోజే ఎంతో నమ్మకంతో ఒక శాఖ అప్పచెప్పిన పనివాళ్ళు మోసం చేసి లాభాలు పట్టుకొని పరారీ అయిపోయేరు.*
*అప్పుడే పిల్లలు చదువుకుంటున్న విద్యాసంస్థ నించీ పిల్లల ప్రవర్తన ఏమీ బాగాలేదని లేఖ వచ్చింది.*
*అన్ని దెబ్బలు ఒకేసారి తగిలేసరికి వరరుచి క్రుంగిపోయేడు. ఆ రోజు అతనికి కాళ రాత్రే అయింది. ఒక్క సారి తన బాల్యం, అన్న గురుతుకు వచ్చేరు.*
*తెల్లవారి లేచి తన స్వగ్రామానికి ఒక్కడూ వెళ్ళేడు.*
*అన్న పేరు చెప్పేసరికే అందరూ చేతులెత్తి దండాలు పెడుతున్నారు. ఇంటికి వెళ్లి అక్కడ దృశ్యం చూసి ఇంకా ఆశ్చర్యపడ్డాడు. కుటీరాల్లాటి చక్కటి తరగతి గదులు. మంచి ఇస్త్రీ బట్టలు కట్టుకొని కొత్తగా ఉన్న పుస్తకాలతో చక్కగా చదువుకుంటున్న పిల్లలు.*
*"అన్నపూర్ణా భోజన మందిరం" అన్న పేరుతో వంటశాల. వేడి వేడిగా వంటలూ, వడ్డనలూ! పిల్లలకి ప్రేమగా వడ్డిస్తూ 'ఇంకొంచెం తినండి' అంటూ బతిమాలి తినిపిస్తున్న ఆడవాళ్ళూ. స్వయంగా పర్యవేక్షిస్తూన్న తన వదినగారూ కనబడ్డారు.*
*ఇవన్నీ చూస్తూ కళ్ళనీరు కారుస్తున్న వరరుచి భుజంమీద ఆప్యాయంగా ఒక చెయ్యి పడింది. చూస్తే తన అన్న పాణిని. ఏడుస్తూ వరరుచి కాళ్ళమీద పడ్డాడు. పాణిని అతన్ని ముందు ఏడవనిచ్చీ, తరవాత అంతా విన్నాడు.*
*వరరుచి భోరుమంటూ, "అన్నా! నా తప్పేమిటి? మనలా మన పిల్లలు బాధ పడకూడదు. వాళ్లకి ఏ లోటూ లేకుండా ఉండాలి అని అనుకొని సంపాదించడం తప్పా?" అన్నాడు.*
*పాణిని "తమ్ముడూ తప్పు అంటూ ఏదీలేదు. ఒకే కష్టాలకి ఇద్దరం వేరు వేరుగా ఆలోచించేం. నువ్వు 'భవిష్యత్తులో అలా నీ పిల్లలు బాధ పడకూడదు' అనుకున్నావు. నేను, 'అలా కష్టపడే పిల్లలకి ఆసరాగా ఉండాలి' అనుకున్నాను. మన మనస్తత్వమే దీనికి కారణం. మనం ఒకే కొమ్మకి పూచిన వేరు వేరు పూవులం" అన్నాడు.*
*వరరుచి సావధానంగా ఆలోచించి, "అన్నా! నేను రెండు రోజుల్లో నా పిల్లలనీ, నా మూలంగా మంచాన పడ్డ కుర్రాడిని తెచ్చి నీ పాఠశాలలో ఉంచుతాను! ఒక్క నెల రోజుల్లో అక్కడ శాశ్వతంగా తెంపు చేసుకొని మీ మరదలితో కలిసి వచ్చేస్తాను. ఇహ చావో, రేవో ఇక్కడే!" అని అన్నాడు.*
*పాణిని చిరునవ్వుతో, "అలాగే, ముందు భోజనానికి పద! మీ వదిన మనకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎన్నాళ్లకయిందో మనం కలిసి భోజనం చేస" అన్నాడు.*
*వరరుచి తేలిక పడ్డ మనసుతో అన్న చెయ్యి పట్టుకొని ముందడుగు వేసేడు.*
*సమాప్తం.*
No comments:
Post a Comment