Thursday, November 20, 2025

 💐14శ్రీలింగమహాపురాణం💐

🌼వాయు, ఆకాశ, ఇంద్ర, చంద్ర, ప్ర జాపతి, బ్రహ్మ, యౌగిక శక్తులు🌼

       #పద్నాలుగవ భాగం#

వాయుతత్త్వానికిసంబంధించిన ఎనిమిది యౌగిక శక్తులు  ఉన్నాయి. 1)మనోవేగంతో పయనించే శక్తి 2)ఇతర ప్రాణుల శరీరాలలో ప్రవేశించే శక్తి (పరకాయ ప్రవేశం) 3)పర్వతం వంటి భారిీ వస్తువులను భుజాలపై మోయగల శక్తి 4)అతి తేలిక అయ్యే శక్తి 5)అతిభారము అయ్యే శక్తి 6)గాలిని చేతులలో ధరించగలిగే శక్తి 7)వ్రేలి చివరభాగంతో భూమిని కదిలించగలిగే శక్తి 8)వాయువుతో ఎటువంటి వస్తువునైనా సృష్టించగలిగే శక్తి 

ఆకాశ తత్త్వ శక్తులు ఎనిమిది. వీటిని ఇంద్ర శక్తులని కూడా అంటారు. 1) తన నీడ లేకుండా ఉండగలిగే శక్తి 2(సూక్ష్మ తత్త్వములను చూడగలిగే శక్తి 3) తలచినంత మాత్రము చేత ఏ వస్తువునైనా పొందగలిగే శక్తి 4)ఎంత దూరము నుంచి అయినా శబ్దాన్ని వినగలిగే శక్తి 5)సూక్ష్మ తత్త్వముల చేత శరీరము ధరించే శక్తి 6)ఎక్కడ ఉన్నా సర్వ ప్రాణులను చూడగలిగే శక్తి 7)ఆకాశంలో నడవగలిగే శక్తి 8) ఎట్టి ధ్వనినైన గ్రహించ గలిగే శక్తి. ఇంద్రునికిఈఎనిమిది శక్తులు ఉండటం చేత వీటిని ఐంద్ర శక్తులు అంటారు.

చంద్రునికి సంబంధించిన ఎనిమిది యౌగిక శక్తులు. 1)కోరిన వారిని పొందగలిగే శక్తి 2)కోరుకున్న చోటుకి వెళ్లగలిగే శక్తి 3)ఇతరులను వశం చేసుకునే శక్తి 4) సర్వ గూఢ (రహస్య) వస్తువులను సొంతం చేసుకునే శక్తి 5)ఇచ్ఛానుసారం ఏ వస్తువు నైనా సృష్టించగలిగే శక్తి 6)అందరిని మాయలో పడవేసి వశం చేసుకునే శక్తి 7)ఇచ్ఛానుసారం వస్తువులను చూడగలిగే శక్తి 8)సకల ప్రపంచాన్ని చూడగలిగే శక్తి. ఈ ఎనిమిది శక్తులు మనస్సుకి సంబంధించిన చంద్ర క్షేత్రంలో ఉంటాయి.

ప్రజాపతి క్షేత్రంలో గల అహంకార శక్తులు. 1) దేనినైనా ఖండించగల శక్తి 2) దేనినైనా విరగగొట్టే శక్తి 3) దేనినైనా బంధించగల శక్తి 4)దేనినైనా సృష్టించగల శక్తి 5)దేనినైనా నాశనము చేయగలిగే శక్తి 6)ఆశీర్వదించిగల శక్తి  7) కాలాన్ని జయించే శక్తి 8)మృత్యువుని జయింపగలిగే శక్తి.

బ్రహ్మకు గల శక్తులు. 1)తలచినంత మాత్రాన విశ్వాన్ని సృష్టించే శక్తి 2) రక్షించుట 3)సంహరించుట 4)శక్తిని ప్రయోగించుట 5)ఇష్టానుసారం విశ్వము నిర్వహించుట 6)అన్నిటికంటే విభిన్నముగా ఉండుట 7) ప్రతి దృశ్య వస్తువుని భిన్నంగా సృష్టించుట 8) సమస్త బ్రహ్మాండానికి సృష్టి కర్త అవుట.

విష్ణు శక్తులు బ్రహ్మ శక్తుల కన్నా గొప్పవి మరియు బ్రహ్మ శక్తులకు మూలమైనవి. ఈ విషయం బ్రహ్మకు  తప్ప ఇతరులకు తెలియదు. శివశక్తి విష్ణుశక్తి కన్నా గొప్పది. శివశక్తి తత్త్వము విష్ణువుకి కూడా తెలియదు.

యోగాభ్యాసం చేసే యోగికి అడ్డంకుల రూపంలో ఈ సిద్ద శక్తులు వస్తాయి. సంపూర్ణ వైరాగ్యంతో సాధకుడు వీటికి దూరంగాఉండాలి.బ్రహ్మలోకంవరకు గల సకల లోకములలో సిద్దులు(శక్తులు) రూపంలో ఉండే అడ్డంకులను తొలగించు కుంటూ ముందుకు సాగితే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. పరమేశ్వర అనుగ్రహం, సంపూర్ణ వైరాగ్యం చేత ముక్తి పొందటం సులభం అవుతుంది.

పరమేశ్వరుని అనుగ్రహం పొందిన వ్యక్తి లభించిన సిద్దులను (శక్తులను) ఇతరులను ఆశీర్వదించడానికి ఉపయోగిస్తూ ఆకాశ భ్రమణం చేయగలడు . వేదాలను వాటి సూక్ష్మ అర్థాలను ఉపదేశించ గలడు. దండకాలు, స్తోత్రాలు రచించగలడు. పశుపక్షులతో మాట్లాడగలడు సకల ప్రపంచాన్ని అరచేతిలో చూడగలడు.

మహాత్ముడైన ముని హృదయంలో సకల విధములైన జ్ఞానములు ఉద్భవిస్తాయి.  అభ్యాసం చేత ఈ పూర్వ జ్ఞానము స్థిరము, శుద్దము అవుతుంది. అతడు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు యముడు అగ్ని వరుణాది సకల దేవతలను దర్శించగలడు. ఆకాశములో గల సకల నక్షత్ర గ్రహములను వాటి క్షేత్రములతో సహా దర్శించగలడు.పాతాళలోకాలను, వాటి నివాసులను చూడగలడు.

తనకు లభించిన జ్ఞానము వలన తామస తత్త్వం తొలగించుకుని తనలోని సత్త్వ శక్తి, జ్ఞాన కాంతి, వాటి ఉజ్జ్వల తత్త్వమును చూడగలడు. పరమేశ్వరుని కృప, అనుగ్రహం పొందిన వ్యక్తి నిస్సందేహంగా ధర్మ ఐశ్వర్య జ్ఞాన విరక్తి కలిగి మోక్ష ప్రాప్తిని పొందగలడు.

కనుక మునులారా! శివ సంబంధిత యోగమును నిష్టాపూర్వకంగా ఆచరించుట అత్యంత ఆవశ్యక కర్తవ్యము" అని సూత మహర్షి యోగవిఘ్న కథనము అనే నవమ ఆధ్యాయాన్ని ముగించాడు.

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా 
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

No comments:

Post a Comment