💐25శ్రీ లింగ మహాపురాణం💐
🌼పంచ యజ్ఞం🌼
#ఇరవై ఐదవ భాగం#
లింగార్చన చేసే భక్తుడు స్నానం చేసిన తరువాత రుద్రాక్ష మాల, విభూతి ధరించిన తరువాత "ఆయాతు వరదా దేవి" అనే మంత్రం పఠించి వేదమాత గాయత్రీదేవిని ఆహ్వానించి పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం సమర్పించాలి. మూడు సార్లు ప్రాణాయామం చేయాలి.
తరువాత దోసిలిలో జలం, గంధం, పుష్పాక్షతలు తీసుకుని సూర్యునికి చూపిస్తూ గాయత్రి మంత్రం పఠించి అర్ఘ్యం పళ్ళెంలో వదలాలి.కాలాతిక్రమణ కాకపోతే మూడుసార్లు, అయితే నాలుగు సార్లు అర్ఘ్యం వదలాలి. తరువాత ఓంకారంతో గాయత్రి మంత్రాన్ని వెయి సార్లు లేదా ఐదు వందల సార్లు లేదా కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి.
మరల అర్ఘ్యం సమర్పించి గాయత్రీదేవిని పూజించిన శిరస్సు వంచి ప్రణామం చేసి "ఉత్తమే శిఖరే జాతే" మంత్రంతో గాయత్రీదేవిని స్వస్థానానికి పంపాలి. తూర్పు వైపు చూస్తూ సూర్యుడిని "ఉద్యంతం, చిత్రం, జాతవేదసం" మంత్రాలతో ప్రార్థించాలి. తరువాత ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాలలో గల సూర్య ప్రార్థనా మంత్రాలను పఠించాలి.
సూర్య బ్రహ్మ అగ్నులకు మూడు సార్లు ప్రదక్షిణం చేయాలి. తరువాత సర్వాన్ ఆవాహయామి అని మునుల, పితరుల, దేవతల యొక్క వాస్తవిక స్వరూపాలను ధ్యానము చేయుచు వారికి విధియుక్తంగా తర్పణాలు సమర్పించాలి. దేవతలకు పూలు, చందనం, జలముతో, మునులకు దర్భలు, చందనం, జలముతో, పితృదేవతలకు తిలలు, చందనం, జలంతో తర్పణాలు వదలాలి.
దేవతలకు తర్పణం ఇచ్చేటప్పుడు యజ్ఞోపవీతం సవ్యముగా (ఎడమభుజంపై నుండి) , ఋషులకు తర్పణం ఇచ్చేటప్పుడు యజ్ఞోపవీతం మెడలో మాలగా, పితృదేవతలకు యజ్ఞోపవీతం అపసవ్యంగా (కుడిభుజము పై నుండి) ధరించాలి. దేవతర్పణం కుడి చేతివ్రేళ్ళ కొసల నుంచి వదలాలి. ఋషి తర్పణం చిటికెన వ్రేలు చివర నుంచి వదలాలి. పితృతర్పణం కుడిచేతి బొటనవేలు మీదుగా వదలాలి. దేవతర్పణంలో ఒకసారి, ఋషి తర్పణం లో రెండు సార్లు, పితృ తర్పణంలో మూడుసార్లు ఉదకం వదలాలి.
మునులారా! మానవుడు నిత్యం బ్రహ్మ, దేవ, మనుష్య, భూత, పితృ యజ్ఞములు అనే ఐదు యజ్ఞాలు చేయాలి.
బ్రహ్మ యజ్ఞం : వ్యక్తి తన వేదశాఖకు చెందిన మంత్రాలను పఠించడం బ్రహ్మ యజ్ఞం అవుతుంది.
దేవ యజ్ఞం : అగ్నిహోత్రంలో అన్నాన్ని ఆహుతి చేయడం దేవ యజ్ఞం అవుతుంది వ వైశ్వదేవం అని కూడా దీనిని అంటారు.
భూత యజ్ఞం : విధి పూర్వకంగా సర్వప్రాణులకు (పశుపక్షులు, జంతువులకు ఆహారం సమర్పించడం.
మనుష్య యజ్ఞం : ఉత్తములైన గృహస్థులకు, వేద విద్వాంసులకు, అతిథులకు భోజనం పెట్టడం మనుష్య యజ్ఞం.
పితృ యజ్ఞం :విధివిధానంగా పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించి పిండ ప్రదానం చేయడం పితృ యజ్ఞం.
ఈ ఐదు రకాల యజ్ఞాలలో బ్రహ్మ యజ్ఞం ఉత్తమమైనది, ప్రధానమైనది. ఈ యజ్ఞం చేయడం వలన బ్రహ్మాది దేవతలు ప్రసన్నులవుతారు. వేదవేదాంగాలు, పురాణాలు, ఉపపురాణాలు, ఇతిహాసాలు ప్రసన్నం అవుతాయి.
భస్మస్నాన విధి:
పంచ యజ్ఞాలు ఆచరించిన తరువాత నది లేక చెరువు వద్దకు వెళ్లి పాదప్రక్షాళన చేసుకుని భస్మస్నానం చేయాలి. అనగా విభూతి ధరించాలి. శుద్దమైన అగ్ని ద్వారా ఏర్పడ్డ భస్మాన్ని ఓంకారంతో శోధించి తడపాలి. తడిపిన విభూతిని ఈశాన మంత్రం పఠిస్తూ తలమీద, తత్పురుష మంత్రం పఠిస్తూ నొసటి మీద, అఘోర మంత్రం పఠిస్తూ వక్షస్థలం పై, ఉదరం పై, వామదేవ మంత్రం పఠిస్తూ నడుముపై, సద్యోజాత మంత్రం పఠిస్తూ పాదాల పైన, ఓంకారం పఠిస్తూ శరీరమంతా మూడు వ్రేళ్ళతో మూడు రేఖలు శరీరమంతా ధరించాలి.
తరువాత కాళ్లు చేతులు కడుక్కుని భస్మము తుడుచుకొని ఉద్దరిణిలో నీళ్ళు తీసుకుని "అపోహిష్టా" మంత్రం పఠిస్తూ ఉదక ప్రోక్షణం (నీళ్ళు చల్లుకోవడం) అనే మంత్ర స్నానం చేయాలి. ఈవిధంగా నియమంగా స్నానవిధి, సంధ్యావిధి, పంచ యజ్ఞం నిర్వర్తించిన వారు శివానుగ్రహం పొంది మోక్షము పొందుతారు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
No comments:
Post a Comment