Thursday, November 20, 2025

 💐16శ్రీ లింగ మహాపురాణం💐

🌼శివుని పంచ బ్రహ్మ మూర్తులు - సద్యోజాత వామదేవ తత్పురుష మూర్తులు🌼

    #పదహారవ భాగం#

సద్యోజాతుడు: సృష్టిలో ఇరవై తొమ్మిదవకల్పమైనశ్వేతలోహిత కల్పంలో బ్రహ్మదేవుడు పరమేశ్వరుని వద్దకు వెళ్లి స్తుతి చేస్తూపుత్రునికోసంప్రార్థించాడుఅప్పుడు పరమేశ్వరుని ముఖం నుంచిశ్వేతలోహితుడుఉద్భవించాడు. బ్రహ్మ అతనినిచూసి ధ్యానించసాగాడు.సద్యోజాతుడిగా ఆవిర్భవించినఆశ్వేతనీల లోహితుడి పార్శ్వం నుంచి తెల్లటి వర్ణముగల నలుగురు పుత్రులుశిష్యులుగాఉద్భవించారు.సునందుడు నందనుడు విశ్వనందనుడు ఉపనందుడు అనే ఆ నలుగురు శ్వేతుడుఅని పేరు పొందిన సద్యోజాతుడిని సేవిస్తూ నాలుగు దిక్కుల ధర్మ ప్రచారంచేయసాగారు.పరమేశ్వరునిముఖంనుంచిఆవిర్భవించిన సద్యోజాతుడైన ఈశ్వరుని ఆశ్రయించి కొలిచినవారు సకల పాపాల నుండి విముక్తి పొంది మొదట విష్ణులోకం తరువాత రుద్రలోకం చేరుకుంటారు.

వామదేవుడు : ముప్ఫైయ్యవ కల్పాన్ని రక్త కల్పం అంటారు. ఈ కల్పంలో బ్రహ్మదేవుడు ఎర్రని శరీరంతో ప్రకాశిస్తుంటాడు.  ఒకనాడు బ్రహ్మదేవుడు పుత్ర సంతానం కోసం పరమేశ్వరుని ప్రార్థించగా ఒక దివ్య బాలుడు ఉద్భవించాడు. అతను ఎర్రని శరీరంతో ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్రటి కళ్ళతో ప్రకాశిస్తున్నాడు. ఆ రక్తవర్ణ బాలుని వామదేవుడు అనే పేరుతో ఈశ్వరునిగా భావించి ధ్యానించ సాగాడు.

పరమేశ్వరుడు ప్రత్యక్షమై "బ్రహ్మదేవా! పుత్రుడి కోసం నన్ను ధ్యానించావు. అందుకే నేను వామదేవుడి రూపంలో ఆవిర్భవించాను. "ఓం వామదేవాయ నమః" అనే మంత్రంతో నన్ను జపిస్తే నేను ప్రతి కల్పంలో వామదేవునిగా దర్శనమిస్తాను" అని అంతర్ధానమైనాడు.

వామదేవుని శరీరం నుంచి విరజుడు, విబాహువు, విశోకుడు, విశ్వభావనుడు అనే నలుగురు శిష్యులు ఉద్భవించారు. వారు రక్తాంభరధారులై బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించారు. లలాటము పై రక్త చందనము, శరీరము పై ఎఱ్ఱని భస్మము ఫూసుకున్న వారు వామదేవుని జప ధ్యాన పూజలతో ఆరాధించారు. నలుగురు ధర్మ ప్రచారము చేయుచు ప్రజలను ఆశీర్వదిస్తూ వేయి సంవత్సరాలు గడిపారు. పిదప బ్రహ్మత్వం పొంది శివుని లో ఐక్యము అయ్యారు.

తత్పురుషుడు : కల్పాలలో ముప్పై ఒకటవ కల్పాన్ని పీతవాస కల్పము అంటారు. ఈ కల్పంలో బ్రహ్మదేవుడు పీతవస్త్రధారిగా అనగా పసుపు రంగు వస్త్రాలు ధరించి ఉంటాడు. సృష్టి ఆరంభంలో పరమేశ్వరుని ధ్యానించిగా పీతవర్ణ పురుషుడు ఉద్భవించాడు. ఆ పురుషుడు పచ్చని శరీర వర్ణముతో సువర్ణ యజ్ఞోపవీతాన్ని, పసుపు రంగు వస్త్రాలు ధరించి శ్రీగంధం శరీరమంతా పూసుకుని ప్రకాశించాడు.

చతుర్ముఖ బ్రహ్మ ఆ పురుషుని తత్పురుషునిగా భావించి ధ్యానించాడు. ఆ తత్పురుషుని ముఖం నుండి నాలుగు పాదాలు, నాలుగు కొమ్ములు నాలుగు నేత్రాలు, నాలుగు దంతములు, నాలుగు స్తనములు గల గోమాత ఉద్భవించింది. తత్పురుషుడు ఆ గోమాతను ప్రేమగా "గోరూపంలో వెలసిన మహాదేవీ! మతి, స్మృతి, బుద్దికి ప్రతీకమైన నీకు స్వాగతము! దగ్గరకు రమ్ము!" అని పిలిచాడు. గోవు దగ్గరకు వచ్చి తలతో నమస్కరించి నిలిచింది.

"ఓ గోమాతా! శివధ్యాన యోగ శక్తి చేత సమస్త ప్రపంచాన్ని నీ వశమునందు ఉంచుకొనుము. నీవు రుద్రాణివి. త్వరలో ఉమాదేవిగా శివుని భార్యవు కాగలవు. పంచబ్రహ్మ శివుని ఉపాసించే భక్తులకు మోక్షం ప్రసాదిస్తావు" అని పలికి ఆ గోవుని ఆశీర్వదించి బ్రహ్మకు ఇచ్చాడు.

తత్పురుష ఆశీర్వాదాన్ని పొందిన గోమాతను పరమేశ్వరుని శాసనాన్ని అనుసరించి బ్రహ్మదేవుడు స్వీకరించాడు. అలాగే వేదోక్తమైన రుద్రగాయత్రి మంత్రాన్ని బ్రహ్మదేవుడు తత్పురుషుని నుంచి ఉపదేశం పొంది భక్తిపూర్వకంగా జపం చేశాడు. మహేశ్వరుడు సంతోషించి బ్రహ్మదేవునికి ధ్యానసిద్ది యోగాన్ని ప్రసాదించాడు.

తత్పురుషుడి శరీరం నుండి నలుగురు పురుషులు ఉద్భవించారు.   పీతవర్ణ శరీరం గల వారు పసుపు వస్త్రాలు, పీత గంధాన్ని ధరించి తత్పురుషుడికి శిష్యులై సేవించారు. వేయి దివ్య సంవత్సరాలు ఆ నలుగురు మునులకు, ప్రజలకు శివయోగాన్ని ఉపదేశించారు.  తరువాత శివ యోగ ధ్యాన సిద్దులై శివునిలో ఐక్యమయ్యారు. ఎవరైతే తత్పురుష రూపుడైన శివుని భక్తి శ్రద్థలతో ఉపాసిస్తారో వారు పాపాలు పోగొట్టుకుని పునర్జన్మ రహితులై శివసాయిజ్యం పొందుతారు.

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
💜   ఓం శ్రీఉమా 
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు🙏 
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

No comments:

Post a Comment