*అయిదు ప్రమాదాలు*
చదువుల్లో ఎంతగా రాణించినా, అంతులేని సంపదలతో తులతూగినా అజ్ఞానమనే అంధకూపంలో ఎప్పుడో ఒకప్పుడు పడిపోక తప్పదు. నేను, నాది అనే స్వార్థభావన తలకెక్కిన మనిషి దానవుడిలా ప్రవర్తిస్తాడు. ధన గర్వంతో కళ్లు మూసుకుపోయి అహంకారంతో విర్రవీగుతాడు. తమస్సు, మోహం, మహామోహం, తామిస్రం, అంధతామిస్రం అనే అవిద్యలు దాడిచేస్తే వాటి కబంధ హస్తాల్లో మనిషి ఎలా నలిగిపోతాడో దత్తపురాణం వివరిస్తోంది.
కార్చిచ్చులా కమ్మేసి మనిషిని అంధకారంలోకి నెట్టేది తమస్సు. ఆ స్థితిలోని వ్యక్తి కన్నూ మిన్నూ కానక ప్రవర్తిస్తాడు. విజ్ఞత మాత్రమే ఈ సంకట స్థితి నుంచి బయటికి రప్పించేది. జీవితం అశాశ్వతమని గుర్తించి వివేకాన్ని ఆశ్రయించేవారే విజ్ఞులు. మనిషిని దుర్బలుణ్ని చేసి తనవైపు లాగే సాలెగూడు మోహం. ‘నా’ అనే వలలో చిక్కి ఆ బంధనాలనుంచి విడివడలేక విలపిస్తాడు మనిషి. అగ్నికి ఆహుతయ్యే మిడతలా మోహానికి దాసుడై ఇహపరాలకు భ్రష్టుడై అశాంతి పాలవుతాడు. దేహం భ్రాంతి అని తెలిసేనాటికి జీవితం ముగిసిపోతుంది. మహామోహం అత్యంత ప్రమాదకరం. అంతులేని భోగలాలస మనిషిని పాతాళానికి తొక్కేస్తుంది. తప్పొప్పుల గురించి ఆలోచించకుండా ఆర్జనలో మునిగితేలే వ్యక్తి అశాశ్వత భోగాలే నిజమని నమ్మి మోసపోతాడు. అవిద్యావరణంలో మనిషిని పట్టిపల్లార్చే తామిస్రం అనారోగ్యం పాలుచేస్తుంది. అంతులేని కోపం అనర్థహేతువు. అది పరమశత్రువని తెలిసినా మనిషి దాని సాంగత్యం కోరుకుంటాడు. క్షణికావేశానికి లోనై చేయరాని తప్పులు చేసి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. అంధ తామిస్రం మనిషిని మృత్యుముఖం వైపు నడిపిస్తుంది. రేయింబగళ్లు కష్టపడి కడుపు కట్టుకుని సిరిసంపదలు ఆర్జిస్తాడు మనిషి. చోరులవల్లో, సంతానంవల్లో, ప్రకృతి వైపరీత్యాలవల్లో అవి దూరమైతే తట్టుకోలేడు. కుంగిపోతాడు. ఆ చింత చితిగా మారి అతణ్ని దహించివేస్తుంది.
సృష్టి ప్రారంభమైన తొలినాళ్లలో ఉద్భవించినవారే సనక సనందనాదులు. ధర్మపరాయణులు, అంతర్ముఖులు. వీరితో కాదని, అనంతముఖాలుగా సృష్టి వృద్ధి కావాలని భావించిన బ్రహ్మ రవ్వంత అవిద్యావరణాన్ని సృష్టించాడు. ఆ భావన రాగానే చిత్రంగా తానే దానికి లోనయ్యాడు. జ్ఞానం నశించింది. సకల వేదాలను చివరికి గాయత్రి మంత్రాన్నే మరిచిపోయాడు. ఎలాగో తెలివి తెచ్చుకుని జగదంబ రేణుకామాతను ప్రార్థించాడు. ఆమె ప్రత్యక్షమై త్రిమూర్తిరూపుడైన దత్తుణ్ని శరణుకోరమంది. సహ్యాద్రి శిఖరంపై కృష్ణామలక(నల్ల ఉసిరి) చెట్టు కింద స్వామి దర్శనమిచ్చి బ్రహ్మపై దయావృష్టిని కురిపించాడట. వెంటనే సమస్త వేదాలు సాకల్యంగా స్ఫురించాయట బ్రహ్మకు. అవిద్యాబాధితులైన మహాపురుషులెందరో మనకు పురాణాల్లో కనిపిస్తారు. రకరకాల సాధనల వల్ల, దైవకృపవల్ల బయటపడినవారి కథలెన్నో. అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకుని సంచరించేవారి దారిదాపులకి కూడా రాదు అవిద్య. తెలివి, విజ్ఞత ఉపయోగించి దానికి దూరంగా ఉండాలి. జీవితం విలువైందన్న అవగాహన పెంచుకుని జీవనయానం సాగించాలి. అప్పుడే బతుకు నందనవనంగా మారుతుంది.
~మాడుగుల రామకృష్ణ
No comments:
Post a Comment