ఓం నమో భగవతే శ్రీ రమణాయ
మహర్షి, "పెరియపురాణం"లోని 'కారైక్కాల్ అమ్మగారి' కథను ఇలా సెలవిచ్చారు ...
ఒక వర్తకుడు తన భార్యకు రెండు మామిడి పండ్లను తన భోజనంలో తింటానని చెప్పి పంపాడు. ఆయన ఇంటికి వచ్చే లోపల ఒక సాధువు, వారి ఇంటికి వెళ్ళి తనకు చాలా ఆకలిగా ఉందని చెప్పాడు. ఆ ఇల్లాలు జాలిపడి కొంత అన్నంతోపాటు ఆ పండ్లలో ఒకదాన్ని ఇచ్చింది. తన భర్త ఒక మామిడిపండుతోనే తృప్తి చెందుతాడని తాను ఆశించింది.
వర్తకుడు ఇంటికి వచ్చి భోజనం చేస్తూ మామిడి పండ్లను అడిగి ఒకటి తిన్న తరువాత చాలా రుచిగా ఉన్నందువల్ల రెండవదాన్ని కూడా ఇమ్మన్నాడు. ఆ యిల్లాలు చిక్కుల్లో పడింది. తన భర్త కోపిస్తాడని భయపడుతూ తాను పండు ఉంచిన గదిలోనికి వెళ్ళి, ఈ స్థితిలో వున్న తనకు సాయపడమని భగవంతుని కోరింది. రెండు పండ్లు ఉంచిన చోట ఇంకో పండు కనబడింది. దానిని తెచ్చి భర్తకు ఇచ్చింది. అతడు అది తిని, ముందెన్నడూ ఎరుగని శాంతిని పొందాడు. ఆ పండు ముందటి పండుకన్నా అత్యంత తీపిగా ఉండడాన్ని గుర్తించి దాని వెనుక ఉన్న రహస్యాన్ని, భార్యను అడిగి తెలుసుకున్నాడు.
అపనమ్మకమూ, ఆశ్చర్యమూ కలుగగా భార్యను, భగవంతుని ప్రార్థించి ఇంకో పండును తెమ్మని చెప్పాడు. ఆమె ప్రయత్నిస్తానని చెప్పి భగవంతుని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం వల్ల ఇంకో పండు కూడా లభించింది. అప్పుడా వర్తకుడు తన భార్య మహా భక్తురాలు అని తెలుసుకుని, ఆమె ఎదుట సాష్టాంగపడి, ఆమెను ఇక మీదట తన భార్యగా అనుకోవడం అపచారమని, ఆ ఊరి వదిలి ఇంకో ఊరికి వెళ్ళి నివసించడం ప్రారంభించాడు.
కొంత కాలానికి ఆయన భార్య ఆయనను వెదకి, భర్త తావున అతనితో బాటు ఉండడమే తన ధర్మం అని తలచి, అక్కడికి వెళ్ళిన తరువాత అతని ఇష్టం వచ్చినట్లు ఏమైనా చేయనీ అనుకొని, అతడు ఉంటున్న గ్రామానికి బయలుదేరింది. ఆమె ఇలా చేస్తుందని ముందే ఊహించి, ఆ గ్రామస్థులతో "ఒక గొప్ప భక్తురాలు ఇక్కడకు వస్తున్నది. విశేష గౌరవంతో పల్లకి, మేళతాళాలతో ఆమెను ఆహ్వానించా” లంటూ ఏవేవో చెప్పాడు.
అతడు ఈ విధంగా ఘనమైన స్వాగతాన్ని ఏర్పాటు చేసి స్వాగతసమితి అధ్యక్షుడిగా
ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆమెకు ఏం చెయ్యాలో తోచలేదు. ఆమె ఈ దేహాన్ని వదలివేసి, సూక్ష్మ శరీరంతో కొంత కాలం వుండి చివరకు భర్తను కూడా తీసుకుని స్వర్గానికి వెళ్ళింది.
No comments:
Post a Comment