Thursday, November 20, 2025

 *ఒక ఊర్లో శంభుదాసు, వాచాలయ్య అనే ఇద్దరు పేదవారు పక్క పక్క ఇళ్ళలో ఉండేవారు. ఇద్దరికీ సంతానం ఎక్కువే!*

*సంసారం నడపడం చాలా‌ కష్టంగా ఉండేది.‌‌ ఎంత శ్రమపడ్డా దినం గడవడం దుర్లభం అయేది.*

*అందులో శంభుదాసు ఓర్పుతో, శాంతంగా మంచిరోజు వస్తుందనే ఆశాభావంతో ఉండేవాడు.‌*

*వాచాలయ్యకి కోపం ఎక్కువ. కోపం వస్తే ఎలాటి భాష వాడతాడో అతనికే తెలీదు. శంభుదాసు ఎంత చెప్పి చూసినా వాచాలయ్య వినేవాడు కాదు.*

*ఒకసారి ఒక సన్యాసి‌ ఆ ఊరు వచ్చి కొన్నాళ్ళు ఉండి ప్రజలకి తత్వబోధ చేయడం మొదలు పెట్టేడు. శంభుదాసు, వాచాలయ్య కలిసి సన్యాసి దర్శనం చేసుకొని, ఇలా అన్నారు.*

*"స్వామీ! మాకు సంసారం నడపడం చాలా కష్టంగా ఉంది. ఆకలి బాధతో మేం ఎలా తత్వ బోధ వినగలం? మాకు మీరే ఏదైనా ఉపాయం చెప్పండి" అని అడిగేరు.*

*సన్యాసి వారినిచూసి జాలి పడి, "నాయనలారా! ఎవరి కర్మ ఫలం‌వారు అనుభవించి తీరాలి. అయినా మీకు ఒక మంత్రం చెప్తాను. మీరు అడవిలో, ఈ మంత్రం నిష్టగా జపిస్తే బ్రహ్మ అనుగ్రహం‌ పొందే అవకాశం ఉంది." అంటూ ఇద్దరికీ వారి చెవిలో మంత్రోపదేశం చేసేడు.*

*మిత్రులిద్దరూ, సంతోషంతో అడవి దారిపట్టి, సన్యాసి చెప్పినట్టే మంత్రం జపించడం మొదలెట్టేరు.*

*కొంతకాలానికి, బ్రహ్మ ప్రత్యక్షమై, "మీ మనసులో ఏముందో నాకు తెలుసు! నేను మీకు చెరి మూడు కొబ్బరికాయలు ఇస్తాను. మీరు మీ ఇంట్లో కొబ్బరికాయ కొడుతూ ఏ కోరిక కోరుకుంటారో, అది తీరుతుంది. గురుతుంచుకొండి. కొబ్బరి కాయకొడుతూ మాత్రమే అడగాలి" అని ఇద్దరికీ మూడేసి కొబ్బరి కాయలు ఇచ్చి మాయం అయిపోయేడు.*

*మిత్రులిద్దరూ, సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేరు. శంభుదాసు శుచిగా దేవుడి మందిరంలో కూచొని కొబ్బరి కాయలని పూజించి, ఒక కొబ్బరి కాయ కొడుతూ, తనను మహాలక్ష్మి దీవించి సదా ఐశ్వర్యవంతుడిగా ఉంచాలని కోరేడు.*

*వెంటనే, అతని కోరిక తీరి కష్టాలు తీరిపోయి పిల్లలు, భార్యా ఆనందం పొందేరు.*

*మిగిలిన రెండు కొబ్బరి కాయలూ శంభుదాసు పూజగదిలో భద్ర పరిచేడు.*

*ఇహ వాచాలయ్య శుచిగా కొబ్బరికాయలని పూజించి కొబ్బరికాయ కొట్టబోతూ ఉంటే, అతని భార్య గట్టిగా కేకలు పెడుతూ ఇన్నాళ్లై ఎక్కడికి పోయేవు? మేం ఏమవాలి? అని అరవడం మొదలెట్టింది.‌ ఆమెది బొంగురు గొంతుక.*

*ఆ కేకలకి కోపోద్రిక్తుడై వాచాలయ్య, "దీనికి నోరు మాయం అవా!" అంటూ ఒక కొబ్బరి కొట్టేడు.*

*అంతే! భార్య నోరు భాగం మాయం అయింది.‌ పిల్లలు ఆమెని చూసి భయపడి దూరం పారిపోయేరు. దాంతో ఆమెకి ఇంకా కోపం‌ ఎక్కువై, గిన్నెలు విసరడం ప్రారంభించింది.‌*

*హడలి పోయిన వాచాలయ్య, ఇంకో కొబ్బరి కాయ కొడుతూ "ఇల్లూ, వాకిలీ దీని నోరే అవా!" అన్నాడు.*

*ఇంకేముంది, ఇల్లూ వాకిలీ‌ ఆమె నోర్లు వచ్చేసేయి. అన్ని నోర్లతో ఆమె అరుస్తూ ఉంటే ఊరే, భయంకరంగా దద్దరిల్లి‌పోయింది.‌ రాజ భటులు ఇంటి మీదకి ఆయుధాలతో రాడం మొదలెట్టేరు.* 

*అది చూసి వాచాలయ్య మూడో కొబ్బరికాయ కొడుతూ, 'దీని నోరు మామూలుగా అవాలి' అని కోరేడు..*

*దాంతొ,‌ అతని భార్య మామూలుగా మారింది‌ గానీ కొబ్బరికాయలు మూడూ చెల్లి పోయేయి.*

*వాచాలయ్య భార్యకి జరిగింది చెప్పి, వగచేడు. ఇదంతా తెలిసి శంభుదాసు మిత్రుడి ఇంటికి వచ్చేడు.*

*వాచాలయ్య అతనిని చూసి కన్నీరు మున్నీరు అయేడు.*

*శంభుదాసు ఎంతో మృదువుగా, "మిత్రుడా, ఇందుకే అన్నీ‌తెలిసిన పెద్దలు, మాట కరకు ఉండరాదు. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది అని చెప్పేరు. భారతంలో కూడా, 'వాక్పరుషము కూడదు' అన్న నీతి ఉంది. ఇహ‌ మీదనయినా నువ్వు మారితే నీకూ పిల్లలకీ మంచిది. నీ సంసారానికి అవసరం అయిన ధన సహాయం నేను చేస్తాను. దిగులు పడకు" అని బోధించి కొంత ధన సహాయం చేసి మరీ వెళ్లేడు.*

*వాచాలయ్య సిగ్గుపడి తన ధోరణి మార్చుకొని, మంచి మాటలే మాటాడుతూ  "వాచాలయ్య కాదు మంచి వచనాలయ్య " అనే మంచి పేరు తెచ్చుకున్నాడు.*

*శంభుదాసు కూడా పేదసాదలకి, ధన సహాయం చేస్తూ, తన పిల్లలకి*
*"ఈ రోజు ఐశ్వర్యవంతులం అయినా, గర్వం పనికిరాదు అంతేకాదు, కష్టపడి సంపాదిస్తూ, దానధర్మాలు చేస్తూ నిరాడంబరంగా బతకాలి"  అని బోధచేసి,‌ అందరి అభిమానం సంపాదించేడు.*

No comments:

Post a Comment