Thursday, November 20, 2025

 💐12శ్రీలింగమహాపురాణం💐
      
   🌼యోగాభ్యాసం🌼
      
       #పన్నెండవ భాగం#

స్వచ్ఛమైన శుభ్రమైన స్థానంలో యోగాభ్యాసంచేయసంకల్పించినసాధకుడుసంతులితస్థానంలో కూర్చుని మొదట అష్టాంగ యోగములనునిర్మలఆనంద
మయ మనస్సుతో అభ్యాసం చేయాలి. తరువాత గురువు, పరమేశ్వరుడు, పరమేశ్వరి, వినాయకులను ధ్యానించి నమస్కరించాలి.

తరువాతసాధకుడుపద్మాసనము లేదా స్వస్తికాసనము లేదా అర్థాసనములో ఆసీనుడు కావాలి. స్వస్తిక ఆసనం అంటే కూర్చుని కాలి బోటనవ్రేళ్ళను మోకాళ్ల మధ్య ఏర్పడిన ఖాళీ స్థలములోఉంచటం.శివపురాణంయోగికిఎనిమిదిఆసనాలను ధ్యానము చేయుటకు చెప్పింది. అవి స్వస్తిక, పద్మ, అర్ధేందు, వీర, యోగ, ప్రసాధిత, పర్యంకళ, యతేష్ఠ అనేవి. ధ్యానమందు తరచుగా ఉపయోగించేఆసనంపద్మాసనం.సాధకుడుతనధ్యానమునకు అనుకూలమైన ఆసనం ఎంచుకుని ధ్యానము చేయ వచ్చును.

ఏ ఆసనంలో కూర్చుని ఉన్నా, సాధకుడు కన్నులు,నోరుమూసి ఉంచాలి. వక్షస్థలం ముందుకు వచ్చేట్టు శరీరము నిటారుగా ఉంచాలి. తల కొద్దిగా పైకెత్తి ఉంచాలి. నోటిలో దంతాల వరుసలు ఒకదానితో ఒకటి తగలకుండా ఉంచాలి. దృష్టి అటు ఇటు కదల్చకుండా కేంద్రీకరించాలి. సాధకుడు తమోగుణాన్ని రజోగుణంతో, రజోగుణాన్ని సత్త్వగుణంతో అణచి ఉంచాలి.

సత్త్వగుణమునందేమనస్సును నిలిపి శివధ్యానము చేయడం ఆరంభించాలి. పద్మములో స్థితుడైన ఓంకార స్వరూపుడైన పరమేశ్వరుని దీపంలో వెలిగే జ్యోతి స్వరూపునిగా భావించి ధ్యానించాలి. సాధకుడు తన నాభికి మూడు అంగళముల క్రింద త్రికోణ, పంచకోణ, అష్ట కోణ పద్మములనుమానసికంగా ప్రతిష్టించి ధ్యానించాలి.

తరువాత పద్మములో  అగ్ని సూర్య చంద్రులను ఒకేసారి లేదా క్రమముగా ధ్యానించాలి. ధర్మ అర్ధ కామ మోక్షాలనే పురుషార్ధములను అగ్నిక్రిందగా భావించుకుని, మండలంపై త్రిగుణములను ధ్యానించాలి.  సత్త్వగుణమందుశక్తిశోభితుఢైన రుద్రుని ధ్యానించాలి.

సాధకుడు శాస్త్రము చెప్పినట్లు నాభి పైనగాని, కంఠమునందు గాని, రెండు కనుబొమ్మలమధ్య గాని, శిరస్సు మధ్యలో గాని దృష్టి కేంద్రీకరించి ధ్యానము చేయాలి. సాధకుడు నాలుగు, ఆరు, పది, పన్నెండు, పదహారు దళాలు (రేకులు) గల పద్మము పై కూర్చుని ఉన్న శివుని ధ్యానించాలి.

సాధకుడు పద్మము వంటి తన హృదయంలో మహేశ్వర రూపాన్ని, కమలము వంటి నాభిలో సదాశివ రూపాన్ని, నుదుట చంద్రశేఖర రూపాన్ని, కనుబొమల మధ్య పరమేశ్వర రూపాన్ని ప్రతిష్టించుకుని ధ్యానము చేయాలి.  దివ్యము శాశ్వతముఐనఈస్ధానముల యందు శివధ్యానము చేయడం అభ్యాసం చేయాలి.

సాధకుడు శివధ్యానము చేసేటప్పుడు శరీర మధ్యలో శుద్ధజ్ఞాన రూపంలో ఉన్న సుషుమ్న నాడితో లేక కుంభకంతో ధ్యానించాలి. పిమ్మట హృదయనాభులలో బుద్దిని కేంద్రీకరిస్తూ ముప్పై రెండు రేచకములు చేయాలి. పిదప రేచక పూరకాలు వదలి కుంభక శ్వాసలు మాత్రమే చేస్తూ శరీర మధ్యములో శివుని స్థిరపరచి ధ్యానించాలి. సాధకుడు అప్పుడు శివునితో తాదాత్మ్యము చెంది సంతులన స్థితి పొంది బ్రహ్మానందం అనుభవిస్తాడు.

మునులారా! పన్నెండు ప్రాణాయామాలు ఒక ధారణ అవుతుంది. పన్నెండు ధారణలు ఒక ధ్యానము అవుతుంది.  గురువులు, జ్ఞానులు సంపర్కము చేత గాని, లేక స్వయముగా గాని 
ఈ విధంగా అభ్యాసం చేస్తే క్రమక్రమంగా యోగసిద్దుడు అవుతాడు. యోగాభ్యాసం సులభం కాదు. అనేక కష్టాలు, ఆటంకాలను ఎదుర్కొనవలసి వుంటుంది.  నిరంతరాభ్యాసం చేత ఈ కష్టాలు, ఆటంకాలు తొలగిపోతాయి"

శౌనకాది మునులు "యోగాభ్యాసానికి కలిగే ఆటంకాలు ఏమిటో వివరించండి" అని అడిగారు.

" 1) అలసత్వం లేదా బద్దకం 2)వ్యాధి (రోగాలు) 3)ఉపేక్ష 4)సంశయము 5)చిత్త చాంచల్యం 6)అశ్రద్ధ 7)భ్రాంతి 8) దుఖము 9)నిరాశ 10) విషయ సుఖాసక్తి అనే పది లక్షణాలు యోగాభ్యాసానికి అవరోధాలు.

శరీరానికి బుద్ది భారముఅవడం వలనపనిచేయకుండాఉండటం అలసత్వం అవుతుంది. శరీర నిర్మాణంలో పాలు పంచుకొను పిత్తాది తత్త్వములుసంతులిత స్థితిలోలేకపోవడంవ్యాధిగ్రస్త
మవుతుంది.యోగసాధనముల పై అభావము (శ్రద్ద) లేకుండా ఉండటం ఉపేక్ష అవుతుంది.

ఇది చేయాలా లేకఅదిచేయాలా అనేరెండుభావనలు(ద్వైధీభావము) కలిగిఉండటంసందేహం అవుతుంది. మనస్సుస్థిరముగా ఉంచుకో లేకపోవడమే చిత్త చాంచల్యం. భోగాలు, విషయ సుఖాలపట్లఆసక్తివలనమనస్సు అస్థిరము అవుతుంది. యోగసాధన పై ఆసక్తి లేక పోవడం ఆశ్రద్ధ అవుతుంది.

లక్ష్యము, గురువు, జ్ఞానము, సదాచారం, పరమేశ్వరుని పట్ల విపరీతభావనలుకలిగవుండటం భ్రాంతి అవుతుంది. దుఖము అనేది ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక అనే మూడు విధాలుగా ఉంటుంది. కోరికలు తీరకపోవడం వలన కలిగే మానసిక క్షోభ వలన కూడా దుఖము కలుగుతుంది.

తమోగుణముచేత,రజోగుణం చేత మనస్సు ప్రభావితం అయినప్పుడు కలిగే మానసిక క్షోభ వలన బాధపడు స్థితినే నిరాశ అంటారు. ధనమూ సంపదలు, ఆస్తులు, వస్తువులు, ఆహార నిద్ర మైధునాల పై అమితమైన ఆసక్తి విషయాసుఖాసక్తి అవుతుంది. భౌతిక సుఖాలు, భౌతిక వస్తువులపై కఠోరమైన, కఠినమైన విముఖత, విరక్తి విషయసుఖాసక్తి నుంచి విముక్తి కలిగిస్తుంది. 

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
💜ఓం శ్రీఉమా 
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు🙏 
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

No comments:

Post a Comment