1️⃣0️⃣3️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*4. జ్ఞాన యోగము.*
(నాలుగవ అధ్యాయము)
*17. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోధ్ధవ్యం చ వికర్మణఃl*
*అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిఃll*
కర్మలు మూడు విధములు. మొదటిది కర్మ అంటే ప్రతి వాడూ చేయతగిన పని. దీనినే విహిత కర్మ అని కూడా అంటారు. అంటే చేసే వాడికి, ఎదుటి వాడికి, హితమును, మంచిని, మేలును చేకూర్చే కర్మ. రెండవది వికర్మ అంటే చేయకూడని కర్మ. అంటే నిషేధించబడిన కర్మ. చేయకూడని, నేరపూరితమైన, అవినీతి కరమైన, అసాంఘికమైన కర్మ. మూడవది అకర్మ చేయవలసిన పని చేయకపోవడం. ఏ పనీ చేయకుండా సోమరిగా ఉండటం. వేదాంతానికి వక్రభాష్యం చెప్పేవారు ఈ పని చేస్తుంటారు. అన్ని దేవుడే చూసుకుంటాడు, నారుపోసిన వాడు నీరు పోయకపోతాడా అని చేతులు ముడుచుక్కూర్చుంటారు. తమ సోమరి తనానానికి వేదాంతాన్ని అడ్డం పెట్టుకుంటారు.
పరమాత్మ ఈ మూడు రకములైన కర్మలను చెప్పి, ఈ మూడు రకములైన కర్మల యొక్క తత్వమును తెలుసుకోవడం చాలా కష్టము. ఎందుకంటే ఇది చాలా లోతైన జ్ఞానము అని అన్నాడు. అందుకే పరమాత్మ ఇక్కడి నుండి కర్మలయొక్క తత్వములను గురించి, విశిష్ఠతను గురించి వివరిస్తున్నాడు. ఏదో పుట్టాము పెరుగుతున్నాము మంచో చెడో కర్మలు చేస్తున్నాము. ఇష్టమైన దేవుళ్లను ఆరాధిస్తున్నాము, ఆరాధనకు తగిన ఫలములను పొందుతున్నాము, సంసారంలో పడి ఈదుతున్నాము తుదకు మరణిస్తాము అని అనుకోకుండా, కర్మల యొక్క రహస్యములను తెలుసుకొని, ఏ కర్మలు చేస్తే ఈ సంసార బంధనముల నుండి విముక్తి పొందుతామో తెలుసుకోవాలనే అభిలాష కలవారికి పరమాత్మ యొక్క ఈ వివరణ ఉపయోగపడుతుంది.
కర్మణో గతిః అంటే కర్మ యొక్క గతి. అంటే పోకడ, స్వభావము, కర్మ ప్రవర్తించే తీరు. కర్మ మనకు ఇచ్చే ఫలితము దీని గురించి తెలుసుకోవడం. గహనా అంటే అత్యంత రహస్యమైనది. అంటే ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచారని కాదు. అర్థం చేసుకోవడం కష్టము. అంత సులభంగా అర్థం కాదు. ఎక్కడో చదువుకుంటే తెలిసేది కాదు. గురువు ద్వారా నేర్చుకోవలసినది అని అర్థం.
ఎలాగంటే మనం అందరం పుట్టినప్పటి నుండి కర్మలు చేస్తూనే ఉన్నాము. చేయాల్సిన కర్మల కన్నా చేయకూడని కర్మలే ఎక్కువ చేస్తున్నాము. చేసి బాధపడుతున్నాము. పశ్చాత్తాన పడుతున్నాము. కానీ మరలా అదే చేస్తున్నాము. కాని కర్మ స్వభావం ఏమిటి, కర్మలు ఎలా చేయాలి అని తెలుసుకోడానికి ప్రయత్నించలేదు. తప్పుచేసి బాధపడటం తప్ప, దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. దృష్టి పెట్టలేదు. ఆ కర్మల యొక్క జ్ఞానం గురించి పరమాత్మ వివరంగా తెలియజేస్తున్నాడు.
*18. కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః||*
*స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్||*
ఎవరైతే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూస్తుంటాడో, అతడు వివేకము కలవాడు, యుక్తుడు అని అనబడతాడు. అతడు సకలకర్మలను ఆచరించిన వాడు అవుతాడు.
కర్మ అకర్మ అనే రెండు రకములైన కర్మలు పైన చెప్పారు. కర్మ అంటే విహిత కర్మ అంటే చేయవలసిన కర్మ చేసినందు వలన హితమును కూర్చే కర్మ. రెండవది అకర్మ అంటే ఏ పనీ చేయకుండా ఉండటం. ఇప్పుడు పరమాత్మ కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూడాలి అని అంటున్నాడు. అటువంటి వాడు జ్ఞాని, వివేక వంతుడు, యుక్తుడు. అటువంటి వాడు కృత్స్న కర్మ కృత్ అంటే అన్ని కర్మలు చేసినట్టే అని అన్నాడు.
ఇది కొంచెం కన్ప్యూజన్గా ఉంది కదూ. వివరంగా తెలుసుకుందాము. మనం ఇది వరకే చెప్పుకున్నాము. ప్రతి వాడికీ అహంకారము ఉంటుంది అనీ, ఈ పని నేను చేస్తున్నాను నేను తప్ప వేరే ఎవరూ ఈ పనిచేయలేరు. నేను చేసే ఈ పనికి ఈ ఫలితం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. దీనిని కర్తృత్వ భావన, ఫలాపేక్ష అని అంటారు. ఈ రెండు భావనలతో కర్మ చేస్తే ఆ కర్మలు బంధనములను కలుగచేస్తాయి. ఈ కర్తృత్వ భావన లేకుండా, ఫలాపేక్ష లేకుండా, అనాసక్తంగా కర్మలు చేస్తే ఎటువంటి బంధనములు అంటవు. అటువంటి కర్మలు చేసినా చేయనట్టే లెక్క. దీనినే కర్మలో అకర్మను చూడటం. కర్మచేస్తున్నాడు కానీ ఏకర్మా చేయనట్టే ఉంటున్నాడు. అన్నీ భగవంతునికి అర్పిస్తున్నాడు. భగవంతుని పరంగా చేస్తున్నాడు. ఈ భావన ప్రతి వాడికీ రావాలి. కాబట్టి గొప్ప వారు, ముముక్షువులు లోకంలో కర్మలు చేస్తుంటారు. కాని నిష్కామంగా, కర్తృత్వభావన లేకుండా చేస్తుంటారు. కాబట్టి వారు ఏ కర్మా చేయనట్టే అవుతుంది. కానీ వారు కర్మలు చేసినట్టు కాదు. ఆ కర్మల వలన వారికి ఎటువంటి బంధనములు కలుగవు. దీనిని తెలుసుకోవడమే కర్మలో అకర్మను చూడటం.
ఇంకా వివరంగా చెప్పాలంటే నేను చేస్తున్నాను అనే అహంకారంతో, కర్తృత్వబుద్ధితో, ఆసక్తితో, సంగమంతో, చేసే కర్మలే బంధనములు కలుగచేస్తాయి. కానీ, నిరాసక్తంగా, నిష్కామంగా చేసే కర్మ ఎటువంటి బంధనములను కలుగచేయదు. ఈ ప్రకారంగా ఎవరైతే కర్మలో అకర్మను చూస్తారో, అతడే జ్ఞాని, వివేకవంతుడు, యుక్తుడు అని పిలువబడతాడు. నిష్కామకర్మ చేయడం ద్వారా, నిరాసక్తంగా కర్మలు చేయడం ద్వారా జ్ఞానం వస్తుందనీ, చిత్తశుద్ధి, ఆత్మతత్వము, నిశ్చయాత్మకబుద్ధి అలవడుతుందని అదే ముక్తికి మార్గము అనీ తెలుసుకున్నాము. దానికి మూలమే ఈ కర్మలో అకర్మను చూడటం.
ఇంక రెండవది. అకర్మలో కర్మను చూడటం. పుట్టిన ప్రతి మానవుడు కర్మచేయక తప్పదు. మానవులు ఇది వరకు ఎన్నో జన్మలు ఎత్తారు. ప్రస్తుతం మానవ జన్మలో ఉన్నారు. ఇంతకు ముందు జన్మలలో ఎన్నో కర్మలు చేసి ఆ కర్మల తాలూకు వాసనలను తమతోపాటు తెచ్చుకుంటారు. అవి ఈ జన్మలో అనుభవిస్తుంటారు. వాటికి తోడు ఈ జన్మలో కూడా ప్రాపంచిక విషయములలో లీనమై కొత్త కర్మలు చేస్తుంటారు. మరి కొందరు సోమరులుగా ఉండి ఏ పనీ చేయకుండా ఉంటారు. ఏ పనీ చేయక పోవడం అకర్మ అని మనం చెప్పుకున్నాము. వాస్తవానికి ఇది అకర్మ కాదు. ఎందుకంటే కేవలం ఇంద్రియములతో కర్మలు చేయనంత మాత్రాన కర్మలు ఏమీ చేయనట్టు కాదు. వారి మనసులలో సంకల్పములు, కోరికలు, పూర్వజన్మ వాసనలు సుడులు తిరుగుతుంటాయి. శరీరం మాత్రం ఒకచోటనే ఉంటుంది. మనసు ప్రపంచం అంతా విహరిస్తూ ఉంటుంది. కోరికలతో సతమతమౌతూ ఉంటుంది. ఇదే అకర్మలో కర్మ చేయడం, మానసిక కర్మలు కూడా బంధనములకు కారణం అవుతాయి. వాసనలను కలుగజేస్తాయి. మరుజన్మకు కారణం అవుతాయి. కాబట్టి మనసును కూడా నిరోధించడం ముఖ్యం. కేవలం ఇంద్రియములను నిగ్రహించినంత మాత్రాన ఏమీ కాదు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం మన బాబాలు, సన్యాసులు. వారు కేవలం కాషాయాలు ధరించి మఠంలో నీ ఆశ్రమంలో కూర్చుంటారు. కాని వారి మనసులు ప్రాపంచిక విషయములలో విహరిస్తుంటాయి. మానసికంగా విషయ సుఖములను అనుభవిస్తుంటారు.
(సశేషం)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P243
No comments:
Post a Comment