Wednesday, November 5, 2025

 *జీవన చిత్రం*

ఎంత కాలం బతికామన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా జీవించామన్నది లెక్క. మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితం ఒక కళాఖండంలా మిగులుతుంది. బతుకు కళ అనేది త్యాగం, క్షమ, ప్రేమ అనే రంగులతో రూపుదిద్దుకునే అపురూపమైన చిత్రం.

సమస్యల నుంచి పారిపోకుండా, వాటికి సమాధానాలు వెతుక్కోవడమే జీవితం. ఇతరులకు వెలుగిస్తే మన జీవితం కూడా ప్రకాశిస్తుంది. మనం లేనప్పుడు కూడా మన జ్ఞాపకాలు నిలిచిపోతే అది నిజమైన జీవితమవుతుంది. బతుకు కళను నేర్చుకున్నవారు ప్రతి రోజును కొత్తగా మార్చుకోగలరు. మనకు లభించే ప్రతి క్షణం ఒక తెల్ల కాన్వాస్‌ లాంటిది. దానిపై ఏ రంగులు వేసుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి.

బతుకు కళలో స్వీయ అవగాహన ఉండాలి. మన బలాలు, బలహీనతలు తెలుసుకోవడం ఒక మంచి శిల్పి శిలను అర్థం చేసుకోవడంలాంటిది. ఏ భావన మనలో దృఢత్వాన్ని పెంచుతుందో, ఏ అలవాటు మనను వెనక్కి లాగుతుందో గమనించడం ముఖ్యం. సమయం తిరిగి రాని వరం. దాన్ని వృథా చేయకుండా లక్ష్యసాధనకు ఉపయోగించడం బతుకు కళలో ప్రధాన సూత్రం. సమస్యల పరిష్కారానికి కొత్త మార్గాలు ఆలోచించాలి. చిన్న చిన్న పనులను సైతం సమయానికి, నాణ్యతతో పూర్తిచేయడం వ్యక్తిత్వానికి పదును పెడుతుంది.
దృక్పథం స్పష్టంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితుల మధ్య సైతం అవకాశాలను గుర్తించడం, కష్టాల్లో కూడా పాఠాలను నేర్చుకోవడం జీవన కళాకారుడి లక్షణం. అగ్నిపరీక్షలలోనే ఆత్మవిశ్వాసం బలోపేతమవుతుంది. సంబంధాలూ కీలకమే. చుట్టూ ఉన్నవారి హృదయాలను గెలుచుకోవడం, సహానుభూతి చూపడం, కృతజ్ఞత వ్యక్తపరచడం- ఇవి బతుకు చిత్రంలో ప్రకాశవంతమైన రంగులు. ఇతరులను ప్రోత్సహించగలిగితే, జీవితం మరింత సార్థకం అవుతుంది. దినచర్యల్లోనూ అందాన్ని వెతకడం మనసును యవ్వనంగా ఉంచుతుంది.

బతుకు కళ అనేది ఒక నిరంతర సాధన. ఇది ఒక్కరోజులో నేర్చుకోలేని మేలిమి నైపుణ్యం. క్రమశిక్షణ, ధైర్యం, ప్రేమ, ఆశావాదం ఈ నాలుగింటి తోడ్పాటుతో దాన్ని సాకారం చేసుకోవాలి. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే- మన జీవన చిత్రానికి మనమే చిత్రకారులం కావాలి. కుంచె మనసైతే, రంగులు మన ఆలోచనలు. కాన్వాస్‌ మన కాలం. బతుకును కళగా మలచడం ఒక మహోన్నత సృజన.
బతుకు కళ అనేది వాన చినుకుల్లో ఇంద్రధనస్సును వెతకడం లాంటిది. అంటే- కన్నీటి బిందువులోనూ ఒక ముత్యాన్ని చూడగలగడం, చీకటిలోనూ ఒక దీపాన్ని వెలిగించగలగడం. ప్రతి క్షణాన్నీ ఓ రాగంలా ఆలపించడం, ప్రతి అనుభవాన్నీ ఓ పద్యంలా రాయడం. బాధలను కూడా చిత్రంలోని నీడలుగా భావించి, ఆనందాన్ని ఆ చిత్రంలోని వెలుగులా ఆరాధించాలి. జీవితం ఒక ఖాళీ కాన్వాస్‌ అయితే, మనసు సమపాళ్లలో వేసే సరైన రంగులే దానికి అందం. ఆ వర్ణాలన్నీ కలిసినప్పుడే బతుకు కళ అద్భుతమైన చిత్రమవుతుంది.
~జియో లక్ష్మణ్‌

No comments:

Post a Comment