# గెలవగలం..!
☘️మనసు నిశ్చలంగా ఉన్న సరస్సులాంటిది. గాలివీచినా చిన్న రాయి విసిరినా సరస్సులో కద వస్తుంది. మనసూ అంతే. కొన్ని సంఘటనలు దాన్ని కదిలిస్తాయి. అనేక ఆలోచనలు పుడతాయి. కొన్ని అంతరంగాన్ని కలచివేస్తాయి. మరికొన్ని అలజడి సృష్టిస్తాయి. కోపం తపస్సును చెడగొడుతుందని, సద్గుణాలను నాశనం చేస్తుందని, ధర్మకార్యాలను ఆటంకపరుస్తుందని భారత్లోక్తి. కోపమునను ఘనత కొంచెమైపోవునన్నాడు వేమన.
☘️ఒక ఇంట్లో నిప్పు పుడితే ముందు ఆ ఇల్లు కాలిపోయాకే పక్కింటికి పాకుతుంది. ఎవరి మనసులో క్రోధం ఆవిర్భవిస్తే ముందు వారికే హాని కలుగుతుంది. కోపం అగ్ని వంటిది. అది అవమ అనే ఆరణిని మధించగా పుడుతుంది. పుట్టినది ఎగసి మండటానికి చెడు మాటలనే కట్టెలు తోడ్పడతాయి. అంతే సెగలు పొగలు వ్యాపిస్తాయి. తాను ఎదుటివాడు ఇద్దరూ కాలి బూడిదవ్వాల్సిందే. మనిషి కొంచెం ఆలోచన, జ్ఞానం ఉన్నవాడైతే తెలివి అనే నీటిని కుండలతో కుమ్మరించి దాన్ని చల్లార్చగలుగుతాడు... అంటుంది ఒక శ్లోకం. కోపం వివేకాన్ని కాల్చేస్తుంది. మంచి చెడుల తేడాను తెలియనివ్వదు. ఒళ్లు తెలియని కోపంలో మనుషులు ఎటువంటి దారుణాలకు పాల్పడుతున్నారో చూస్తున్నాం.
☘️కోపం సహజమైన ఉద్వేగమైనా అది బలీయమైనప్పుడు వినాశకర శక్తిగా రూపుదాలుస్తుంది. కొందరికది అలంకారం. నాయకత్వ లక్షణంగానూ పరిగణిస్తుంటారు. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి, కింది ఉద్యోగులతో బాధ్యతాయుతంగా పనిచేయించుకోవడానికి తగుమాత్రం కోసం అవసరం కావచ్చు. అయితే అది పాము బుసకొట్టే రీతిలో ఉండాలిగానీ కాటేసే స్థాయిలో కాదు. కోపిష్టి విచక్షణా జ్ఞానాన్ని వివేచనను కోల్పోతాడు. దానివల్ల ఆ వ్యక్తి ప్రవర్తనలో దౌష్ట్యం చోటుచేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో మునులూ క్రోధానికి అతీతులు కారు. భిక్ష దొరకకపోతే కాశీ వాసుల్ని శపించబోయిన వ్యాసుణ్ని పరమ శివుడు ఆ నగరం నుంచి బహిష్కరించడం పురాణ ప్రసిద్ధం. దుర్వాసముని. కోపాన్ని గురించి ఎన్నో ఉదంతాలు పురాణాల్లో, కావ్యాల్లో కనిపిస్తాయి. కౌశికుడనే ముని తనపై కొంగ రెట్ట వేసిందని ఆగ్రహంతో చూస్తే అది కాలి బూడిదైంది. కోపం మనకు శత్రువని గుర్తించాలి. శత్రువును గుర్తించినపుడే అంతం చేయగలం. కోపం రజోగుణం నుంచి ఉద్భవిస్తుంది. మనిషి స్వభావంలో సత్వగుణం బలంగా ఉంటేనే కోపాని అధిగమించగలుగుతాడు. భక్తి, ఆధ్యాత్మిక చింతన, యోగాభ్యాసం వంటివి మనిషిని క్రోధమనే ప్రవృత్తికి దూరంగా ఉంచుతాయి.
☘️కోరికలు దుఃఖానికి, దుఃఖం ఆగ్రహానికి దారితీస్తాయి. కోపానికి ఒక కారణమంటూ ఉండదు. కొందరిది ప్రథమ కోపం. ఇట్టే కరిగిపోతుంది. అది మనసులో గూడుకట్టుకుని ద్వేషంగా మారే వ్యక్తులతోనే సమస్య. యోగసాధన కోపాన్ని నియంత్రించగలుగుతుంది.
☘️గౌతమబుద్ధుడు సహనమూర్తి. ప్రతికూలతల్ని ప్రశాంతంగా ఎదుర్కొన్నాడు. ఆంగుళిమాలుడు వంటి దుష్టుల్ని ప్రసన్నవదనంతో ఎదుర్కొని పరివర్తన తేగలిగాడు. కోపాన్ని జయించాలనుకున్నవారు మంచి సంస్కారాలు అలవరచుకోవాలి. నైతికజీవనం.. సౌజన్యం, మనోవికాసం ఉన్నవారిలో క్రోధం ఆంత సులభంగా పెంపొందదు.🙏
✍️- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
🌺 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌺
No comments:
Post a Comment