Thursday, November 20, 2025

 1️⃣0️⃣0️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

       *4. జ్ఞాన యోగము.* 
     (నాలుగవ అధ్యాయము)

*13. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశఃl*
 *తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తార మవ్యయమ్ll*

ఈ అనంత విశ్వము నా చేత సృష్టించబడింది. ఈ విశ్వములో ఉన్న మానవులు వారి వారి గుణములను బట్టి, వారు చేసే కర్మలను బట్టి నాలుగు వర్ణములుగా విభజింపబడ్డారు. ఈ సృష్టికి నేనే కర్తను అయినప్పటికినీ, అన్ని జీవులలో ఆత్మస్వరూపుడుగా నిలిచిఉన్నప్పటికినీ, నిజానికి నేను ఏ కర్మా చేయను. ఏ కర్మా చేయవలసిన అవసరం నాకు లేదు.

ఇక్కడి నుండి పరమాత్మ టాపిక్ మార్చాడు. తనకు కర్తృత్వభావన లేదు అనే విషయాన్ని ఇక్కడ విశధీకరించాడు. ఈ ప్రకృతిలో మూడు గుణములు అంటే సత్వరజస్తమోగుణములు ఉన్నాయని తెలుసుకున్నాము. అంటే మానవులలోనే కాదు జంతువులు, పక్షులు, చెట్లలో కూడా ఈ మూడు గుణములు నిగూఢంగా ఉన్నాయి. మానవులలో మాత్రం ప్రకటితమౌతున్నాయి. వారి వారి గుణములను బట్టి, వారు చేసే కర్మలను బట్టి మానవులను మాత్రము నాలుగు వర్ణములుగా విభజింపబడ్డారు. అవే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు. ఇవి పుట్టుకతో వచ్చినవి కావు. వారి వారి గుణములు, వారు చేసే కర్మలను బట్టి ఏర్పడ్డాయి.

1. సత్వగుణం ప్రధానంగా ఉంటూ, రజోగుణము, తమోగుణము అత్యంత అల్ప పరిమాణంలో ఉంటూ, స్వచ్ఛమైన వాక్కు కలిగి, తెలివి తేటలు అధికంగా ఉండి, బుద్ధి వికసించి, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ, బ్రహ్మ విద్యను అంటే వేదములను, శాస్త్రములను తాము అధ్యయనము చేసి, వాటిని ఇతరులకు బోధించి, వేదములలో చెప్పబడిన యజ్ఞములను, యాగములను, పూజలను వ్రతములను తాము చేస్తూ, ఇతరులతో చేయించే గుణము బ్రాహ్మణ గుణము. అటువంటి గుణములు కలవారిని బ్రాహ్మణులు అని అన్నారు. ఋత్విక్కులు, పురోహితులు, గురువులు, మంత్రాంగము చేసేవారు, న్యాయాధికారులు, శాస్త్రవేత్తలు ఈ వర్ణమునకు చెందుతారు. వీరందరూ తమ బుద్ధి తెలివి, విచక్షణ ఉపయోగించి ధర్మంగా కర్మలు చేస్తారు. వీరిలో పరోపకార బుద్ధి తప్ప స్వార్ధ బుద్ధి ఉండదు.

2. రజోగుణము ప్రధానంగా కలిగి ఉండి, సత్వగుణము పాతిక వంతు, తమోగుణము పాతిక వంతు కలిగి ఉండి, మంచి భుజబలము, ధైర్యము, శైర్యము, బలపరాక్రమములు కలిగి ఉండి, రాజ్యములను పాలిస్తూ, మంచి వారిని రక్షిస్తూ, దుష్టులను శిక్షిస్తూ, పరాయి రాజుల దండయాత్రల నుండి తన ప్రజలను రక్షించే వారిని క్షత్రియ వర్ణము అని అన్నారు. వీరిలో స్వార్థగుణము ఉంటుంది కానీ తక్కువ మోతాదులో ఉంటుంది.

3. తమోగుణము ఎక్కువగా, రజోగుణము కొద్దిగా, సత్వము స్వల్పంగా, కలిగి ఉండి, వ్యాపారము, వ్యవసాయము, పశుసంపద కలిగి ఉండి, ధనము సంపాదిస్తూ మిగిలిన వర్ణములకు ధనము సమకూరుస్తూ, వారి అవసరాలను తీరుస్తూ, శారీరకం, మానసికంగా అధిక శ్రమ చేసేవారిని వైశ్యులు అని అన్నారు. వీరిలో తమస్సు ఉంటుంది కాబట్టి, వీరు తమ స్వార్థం అంటే తమ లాభాలు చూసుకుంటూ సమాజశ్రేయస్సుకు పాటుపడతారు. తమకు లాభం లేని పని చేయడానికి ఇష్టపడరు. తాము కొంత తీసుకొని సమాజానికి మిగిలింది పంచుతారు. అంటే బ్రాహ్మణులకు దక్షిణల రూపంలోనూ, క్షత్రియులకు పన్నుల రూపంలోనూ ఇస్తారు.

4. తమోగుణము అధికంగా, రజోగుణము, సత్వగుణము స్వల్పంగా కలిగి ఉండి, క్షత్రియులకు రాజ్యపాలనలో సాయపడుతూ, ఉద్యోగములు చేస్తూ ప్రజలను సేవించే వారిని (అంటే నేటి ఉ ద్యోగస్థులను) శూద్రులు అని అన్నారు. తమోగుణము ప్రధానంగా స్వార్ధపూరితంగా ఉంటుంది. వీరినే వర్కింగ్ క్లాస్ అన్నారు. వీరు ఒకచోట కూర్చుని పని చేస్తారు. చెప్పిన పని చేస్తారు. స్వతంత్రించరు. తమకు రావలసిన వేతనముల కొరకు పని చేస్తారు. ఊరికే పనిచేయరు. చేసిన పనికి వేతనం వుచ్చుకుంటారు. ఎక్కువ పనిచేస్తే ఎక్కువ వేతనం అడుగుతారు. రాజులు తాము పన్నుల రూపంలో తీసుకున్న ధనములో కొంత భాగం వీరికి వేతనముల రూపంలో చెల్లిస్తారు.

ఈ విధంగా పరమాత్మ వర్ణవ్యవస్థను ఏర్పాటు చేసాడు. మానవులలో ఇటువంటి వర్ణవ్యవస్థను సృష్టించినప్పటికినీ, తాను అందులో లేడు. ఆ వర్ణవ్యవస్థకు ఆయనకు ఎటువంటి సంబంధము లేదు. ఆయన ఏ కర్మచేయడు.

దీనిని ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే మానవులు తప్ప మిగిలిన జంతువులు, పక్షులు అన్నీ తమతమ ధర్మములను సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి. ధర్మం తప్పేది ఒక్క మానవుడే. అందుకే మానవులను ధర్మమార్గంలో, క్రమశిక్షణలో ఉంచడానికి వర్ణవ్యవస్థ ఏర్పరచబడింది. ఎందుకంటే మానవులు తమతమ పరిధులను నిరంతరం దాటడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వినోదం కోసం జంతువులు ఉండే చోటికి పోయి వాటిని వేటాడుతున్నాడు. జంతువులు ఉండాల్సిన అరణ్యాలను నరికి, ఇళ్లు కట్టుకుంటున్నారు. ఆ జంతువులకు ఎక్కడకు వెళ్లాలో తోచక జనావాసాలలోకి వస్తున్నాయి. ఇంకా మరి కొంతమంది విప్లవ సిద్ధాంతాల పేరుతో జంతువులు ప్రశాంతంగా జీవిస్తున్న అరణ్యాలలో తిరుగుతున్నారు. అక్కడి ప్రశాంత వాతావరణాన్ని తుపాకీ మోతలతో కలుషితం చేస్తున్నారు. మానవుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ ధర్మం సర్వనాశనం అవుతూ ఉంది. జంతువులు కూడా పారిపోతున్నాయి.
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P235

No comments:

Post a Comment