Thursday, November 20, 2025

 ఆనందంగా జీవిద్దాం!

మనిషి ఆనందంగా జీవించడానికి సృష్టికర్త ఎన్నో వనరులను సమకూర్చాడు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ మానవత్వంతో మనుగడ సాగించమని ఆశీర్వ దించాడు. ధర్మబద్ధంగా జీవిస్తూ, సత్యవ్రతాన్ని పాటించే సజ్జనులకు అండగా ఉంటా నన్నాడు. కానీ, మనిషి భగవంతుడు అనుగ్రహించిన స్వేచ్ఛాజీవితాన్ని దుర్వినియో గపరుస్తున్నాడు. ఉచితంగా లభించిన వనరులను కలుషితం చేస్తున్నాడు. అరిషడ్వర్గాలకు బానిసై ఆనందంగా గడపాల్సిన జీవితాన్ని దుఃఖమయం చేసుకుం టున్నాడు. అధర్మాన్ని అంటిపెట్టుకుని, అవినీతిని ఆసరాగా చేసుకుని ఎదగాలను కుంటూ భంగపడుతున్నాడు.

ఉన్నదానితో సంతృప్తి చెందనివారిని అసంతృప్తి పీడిస్తూ ఉంటుంది. స్వార్ధప రులు తమకన్నా ఉన్నతస్థితిలో ఉన్నవారిని చూసి అసూయ చెందుతూ ఉంటారు. లోభులు కూడబెట్టిన ధనాన్ని కాపాడుకో వడంలో తలమునకలై ప్రశాంతత కోల్పోతారు. మనిషి, దుఃఖం... తోబుట్టు వులు. ఏడుస్తూ పుట్టే ప్రాణిని జీవితాంతం దుఃఖం వదలదు. తరచు ఏదో ఒక కార ణంతో మనిషి బాధపడుతుంటాడు. బాధల నుంచి విముక్తి కల్పించమని భగ వంతుడిని ప్రార్థిస్తాడు. తీర్థయాత్రలు చేస్తాడు. సత్యం, ఇంద్రియనిగ్రహం, దానం, దయ, విజ్ఞానం, పుణ్యం... ఈ మానస తీర్థాల్లో మునిగి శుచులు కానివారికి బాహ్య తీర్థాలు ఫలితాన్నివ్వవు. ఈ పురాణ ప్రబోధాన్ని అర్థం చేసుకున్నవారు రాగద్వేషాలకు అతీతులై సుఖమయ జీవితాన్ని గడపగలుగుతారు.
ఆనందం ఆయువును పెంచుతుంది. ఇతరులకు సాయం చేయడంలో ఆనందం ఉంది. జ్ఞానదానం ఆనందకరం. తనకున్న దాన్ని అవసరార్థులకు పంచడం ఆనందాన్ని స్తుంది. వృత్తి ధర్మాన్ని ఆచరిస్తూ ఆనందించేవారు కొందరైతే సజ్జనుల సాంగత్యం ఆనం దభరితమని కొందరు భావిస్తారు. మనసు ఆనందంతో పరవశిస్తున్నప్పుడు పెదవులపై చిరునవ్వు చిందులేస్తుంది. వదనం ప్రసన్నమవుతుంది. మనుషులు దగ్గరవుతారు.

భగవంతుడు ఆనంద స్వరూపుడు. భగవంతుణ్ని స్మరిస్తున్నప్పుడు, దర్శిస్తున్న ప్పుడు, పూజిస్తున్నప్పుడు కలిగే ఆనందం మనిషిని ధర్మంవైపు నడిపిస్తుంది. సత్యం పలికిస్తుంది. దృఢమైన మనస్తత్వం కలవారి మనసులో దుఃఖానికి చోటుండదు. ఆనందం వారి వెన్నంటే ఉంటుంది. ఆలోచనలు సకారాత్మకంగా ఉంటాయి. ఇత రుల విజయాలకు ఆనందించేవారే ఉత్తములు. మనం నాటిన విత్తు మొక్కగా ఎదిగి వృక్షంగా మారుతున్నపుడు, పశుపక్ష్యాదులను సేవిస్తున్నప్పుడు, ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడు, లక్ష్యం సాధించినప్పుడు కలిగే ఆనందం అపూర్వం. అది భగవదనుగ్రహం. కష్టాలు స్వయంకృతాలు అని తెలుసుకోగలిగిన జ్ఞాని జీవిత పర మార్థాన్ని గ్రహిస్తాడు. భగవంతుడికి దాసుడై సంతృప్తికర జీవితాన్ని సాగిస్తాడు. తాను ఆనందిస్తూ చుట్టూ ఉన్నవారికి ఆహ్లాదాన్ని పంచుతాడు. ప్రాణి అసలైన స్వరూపమైన ఆనందమే బ్రహ్మం అని ఉపనిషత్మంత్రం చెబుతోంది.

ఇంద్రగంటి నరసింహ మూర్తి

No comments:

Post a Comment