9️⃣8️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*4. జ్ఞాన యోగము.*
(నాలుగవ అధ్యాయము)
*11. యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తధైవ భజామ్యహమ్l*
*మమ వర్త్మాను వర్తన్తే మనుష్యాః పార్థ సర్వశఃll*
ఓ పార్థా! ఏయే మానవులు నన్ను ఏ ప్రకారంగా సేవిస్తారో ఆశ్రయిస్తారో, వారికి ఆ ప్రకారంగానే అనుగ్రహిస్తాను. అందుకే ఈ మానవులు అందరూ నన్నే అనుసరిస్తూ నన్నే సేవిస్తున్నారు.
ఇక్కడ ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే లభిస్తుంది అనే సూత్రాన్ని వివరించాడు పరమాత్మ. ఎవరెవరికి ఎంతెంత భక్తి శ్రద్ధ ఏకాగ్రత ఉంటాయో వాటిని బట్టే వారిని నేను అనుగ్రహిస్తాను అని అన్నాడు. దీనిని మనం లౌక్యంగా తీసుకుంటే మనం ఏ పనిని ఎంత శ్రద్ధతో, భక్తితో, ఏకాగ్రతతో చేస్తామో పరమాత్మ కూడా ఆ మేరకు తన వంతు సహకారం అందిస్తాడు. అంతే కానీ సంవత్సరం అంతా పుస్తకం పట్టకుండా, పరీక్షల సమయంలో ప్రతిరోజూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి, పాడ్ పెన్ దేవుడి ముందర పెట్టి పూజిస్తే దేవుడు ఎటువంటి సాయం చెయ్యడు.
విద్యార్థులు ఇది గ్రహించాలి. అలాగే ఉద్యోగస్థులు కూడా. వారు తను పనిని సమర్థవంతంగా, ఏకాగ్రతతో, శ్రద్ధాభక్తులతో చేస్తే పరమాత్మ తన వంతు సాయం చేసి అతడి ఉన్నతికి తోడ్పడతాడు. అంతేకానీ, ప్రతిరోజూ ఆఫీసుకు లేట్ వెళుతూ, అర్లీగా బయటకు వస్తూ, ఉన్న కాసేపూ కాంటీనులో కాలక్షేపం చేస్తూ, పని ఎగ్గొట్టే వారికి మెమోలు, డిమోషన్లు, తప్పవు. అటువంటివారు రోజూ దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణాలు చేసినా ఫలితం లేదు. అలాగే వ్యాపారస్థులు కూడా ధర్మంగా, న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తే వారి వ్యాపారం వృద్ధి చెందడానికి పరమాత్మ సాయం తప్పకుండా ఉంటుంది. అలా కాకుండా అన్యాయాలు అక్రమాలు చేసి సంపాదించి అందులో కొంత భాగం పెట్టి దేవుడికి వజ్రకిరీటాలు చేయించినా, జైలు జీవితం తప్ప మరే ఫలితం ఉండదు. అలాగే సాధకులు కూడా అడవికి పోయి తపస్సు చేసినా, మనస్సు ఇంటి మీదనే ఉంటే వారికి ఆ సాధన ఫలించదు. ఇంట్లో ఉన్నా నిష్కామంగా కర్మలు చేస్తూ, మనస్సును ఆత్మయందు లగ్నం చేస్తే ముక్తి లభిస్తుంది. ఆఖరున మరొక మాట చెప్పాడు. మానవులు అందరూ నన్నే అనుసరిస్తున్నారు అంటే నన్నే పూజిస్తున్నారు కాని వారి వారి పూజలను బట్టి వారిని అనుగ్రహిస్తాను అని భావము.
దీన్ని కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే మనం అందరం దేవాలయాలకు వెళ్లి, పరమాత్మకు పూజలు చేసి అనేక కోరికలు కోరుకుంటాము. ఈ కోరికల అన్నింటి పరమార్ధము ఏమిటంటే మనకు ఉన్న దుఃఖాలు, కష్టాలు తీరాలి. సుఖాలు రావాలి. ఏ కోరిక కోరినా ఫలితం మాత్రం నాకు సుఖం కావాలి. దుఃఖంపోవాలి. అంటే దుఃఖముల నుండి కష్టముల నుండి విముక్తి, మోక్షం కోరుకుంటున్నాడు. అంతే కదా! ఇది మానవుని ప్రాధమిక స్థితి. ఈ స్థితిలో కూడా వీడికి తెలియకుండానే "మోక్షం" కోరుకుంటున్నాడు. బాగా పరిణతి చెందిన మానవుడు ఈ జనన మరణ చక్రము నుండి మోక్షము, విముక్తి కోరుకుంటే, పరిణతి చెందని మానవుడు దుఃఖముల నుండి, కష్టములు నుండి మోక్షము, విముక్తి కోరుకుంటాడు. ఇంతే తేడా.
మానవుడు తన కష్టముల నుండి దుఃఖముల నుండి విముక్తి, మోక్షము పొందడానికి ఏ కోరిక కోరినా అది ధర్మబద్ధంగా ఉండాలి. ఇతరులకు హాని కలిగించకూడదు. సమాజానికి నష్టం కలిగించకూడదు. అటువంటి కోరికలు పరమాత్మ తీరుస్తాడు. "యధామాం ప్రపద్యస్తే తాం స్తధైవ భజామ్యహమ్" అంటే నన్ను ఎవరెవరు ఏయే కోరికలు కోరుతారో, వారిని ఆయా విధములుగా తృప్తిపరుస్తాను. ఇక్కడ భజామ్యహమ్ అంటే భజన చేస్తాను అని కాదు. తృప్తిపరుస్తాను అని అర్థం. కాని ఆయా కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి. ఎందుకంటే అధర్మాన్ని పరమాత్మ ఎప్పుడూ ప్రోత్సహించడు. ధర్మమును స్థాపించడానికి నేను యుగయుగాలలో అవతరిస్తాను అని అంటుంటే, అధర్మాన్ని పరమాత్మ ఎందుకు ప్రోత్సహిస్తాడు? కాబట్టి పరమాత్మ మనం ఏ కోరిక కోరినా అది ధర్మసమ్మతము, సమాజహితము అయితే తప్పక తీరుస్తాడు.
కాని ఇక్కడ ఒక సందేహము. పరమాత్మ జ్ఞానము, సాయుజ్యము, నిష్కామ కర్మ అని చెబుతూ మరలా ఈ ప్రాపంచికమైన కోరికలు తీర్చడం ఏమిటి అని మీకు సందేహము రావచ్చు. ఎవరైనా మనకు ఒక పని చేసి పెడితే వాడికి సంతోషంగా పది రూపాయలు ఇస్తాము. అంతే కానీ వాడు దానితో ఏం చేస్తాడు. తాగుతాడా! జూదం ఆడుతాడా అని ఆలోచించము. వాడు మనకు సాయం చేసాడు. మన దారిలోకి వచ్చాడు. మనం చెప్పినట్టు చేసాడు. ఇదే ఆలోచిస్తాము. ఇక్కడ కూడా పరమాత్మ "మమ వర్త్మాను వర్తన్తే" అంటే వీడు నన్ను పూజించాడు, అర్చించాడు, కోరికలు కోరాడు. అవి ధర్మబద్ధంగా ఉన్నాయి. వీడు నా దారిలోకి వచ్చి నన్ను పూజించాడు కాబట్టి వాడి కోరికలు తీర్చడం నా విధి అనుకుంటాడు. అందుకే వాడి కోరికలు వాడి వాడి పూజలను బట్టి తీరుస్తాడు. ఇలా తీరుస్తుంటే కొన్నాళ్లకు వాడికే విరక్తి పుట్టి ఈ ప్రాపంచిక విషయాల నుండి మోక్షం పొందుతాడేమో అనే ఆశ. కాబట్టి పరమాత్మ మానవులనందరినీ బాగుచేయాలనే కోరికతో ఉంటాడు. మన క్షేమం కోరుతుంటాడు. పరమాత్మ మార్గము ధర్మమార్గము. మనం కూడా పరమాత్మ మార్గాన్ని అంటే ధర్మ మార్గాన్ని అనుసరిస్తే ఆయన మన కోరికలు తీరుస్తాడు. కాని మనమే పరమాత్మను అనుసరించడం లేదు. మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి, కోరరాని కోరికలు కోరుకుంటూ, అవి తీరకపోతే కోపము, మోహములో పడిపోతూ, కోరి కోరి కష్టాలు కొనితెచ్చుకుంటున్నాము.
(సశేషం)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P232
No comments:
Post a Comment