💐17శ్రీ లింగ మహాపురాణం💐
🌼పంచ బ్రహ్మ మూర్తులు - శివుని అఘోర ఈశాన అవతారములు🌼
#పదహేడవ భాగం#
🌷అఘోరావతారం🌷
పీతవాస కల్పము తరువాత అసిత కల్పము ప్రారంభమైంది. వేయి దివ్య సంవత్సరాలు అవాంతర ప్రళయం లో చీకటిలో గడిచిపోయింది. బ్రహ్మ మేల్కొని సృష్టి చేయ సంకల్పించి పరమేశ్వరుని ప్రార్థించాడు. నల్లటి శరీర రంగుతో నల్లటి వస్త్రాలు, యజ్ఞోపవీతం, నల్లటి పూల హారం ధరించిన దివ్య పురుషుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షమైనాడు.
పరమేశ్వరుని అవతారం గా భావించిన బ్రహ్మదేవుడు "అఘోరుడు" అనే నామంతో గుర్తించి ధ్యానించాడు. అఘోరుడి పార్శ్వం నుంచి నల్లటి వర్ణంతో కృష్ణుడు, కృష్ణశిఖుడు, కృష్ణాస్యుడు, కృష్ణవస్త్రథృకుడు అనే నలుగురు పుత్రులు ఇవిర్భవించారు. వారు అఘోరుడి శిష్యులై శివధ్యాన యోగము అభ్యసించారు.
వేయి దివ్య సంవత్సరాలు నలుగురు శివధ్యాన యోగము ఆచరించి తమ శిష్యులకు బోధించి లోకమంతా వ్యాప్తి చేశారు. తరువాత శివ సాయిజ్యం పొంది శివునిలో లీనమయ్యారు.
శివ స్వరూపుడైన అఘోర మూర్తి బ్రహ్మను చూసి "బ్రహ్మదేవా! నా అఘోర మంత్రం మహిమాన్వితమైనది. మనసా వాచా కర్మణా చేసిన పాపాల్ని, బుద్దిపూర్వంగా చేసిన పాపాలను అఘోర మంత్ర జపం ద్వారా నశింప చేసుకొనవచ్ఛును" అని అఘోర మంత్రం ఉపదేశించాడు.
అఘోర మంత్రం :
అఘోరేభ్యో2థ ఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్యః |
సర్వేభ్య స్సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు విశ్వరూపేభ్యః ||
ఈ మంత్రాన్ని లక్ష సార్లు జపం చేస్తే బ్రహ్మహత్యాది పాతకాలు నశిస్తాయి. యాభై వేల సార్లు జపిస్తే వాక్కుతో (మాటలతో) చేసిన పాపాలు నశిస్తాయి. యాభై వేల సార్లు చేస్తే మనస్సుతో చేసిన పాపాలు నశిస్తాయి. బుద్ది పూర్వకంగా చేసిన పాపాలు యాభై వేల సార్లు జపిస్తే పోతాయి.
తెలిసి చేసిన పాపాలు నాలుగు లక్షల సార్లు జపం చేస్తే నశిస్తాయి. కోపంతో కావాలని చేసిన పాపాలు పోవాలంటే ఎనిమిది లక్షల సార్లు జపించాలి. వీరుని దొంగదెబ్బ తీసి చంపినవాడు లక్ష సార్లు జపించాలి. భ్రూణ హత్య, మాతృ హత్య చేసినవాడు కోటి సార్లు జపం చేయాలి. గోహత్య, స్త్రీహత్య చేసినవాడు, కృతఘ్నుడు పాపం పోవాలంటే పది లక్షల సార్లు జపం చేయాలి.
ఇష్టం లేకపోయినా ఇతరుల బలవంతం మీద మద్యపానం చేసినవాడు పాపం పోవడానికి లక్ష సార్లు జపం చేయాలి. స్నానం చేయకుండా భోజనం చేసిన వాడు, జపం చేయకుండా హవనం చేయకుండా భోజనం చేసినవాడు, దేవతలకి అతిథులకి పెట్టకుండా భోజనం చేసినవాడు పదివేల సార్లు మంత్ర జపం చేసి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొన వచ్చును.
బ్రాహ్మణుల ధన సంపదలు అపహరించిన వాడు, బంగారం దొంగిలించిన వాడు లక్ష సార్లు మంత్ర జపం చేస్తే పరిశుద్దుడు అవుతాడు. నిత్యం అఘోర మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తూ ఉంటే మానవుడు పాపాల నుండి విముక్తి పొందుతాడు.
ఈశాన అవతారం :
విశ్వరూప కల్ప ప్రారంభంలో సృష్టి ఆరంభించే ముందు బ్రహ్మదేవుడు పరమేశ్వరుని పుత్రుని కోసం ప్రార్థించాడు. బ్రహ్మ ప్రార్థన మన్నించి పరమేశ్వరుడు ఈశానుడు అనే నామంతో బ్రహ్మకు పుత్రుడిగా ఆవిర్భవించాడు. ఆయన పాటు విశ్వరూప అనే దివ్య వాణి(స్త్రీ) కూడా ఆవిర్భవించింది.
బ్రహ్మదేవుడు ఈశానుని స్తుతించిగా ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు. బ్రహ్మదేవుడు "ఈశాన దేవా! నీతో పాటు ఆవిర్భవించిన ఈ దివ్యవాణి ఎవరు? నాలుగు ముఖాలు, నాలుగు హస్తాలు, నాలుగు నేత్రాలు, నాలుగు పాదాలు, నాలుగు కోరలతో ప్రకాశిస్తున్న ఈ దివ్యవాణి విశ్వరూప అని ఎలా చెబుతున్నారు? ఈమె అసలు ఎవరు? ఈమె నామధేయం ఏమిటి?" అని అడిగాడు.
ఈశానుడు చిరునవ్వుతో "బ్రహ్మదేవా! నేను చెప్పేది చాలా గుప్తమైన విషయం. ఇప్పుడు విశ్వరూప కల్పము జరుగుతోంది. నా గురించి నీవు ప్రార్థన చేసిన ఈ ప్రదేశము బ్రహ్మస్థానముగా పిలవబడుతుంది. నీకన్నా గొప్పవాడైన మహావిష్ణువు నా ఎడమ భాగం నుండి ఆవిర్భవించి వైకుంఠం అనే గొప్ప స్థానంలో ఉంటూ సృష్టి పరిరక్షణ చేస్తుంటాడు.
ఇది ముప్ఫై మూడవ కల్పము. అనేక వందల కల్పాలు ముందు ముందు వస్తాయి. ఈ దివ్యవాణి గోమాత రూపంలో కనపడే దేవత ఆదిశక్తి అని, ఆనందమయి అని, విద్యాదేవత అని, ప్రకృతి అని వ్యవహరించబడుతోంది. మాండవ్య గోత్రుడు, ఈశానుడు అయిన నేను నీవు చేసే సృష్టికి సహకరిస్తాను.
నీవు ఒక విషయం గ్రహించాలి. ఈశానుడికి ప్రకృతికి బేధం లేదు. ఇరువురం ఒకటే. సృష్టి నిమిత్తం ఇరువురమైనాము. సృష్టి కోసం నేను నీకు ముప్పై రెండు సద్గుణాలను ప్రసాదిస్తున్నాను. అవి ఏమిటంటే
1)చిత్తవృత్తి నిరోధం 2)సాంఖ్య యోగం 3)తపస్సు 4)విద్య 5)విధి 6)క్రియ 7)ఋతం (ప్రియ సంభాషణ) 8)సత్యం 9)దయ 10)బ్రహ్మం 11)అహింస 12)సన్మతి 13)క్షమ 14)ధ్యానం 15)ధ్యేయం 16)దమం (ఇంద్రియ నిగ్రహం) 17)శాంతి 18)విద్య 19)అవిద్య 20) మతి 21)ధృతి (ధైర్యం) 22)కాంతి 23)నీతి 24)ప్రథ (ప్రసిద్ధి) 25) మేధ 26)లజ్జ (లోకాపవాదానికి భయపడటం) 27)దృష్టి (దివ్య జ్ఞానం) 28) సరస్వతి 29)తుష్టి (సంతోషం) 30)పుష్టి (ఇంద్రియ పటుత్వం) 31)క్రియ (వేరవిహితమైన కర్మ) 32)ప్రసాదం (మనస్సు ప్రసన్నంగా ఉండటం)
ఈ గుణాలన్ని ఆదిశక్తి అనే మూల ప్రకృతి ద్వారా మహావిష్ణువుకి, నీకు సంక్రమించాయి. కనుక నీకు, శ్రీహరికి, ఇంద్రాది దేవతలకి నాతో పాటు ఆవిర్భవించిన దివ్యవాణి మూలప్రకృతి మాతగా కన్పిస్తోంది. ఈ మూల ప్రకృతిని గౌరి, మాయ, విద్య, కృష్ణ, హైమవతి, ప్రధానం, ప్రకృతి అనే నామాలతో పండితులు పిలుస్తారు.
బ్రహ్మదేవా! జన్మ అనేది లేనిది, ఎరుపు, తెలుపు, నలుపు వర్ణాలు కలది, సత్త్వ రజో తమో గుణాలను అనుసరించి ప్రజలను సృష్టించేది అయిన ఆదిశక్తిని విశ్వరూపడైన నేను అధిష్టించి ఉంటాను. ఇటువంటి మూల ప్రకృతిని గాయత్రి అని, దివ్యవాణి అని రూపంతో ఆవిర్భవించిన గోమాత అని, విశ్వరూప అని, మూల ప్రకృతి అని తెలుసుకొనుము" అని ఈశానుడు బ్రహ్మకు విశ్వరూప గురించి చెప్పాడు.
తరువాత ఈశానుడి పార్శ్వ భాగం నుండి జటి, ముండ, శిఖండి, అర్థముండి అనే నలుగురు శిష్యులు ఉద్భవించారు. వీరు శివధ్యాన యోగము ఆభ్యసించి, శిష్యులకు ఉపదేశించి లోకమంతా వ్యాపించేలా చేశారు. వేయి దివ్య సంవత్సరాలు పరమేశ్వరుని ఈశానుడిగా ఉపాసించి పునర్జన్మ రహితమైన శివసాయిజ్యం పొందారు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
No comments:
Post a Comment